దౌత్య విధులకు నిధుల కోత!
ABN, Publish Date - Feb 05 , 2025 | 06:31 AM
అంకితభావం, చిత్తశుద్ధి, సహనం, జిజ్ఞాస... ఈ నాలుగు అంశాలు భారతీయులకు దేవుడు ఇచ్చిన వరం. అగ్రరాజ్యం అమెరికా మొదలు ఆఫ్రికాలోని ఇథియోపియా దాకా...
అంకితభావం, చిత్తశుద్ధి, సహనం, జిజ్ఞాస... ఈ నాలుగు అంశాలు భారతీయులకు దేవుడు ఇచ్చిన వరం. అగ్రరాజ్యం అమెరికా మొదలు ఆఫ్రికాలోని ఇథియోపియా దాకా ప్రపంచం నాలుగు దిక్కుల్లోను భారత వైభవం పరిఢవిల్లడానికి ఆ విశిష్టతలే ఒక ప్రధాన కారణం. వైద్య రంగం, నిర్మాణ, ఐ.టి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా భారత్ గౌరవాదరాలు పొందడంలో విదేశాలలోని భారతీయ యువత పాత్ర కీలకమైనది, ప్రశస్తమైనది, అభినందనీయమైనది. ఇటువంటి స్నేహ వారధి వ్యవస్ధ మరే దేశానికి లేదనడంలో అతిశయోక్తి లేదు.
విశ్వ గురువు మన మాతృభూమి అని మనం సగర్వంగా చెప్పుకుంటున్నాం. అందుకు తగినట్లుగా ప్రధాని మోదీ అంతర్జాతీయ దౌత్య వ్యవహారాలలో నిరంతరం నిమగ్నమై ఉంటారు. భారత్ ప్రతిష్ఠను ఇనుమడింపచేయడానికి ఆయన చేయని ప్రయత్నాలు లేవు. దేశ ప్రతిష్ఠ, వైభవాన్ని చాటి చెబుతూ సమస్త దేశాలతోను ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకోవడం ద్వారా జాతి ప్రయోజనాలను సాధించుకోవాలి. ఈ రాజనీతి కర్తవ్య నిర్వహణలో ఏ దేశానికైనా దాని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలకమైనది. అమెరికాతో సహా అనేక అభివృద్ధి చెందిన దేశాల ప్రాబల్యం నలుమూలలలో ఉండడానికి కారణం ఆయా దేశాల విదేశీ వ్యవహారాల శాఖలు తమ జాతీయ ప్రయోజనాలు పరిరక్షించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించే తీరుతెన్నులే.
అంతర్జాతీయ దౌత్య వ్యవహారాలలోకి భారత్ కంటే చాల వెనుక వచ్చిన చైనా వ్యూహాత్మకంగా భారత్‌ను మించిపోతోంది. మన పొరుగు దేశాలు మొదలు ఆఫ్రికా రాజ్యాల దాకా చైనా పై చేయి సాధించడంలో విజయవంతమవుతోంది. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు చరిత్ర్మాకమైనవి అయినా మన తర్వాత చైనా అక్కడ ప్రవేశించి విస్తరించిన తీరు అనూహ్యం. చైనా ప్రభుత్వ దూకుడుకు తోడుగా భారత్ తరహా ప్రవాస యువత ఆ దేశానికి ఉంటే ఆ కమ్యూనిస్టు రాజ్యం పలుకుబడి ప్రపంచవ్యాప్తంగా ఎంత అధికంగా ఉండేదో ఉహించడం కూడ కష్టం. భారత్ విదేశీ వ్యవహారాల శాఖలో ప్రతిభా సామర్థ్యాలకు కొదవ లేదు. కార్యాచరణ విషయానికి వస్తే అది మాటలకు తగినట్లుగా లేదు! గతంతో పోల్చితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా బడ్జెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖకు మెరుగయిన కేటాయింపులు ఉంటున్నాయి, సందేహం లేదు. అయితే ప్రభుత్వం వక్కాణించే విశ్వగురువు ప్రచారానికి అనుగుణంగా కేటాయింపులు లేవు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠను చాటాలనుకుంటున్న ప్రభుత్వం తన మొత్తం బడ్జెట్‌లో కనీసం అర శాతం కేటాయింపులు కూడ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చేయలేదు.
ఈ కీలక శాఖకు 2025–26 బడ్జెట్‌లో రూ. 20,516 కోట్లు కేటాయించగా 2024–25 సవరించిన బడ్జెట్‌లో నిధుల కేటాయింపు రూ. 25,277 కోట్లు. అంటే ఈ సారి రూ. 4,761 కోట్ల కోత విధించారు! వ్యూహాత్మక మిత్ర దేశాలలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన కేటాయింపులు ఏటా నిరాశాజనకంగా ఉంటున్నాయి. ఈ సారీ అదే పరిస్థితి. శ్రీలంకకు రూ.300 కోట్లు, నేపాల్‌కు రూ. 700 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ. 120 కోట్లు కేటాయించారు. అదే విధంగా ఆఫ్ఘానిస్తాన్‌కు రూ. 100 కోట్లు, ఇరాన్–ఆఫ్ఘానిస్తాన్ సరిహద్దులోని చాబహార్ రేవు కేంద్రానికి రూ.100 కోట్ల కేటాయింపు జరిగింది. ప్రస్తుతం అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబాన్ పాలకులకు పాకిస్థాన్ సర్కారుకు పడడం లేదు. పైగా ఇటీవల దుబాయిలో ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రితో భారత్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి సమావేశమైన తర్వాత కూడ ఆ దేశానికి రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత్‌కు అన్ని విధాలుగా సహకరించే భూటాన్‌కు రూ. 2150 కోట్లతో విదేశీ సహాయంలో సింహభాగం ఆ కీలక హిమాలయ రాజ్యానికి కేటాయించడం ముదావహం. భూటాన్‌లో జలవిద్యుదుత్పత్తి, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు భారత్ నిర్మాణాత్మకంగా సహాయం అందిస్తుంది.
ఆధునికీకరణలో భాగంగా, పాస్‌పోర్టుల జారీలో విప్లవాత్మక మార్పులను సర్కారు అమలు చేస్తోంది. ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తూ ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన పాస్ పోర్టులు జారీ చేస్తున్నారు. ఈ దృష్ట్యా పాస్‌పోర్టులు, ఇమ్మిగ్రేషన్ కొరకు ఈ సారి రూ. 1,913 కోట్లు కేటాయించారు. విదేశాలలోని భారతీయ ఎంబసీల నిర్వహణకు ఈ సారి 4,206 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయింపుల (రూ.3969 కోట్లు) కంటే అధికమైనా రూపాయి విలువ పతనమైన విషయాన్ని మరిచిపోకూడదు. పైగా ప్రవాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొనే కీలక గల్ఫ్ దేశాలలో భారతీయుల సహాయార్ధం అదనపు సిబ్బంది నియామకాలకు అవసరమైన నిధులు కేటాయించలేదు. గల్ఫ్‌లో ఏ దేశంలోనైనా న్యాయస్ధానానికి వెళ్ళి భారతీయులకు సహకరించే దౌత్య ఉద్యోగులకుగాను ఒక్క వాహనం కొనుగోలుకు సైతం నిధులు కేటాయించలేదు. బడ్జెటులో విదేశాలలో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు సహాయ కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినా వాటికి కనీసం ఒక కోటి రూపాయలు సైతం ఇవ్వలేదు.
విశ్వగురువు, వికసిత్ భారత్ ఆశయాలకు అనుగుణంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నిధుల కేటాయింపు సమృద్ధిగా ఉంటేనే ప్రపంచ వ్యాప్తంగా భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేరుతాయి. దేశ ప్రతిష్ఠ పెరుగుతుంది.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 05 , 2025 | 06:31 AM