ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోవా విమోచనలో రేడియో యోధురాలు

ABN, Publish Date - Feb 05 , 2025 | 06:29 AM

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన 139 మంది పద్మవిజేతలలో లిబియా లోబో సర్దేశాయి ఉండడంతో మళ్లీ గోవా విముక్తి పోరాటానికి దన్నుగా నిలిచిన సీక్రెట్ రేడియో ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ వార్తల్లోకి వచ్చింది,,,

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన 139 మంది పద్మవిజేతలలో లిబియా లోబో సర్దేశాయి ఉండడంతో మళ్లీ గోవా విముక్తి పోరాటానికి దన్నుగా నిలిచిన సీక్రెట్ రేడియో ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ వార్తల్లోకి వచ్చింది. 2024 మే 25న తన నూరవ పుట్టినరోజును గోవా రాజధాని పనాజీ నగరంలో జరుపుకున్న అపురూప వనిత లిబియా లోబో. గోవాలో ప్రాక్టీస్ చేసిన తొలి లాయరు మాత్రమే కాదు; స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గోవా, దమన్, దయ్యు కేంద్రపాలిత ప్రాంతానికి టూరిజం డైరెక్టరుగా కూడా ఆమె సేవలందించారు. అంతేకాదు గోవా కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్‌ను ప్రారంభించారు. ఆమె విలక్షణంగా నెలకొల్పిన గోవా ఉమెన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇప్పటికీ కేవలం మహిళా ఉద్యోగులతో దిగ్విజయంగా నడుస్తోంది. Voz da Liberdabe అని పోర్చుగీసు భాషలో, Goenche SodvonechoAwaz పేరుతో కొంకణి భాషలో ప్రసారాలు చేసిన సీక్రెట్ రేడియో చరిత్ర అద్వితీయం.


1961 డిసెంబరు 19న గోవాకు స్వేచ్ఛ సిద్ధించిన వేళ అత్యంత ఆశ్చర్యమనిపించే సంఘటన జరిగింది. లిబియా లోబో, వామన్‌ సర్దేశాయి ఇద్దరూ విమానానికి రేడియో ట్రాన్స్‌మీటర్ బిగించి, ఇంకో లౌడ్ స్పీకర్ అమర్చి, పూలూ కరపత్రాలూ చల్లుతూ, గోవా స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ ఒక రెండు గంటలపాటు ఆకాశయాన ప్రసారం చేశారు! 1955 నవంబరు 25న వారి ఆధ్వర్యంలో మొదలైన సీక్రెట్ రేడియో ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ గోవాకు స్వాతంత్ర్యం లభించిన రోజు ఇలా విజయోత్సవంలో పాల్గొని, ఆ తర్వాత ప్రసారాలు ఆపివేసి విలువైన చరిత్రగా మారిపోయింది.

1510లో గోవా ప్రాంతం పోర్చుగీసు స్థావరంగా మారిపోయింది. బ్రిటీషువారు భారతదేశపు చాలా భాగాలు ఆక్రమించినా పాండిచ్చేరి ఫ్రెంచి వారి చేతిలోకి వెళ్ళిపోయినట్టు గోవా, డయ్యు, డమన్ పోర్చుగీసు చేతిలో ఉండిపోయాయి. గోవాకూ, మిగతా భారతదేశానికి పెద్దగా సంపర్కం లేకుండా సాగిపోయింది. 1932లో గోవా గవర్నర్‌గా యాంటోనియో డి ఒలివీరా సలాజార్ వచ్చిన తర్వాత ఆంక్షలు పెరగడం, ప్రజల హక్కులు హరించడం మొదలైంది. భారత్–-పోర్చుగల్ సంబంధాలు రెండవ ప్రపంచ యుద్ధం అనంతర పరిణామాల మీద ఆధారపడి బెడిసికొట్టాయి. 1940వ దశకం నుంచి స్వాతంత్ర్య పోరాటం గురించి ఆలోచనలు, ప్రయత్నాలు మొదలయ్యాయి. 1954లో దాద్రానగర్, హవేలీ విముక్తి పొందడం కొత్త ఆలోచనలకు ద్వారాలు తీసింది. 1954లో గోవాకు విముక్తి కావాలని సరిహద్దు ప్రాంతంలో శాంతియుతంగా ప్రవేశించిన సత్యాగ్రహులను అప్పటి పోర్చుగీస్ క్రూరంగా చంపివేసింది. దాంతో 1955లో భారత ప్రభుత్వం ‘ఎకనమిక్ బ్లాకేడ్’ ప్రకటించాల్సి వచ్చింది. దీని ఫలితంగా గోవా బంగాళదుంపలను నెదర్లాండ్ నుంచి; కూరలు, బియ్యాన్ని పాకిస్తాన్ నుంచి, టీని శ్రీలంక నుంచి, వైన్‌ను పోర్చుగీసు నుంచి; సిమెంటును జపాన్ నుంచి; ఉక్కును బెల్జియం నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 1961లో చేపలు పట్టే భారతీయుల పడవలపై గోవా కాల్పులకు దిగడంతో పరిస్థితి తారాస్థాయికి చేరింది.


గోవా లిబరేషన్ కోసం బొంబాయి నుంచి రహస్యంగా పోరాడుతున్న నికోలోవ్ మేనెంజీస్, వామన్ సర్దేశాయి, లిబియా లోబో కలసి రెండు వైర్లెస్ రేడియో సెట్లతో రేడియో ట్రాన్స్‌మిటర్‌ను సిద్ధం చేశారు. 1955 నవంబరు 25న ఉదయం 7 గం.లకు ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ అనే సీక్రెట్ రేడియోను వంద కిలోమీటర్ల దూరంలో ఉండే అంబోలి (Amboli) అడవుల నుంచి ప్రారంభించారు. తర్వాత మేనెంజీస్ ఆ బృందం నుంచి వెళ్లిపోవడంతో ప్రసారాలు 50 కిలోమీటర్లు దూరంలో ఉండే కన్నడ ప్రాంతం క్యాజువల్ రాక్‌కు మారాయి. ట్రాన్స్‌మీటర్‌ను ఒక ట్రక్కుకు బిగించి ప్రసారాలు చేసేవారు. గోవా అధికారికంగా చేసే ప్రాపగాండాను వమ్ము చేస్తూ నడిచిన ఈ సీక్రెట్ రేడియో ప్రసారాలకు భారతదేశంతోపాటు ఇతర దేశాల నుంచి కూడా మద్దతు లభించేది. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో వలస పాలనకు వ్యతిరేకంగా నడిచే ఉద్యమాల వార్తలను కూడా ఇచ్చేవారు. ఈ విషయంలో గోవా ఒంటరి కాదనే భావం కలిగించి, ధైర్యం నూరిపోయడానికి వారి వార్తల పరిధిని పెంచారు. ఈ రేడియో ఇండియా భూభాగం నుంచి ప్రసారం అయ్యేది కనుక గోవాలో జరిగే పోరాటానికి మద్దతు ఇస్తూ భారతీయ నాయకుల ప్రసంగాలు కూడా ప్రసారం చేశారు. 1956 జూలై 15న వినోబాభావే తన రేడియో ప్రసంగంలో శాంతియుతంగా గోవాను వదిలి వెళ్ళిపొమ్మని పోర్చుగీసు వారిని కోరారు. భారత పార్లమెంటులో, ఇతర దేశాలలో ఈ విషయంపై జరిగే చర్చల సారాంశాలను కూడా శ్రోతలకు ఎప్పటికప్పుడు అందించేవారు.


1961 డిసెంబరులో ఆపరేషన్ విజయ్‌ మొదలయ్యాక ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ బృందం అడవుల నుంచి బెల్గాం ప్రాంతానికి వచ్చింది. ఆ సమయం నుంచి ప్రతి గంటకూ ప్రసారాలు చేశారు. గోవా ఆర్మీని ఉద్దేశించి భారత రక్షణమంత్రి వి.కె. కృష్ణ మీనన్ 1961 డిసెంబరు 15న ఈ సీక్రెట్ రేడియోలో ప్రసంగిస్తూ చర్చలకు ఆహ్వానించారు. భారత సైన్యం లోపలికే రాకుండా గోవా ఆర్మీ డిసెంబరు 17న బ్రిడ్జిని కూల్చివేసింది. సుమారు 36 గంటలు వాయు, సముద్ర, భూ తలాలపై కూడా భీకర పోరాటం నడిచింది. తర్వాత డిసెంబరు 19న గోవా ప్రాంతం భారత భూభాగంలో కలసిపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం నుంచి ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ రేడియో బృందం గోవా విముక్తి వార్తను ఆకాశ మార్గం గుండా ప్రకటించింది.

1924 మే 25న పనాజీ నగరానికి దగ్గరలో ఉన్న పొర్వోరి గ్రామంలో లిబియా లోబో జన్మించింది. ఆమె కుటుంబం బొంబాయి తరలి వెళ్ళింది. అంబేడ్కర్‌ ప్రారంభించిన సిద్ధార్థ కళాశాల నుంచి డిగ్రీ పొందిన లిబియా లోబో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీకి చెందిన కారాగారవాసుల ఉత్తరాలను చదివి పరిష్కరించేవారు. ఆల్ ఇండియా రేడియో, బొంబాయి కేంద్రంలో స్టెనోగానూ, లైబ్రేరియన్‌గాను సేవలందించిన ఆమెకు కవి నిజీమ్ ఎజ్కిల్ ద్వారా ఎం.ఎన్.రాయ్ పరిచయమవడం విశేషం. గోవా విమోచన మూడవ వార్షికోత్సవం అంటే 1964 డిసెంబర్ 19న వామన్ సర్దేశాయి, లిబియా లోబో వివాహం చేసుకున్నారు. వామన్ సర్దేశాయ్ 1992లో పద్మశ్రీ పొందగా, లిబియా లోబో 2025లో ఆ అవార్డు పొందారు. 1994లో వామన్ సర్దేశాయి మరణించిన తర్వాత ఆయన పేరిట పేదలకు చేయూతనిస్తూ వేదాంత ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించిన లిబియా లోబో ప్రస్తుతం పనాజీలో ఉంటున్నారు.

డా. నాగసూరి వేణుగోపాల్


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 06:29 AM