ప్రమాదాలు–పాఠాలు
ABN, Publish Date - Jan 28 , 2025 | 05:15 AM
రైలు మండిపోతోందన్న వదంతి కారణంగా ఇటీవల పన్నెండు మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అత్యంత విషాదకరమైనది. లఖ్‌నవూ–ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు రేగాయని,...
రైలు మండిపోతోందన్న వదంతి కారణంగా ఇటీవల పన్నెండు మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అత్యంత విషాదకరమైనది. లఖ్‌నవూ–ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు రేగాయని, వ్యాపిస్తున్నాయని ఓ గాలివార్త ప్రచారంలోకి రావడంతో అందులో ప్రయాణిస్తున్నవారంతా తీవ్ర భయాందోళనలకు గురైనారు. మంటలు తమవరకూ వస్తాయని భయపడిన ప్రయణీకులు అలారం చెయిన్ లాగి రైలును నిలిపివేసి హడావుడిగా దిగిపోయారు. ఈ క్రమంలో వారు పక్కన ఉన్న మరో ట్రాకుమీదకు చేరడం వారి పాలిట శాపమైంది. ఆ ట్రాక్‌మీద గంటకు నూటనలభై కిలోమీటర్ల వేగంతో వచ్చిన బెంగుళూరు–న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొనడంతో దేహాలన్నీ నుజ్జునుజ్జయినాయి. అగ్నిప్రమాదం నుంచి తమను తాము రక్షించుకున్నామని అనుకున్నవారు ఇలా క్షణాల్లో మరో విధంగా ప్రాణాలు కోల్పోవలసి రావడం విచిత్రం. అది మలుపు ప్రాంతం కావడంతో జనం ట్రాకులమీద ఉన్న విషయం కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు డైవర్ ముందుగా గుర్తించలేకపోయాడని, గమనించిన వెంటనే బ్రేకులు అదిమినా ఈ ఘోరం జరిగిపోయిందని అంటారు.
బ్రేకులు వేయనిపక్షంలో ప్రమాద తీవ్రత మరింత హెచ్చుగా ఉండేదన్నది నిజం. చెయిన్‌లాగడంతో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఆగిందన్న విషయాన్ని ఎదురుగా వస్తున్న రైళ్ళకు తెలిసేలా ఫ్లాష్‌లైట్ కూడా వేశారట. అయితే, ఈ మొత్తం గందరగోళానికీ, ఘోరానికీ మూల కారణం పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు రేగాయన్న దుష్ప్రచారం. బాధ్యులు ఎవ్వరో దర్యాప్తులో తేలవచ్చును కానీ, వదంతి పూర్తిగా నిరాధారమైనదైతే కాదు. జనరల్ కంపార్ట్‌మెంట్ బ్రేకులు సరిగా లేకపోవడంతో ఆరంభంనుంచి ప్రయాణీకులు ఆందోళనచెందుతూనే ఉన్నారు. బ్రేకులు పడినప్పుడల్లా అవి చక్రాలను గట్టిగాపట్టుకొని మళ్ళీవదలకపోవడం, విపరీతంగా వేడెక్కి నిప్పులు వెదజల్లడం, పొగలు, కాలినవాసన రావడం వంటివి ప్రయాణీకులను భయపెట్టినమాట నిజం.
మృతులకు, బాధితులకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి, గాయపడినవారికి వైద్యచికిత్స కూడా అందుతోంది. ఖరీదైన రైళ్ళకు ఉండే ఆటోమేటిక్ డోర్లు ఇటువంటి సాదాసీదా రైళ్ళకు ఉండవు కనుక గ్రామీణ ప్రయాణీకులు చెయిన్ లాగి దిగిపోవడం వంటి ప్రమాదకర విన్యాసాలు కూడా సులువుగా చేయగలుగుతున్నారు. రైలు ఆగిన తరువాతే డోర్లు లాక్ తెరుచుకోగలిగే వ్యవస్థ జనరల్ రైళ్ళకు కూడా ఉంటే, భారతదేశంలో తరచుగా సంభవించే ఈ తరహాప్రమాదాలను నివారించవచ్చు. తాము ప్రయాణిస్తున్న రైళ్ళు భద్రంగా ఉన్నాయన్న నమ్మకం ఈ దేశ ప్రజల్లో ఇప్పటికీ ఏర్పడినట్టు లేదు. క్షేమంగా ఇంటికి చేరతామన్న భరోసా కానీ, ఎక్కిన రైలుమీద నమ్మకంకానీ లేకపోవడంతో వదంతులు అగ్గిరాజేస్తున్నాయి. ఎవరో పూలమ్ముకొనే ఓ కుర్రాడు అరిచిన అరుపును తప్పుగా అర్థంచేసుకున్నందువల్ల 2017లో ముంబై ఎల్ఫిన్‌స్టోన్ బ్రిడ్జి ప్రమాదం జరిగి, పాతికమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని అంటారు. రైలుప్రమాదాలు వరుసగా జరుగుతూ అవే వార్తలు వింటూ ప్రజల్లో ఒక రకమైన భయం ఆవహించివున్న నేపథ్యం కూడా తాము స్వయంగా ప్రయాణిస్తున్న సందర్భాల్లో తప్పటడుగులకు దారితీస్తుంది. చాలా రైలు ప్రమాదాలకు మానవతప్పిదమే కారణమని అధికారులు తేల్చేయడం జరుగుతున్నప్పటికీ, నిర్వహణ లోపం కూడా అందుకు దోహదపడుతున్న మాట నిజం. ఈ రైలులో బ్రేకింగ్ వ్యవస్థ నిర్వహణ అధమంగా ఉండటంతో విపరీతమైన శబ్దాలతో, చక్రాలు ఊగుతూ, నిప్పులు చిమ్ముతూ ప్రయాణీకులు భయభ్రాంతులు కావడం అంతిమంగా ఈ ప్రమాదానికి దారితీసింది. వదంతిని నమ్మినందుకు ప్రయాణీకులను తప్పుబట్టి, ఈ ఘోరానికి దారితీసిన మిగతా అంశాలను వెనక్కునెట్టేయడం సరికాదు. రైల్లో ఉన్న ప్రతీ ప్రయాణీకుడినీ భద్రంగా ఒడ్డు్కు చేర్చాల్సిన బాధ్యత రైల్వేశాఖమీద ఉంది. ఎనౌన్స్‌మెంట్ వ్యవస్థ గనుక ఈ రైలులో ఉండివుంటే, అగ్గిఅంటుకుందన్న వదంతి మరింత వ్యాపించకుండా ఆపగలిగేవారేమో. దేశంలో ఇటీవల వరుసగా జరుగుతున్న రైలు దుర్ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతీ ప్రమాదం నుంచి పాఠాలు నేర్చుకోవాలి, పరిష్కారాలు అన్వేషించాలి.
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News
Updated Date - Jan 28 , 2025 | 05:15 AM