ధ్యానం లాంటి అనుభూతినిస్తుంది!
ABN, Publish Date - Mar 10 , 2025 | 01:03 AM
మన శరీరాన్నీ, ఆలోచనలని, ఉద్వేగాలనీ, ఏకతాటిపైకి తీసుకురాగల శక్తి సృజన ప్రక్రియకు (అది ఏ కళారూపమైనా) ఉందని నమ్ముతాను...
మన శరీరాన్నీ, ఆలోచనలని, ఉద్వేగాలనీ, ఏకతాటిపైకి తీసుకురాగల శక్తి సృజన ప్రక్రియకు (అది ఏ కళారూపమైనా) ఉందని నమ్ముతాను. కళాసృజన ఏకాంతమైన ప్రక్రియ. కళలో నిమగ్న మైన మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో, అతను ఎలాంటి ఎత్తులకు చేరుకోగలడో, ఈ కవిత చెబుతుంది. అనుభూతి ప్రధానమైన ఈ కవితలో, స్థలకాలాల ప్రస్తావనలు కవిత వాతావరణాన్ని సిద్ధపరచి ఉంచి, పాఠకుడిని అలవోకగా ఆ మహా బలిపురం వేకువ లోకి తీసుకుపోతాయి. కళ్ళులేని ఆ సంగీతకారుని ఎదుట కూర్చోబెడతాయి. కవితా త్మకంగా నడవడమొక్కటే కాదు, ‘‘చూశానా, కాదు కరుణించి కనబడ్డాడు’’ లాంటి లోతైన, సాంద్రమైన వాక్యాల ద్వారా, అతన్నీ, కళనీ, దైవాన్నీ కూడా ఒకేసారి స్ఫురింపజేస్తూ పొరలుపొరలుగా పరచుకు న్నందుకు కూడా ఈ కవిత ప్రత్యేకం. ‘‘రగసియం సామీ, ఎనక్కు ఇంగెయే దరిసనమాగుం’’ అంటూ తమిళ పదాల్ని యథాతథంగా వాడడం ద్వారా నిర్దిష్ట సాంస్కృతిక నేపథ్యంలో నిలబడుతూనే, కళలోనే దైవాన్ని చూడడమనే ఒక సార్వత్రిక సందేశా న్నిస్తుందీ కవిత.
వేణువుకున్న రంథ్రాలని అతని కళ్ళుగా పోలిక చేయడం ద్వారా కళ లోంచే అతడు ప్రపంచాన్ని చూస్తున్నట్టు చెప్పడం చాలా నచ్చింది. ఇంద్రియ సరిహద్దుల్ని దాటి, భౌతిక పరిమితుల్ని దాటి ఒక ఆధ్యాత్మిక శిఖరంపై పాఠకుడిని నిలిపినట్టయింది. ఒక అనుభవాన్నో, అనుభూతినో కవిత చేయడం సాధారణంగా చూసేదే గానీ, ఆ కవిత పుట్టిన స్థలకాలాల్లోకి, అను భవంలోకి పాఠకుడిని సునాయసంగా తీసుకెళ్తూ, గాలిలో సంగీతం పరచుకున్నంత తేలికగా, తాను పొందిన ధ్యానం లాంటి అనుభూతినే పాఠకుడూ పొందగలిగేలా చేసింది కాబట్టి ఇది నాకు నచ్చిన కవిత.
నవీన్ కుమార్
89194 46717
For Telangana News And Telugu News
Updated Date - Mar 10 , 2025 | 01:03 AM