Community in Telangana : నేతకానీలకు ప్రత్యేక గ్రూపు కేటాయించాలి పాలకుల్లారా!
ABN, Publish Date - Feb 22 , 2025 | 05:36 AM
మా ‘నేతకానీ’ జాతి మొత్తంగా అస్పృశ్యులం, సోయిలేనోళ్లం, ఫలానాది మాకు కావాలి అని అడగడం కూడా రాని అజ్ఞానులం. వందల ఏళ్లుగా ఎన్నో అవమానాలకు గురైన వాళ్లం.
మా ‘నేతకానీ’ జాతి మొత్తంగా అస్పృశ్యులం, సోయిలేనోళ్లం, ఫలానాది మాకు కావాలి అని అడగడం కూడా రాని అజ్ఞానులం. వందల ఏళ్లుగా ఎన్నో అవమానాలకు గురైన వాళ్లం. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ‘నేతకానీ’ కుల సమూహం ఉందనే గుర్తింపుకీ నోచుకోనివాళ్లం. చదువులు, ఉద్యోగాలు, రాజకీయ వాటాలు దరిచేరని అభాగ్యులం. ఆదిమ తెగలతో గోదావరీనదీ పరివాహక ప్రాంతంలో వందల ఏళ్లుగా జీవిస్తున్నా అభివృద్ధికి నోచుకోనివాళ్లం. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని పేదరికాన్ని అధిగమించి అరుదుగా విద్యను, జ్ఞానాన్ని పొందిన మా మేధావులు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు మా జాతిని మేల్కొలుపుతున్నారు. ఇప్పుడిప్పుడే మాది ఫలానా కులం, ఫలానా వృత్తిదారులం, రాజకీయ వాటా కావాలని అడిగే తెలివి నేర్చుకునే దశలో హఠాత్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా మా ‘నేతకానీ’లను 3వ గ్రూపులో చేర్చడం వల్ల మేం ఇంకా వెనక్కినెట్టబడే ప్రమాదం ఉంది. మీరు నియమించిన ఏకసభ్య కమిషన్ రిపోర్టు ఆధారంగా చూసినా, 2011 జనాభా లెక్కల ప్రకారంగా చూసినా కూడా 3వ అతిపెద్ద కులం మాది. అటువంటి మాకు ప్రత్యేకంగా గ్రూపు కేటాయించకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
సామాజిక వెనుకబాటు ఆధారంగానే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి. అదికూడా సుప్రీంకోర్టు తీర్పుననుసరించి శాస్త్రీయంగా చేయాలి; ఎస్సీ వర్గీకరణలో 1, 2, 3 గ్రూపులుగా పేర్కొనడం కాకుండా ఇదివరకే ఉన్న ఎ, బి, సి, డిలుగా విభజించాలి; సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన మా నేతకానీ, తదితర కులాలను గ్రూపు–1లో చేర్చాలి; ఎస్సీ వర్గీకరణలో మూడవ అతిపెద్ద కులమైన మాకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించాలి; రాష్ట్రంలో ఉన్న ప్రతి నేతకానీ కుటుంబానికి మూడు ఎకరాల భూమితో పాటు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి; ఈ డిమాండ్లు పరిష్కరించలేకపోతే అనాదిగా ఆదివాసీ తెగలతో సహజీవనం చేస్తున్న మా నేతకానీలను ఎస్టీ జాబితాలోనైనా చేర్చాలి.
– నేతకానీ హక్కుల పోరాట సమితి, తెలంగాణ రాష్ట్ర కమిటీ
Updated Date - Feb 22 , 2025 | 05:37 AM