ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్రూనో : సత్యాన్వేషణలో సజీవ స్ఫూర్తి

ABN, Publish Date - Feb 16 , 2025 | 06:10 AM

భూమి గుండ్రంగా ఉందని, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని 1473–1543 మధ్యకాలంలో జీవించిన కొపర్నికస్‌ గుర్తించి, బైబిల్‌ చెప్పే విషయాలు కట్టుకథలని తేల్చాడు.

భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా? భూమే సూర్యుని చుట్టూ తిరుగుతున్నదా? భూమి గుండ్రంగా ఉందా? లేక బల్లపరుపుగా ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానం అనాదిగా మతం చెప్పిందే వేదంగా సాగింది. భూమి గుండ్రంగా ఉందని, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని 1473–1543 మధ్యకాలంలో జీవించిన కొపర్నికస్‌ గుర్తించి, బైబిల్‌ చెప్పే విషయాలు కట్టుకథలని తేల్చాడు. దీనికి అనేక శతాబ్దాల ముందే తమకున్న అరకొర పరికరాల సాయంతో కొందరు గ్రీకు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఫిలోలేస్‌, అరిస్టార్కస్‌లు కూడా ఈ సిద్ధాంతాన్ని నమ్మి, ప్రవచించినా.. మతాచార్యుల కోపానికి జడిసి, తామే తప్పుడు సిద్ధాంతాలు చేసినట్టు లెంపలేసుకోవాల్సి వచ్చింది.

ఇలా లెంపలేసుకోకపోయినా తన ఖగోళ సిద్ధాంతాన్ని ప్రచురించే ధైర్యం కొపర్నికస్‌ కూడా చేయలేదు. తన సిద్ధాంతసారాన్ని లిఖితప్రతి రూపంలో 1514లో ఆయన బయటపెట్టాడు. ‘‘తగు నిరూపణలతో నీ సిద్ధాంతాల్ని మా వద్ద నిరూపించమ’’ని పోప్‌ అవకాశం ఇచ్చినా, కొపర్నికస్‌ ధైర్యం చేయలేదు. చివరకు అతడు మరణశయ్యపై ఉండగా ఆ గ్రంథం ప్రచురితమయింది. అయితే ఆయన మరణానంతరం అది పోప్‌చే నిషేధానికి గురయింది. తర్వాత కొపర్నికస్‌ సిద్ధాంతాల్ని బలపరిచిన వారిని కూడా బంధించి, వేధించారు. కొందర్ని వధించారు. కొపర్నికస్‌ సిద్ధాంతాల్ని సమర్థించిన వారిలో ఇటలీకి చెందిన జోర్డానో బ్రూనో (1518–1600) ముఖ్యుడు. ఈ కారణంగానే ఆయన్ను అనేక సంవత్సరాలు వేధించి, చివరకు వధించారు.

బ్రూనో మతాధికారిగా జీవితం ప్రారంభించినా, ఎక్కువ కాలం అందులో ఇమడలేకపోయాడు. అతను మంచి కవి, తత్వవేత్త, మహోపన్యాసకుడు, స్వాతంత్ర్యప్రియుడు. బైబిల్‌ని పుక్కిట పురాణంగా కొట్టివేసినందుకు, కొపర్నికస్‌ సిద్ధాంతాన్ని బలపరిచినందుకు ఆయన్ని అరెస్టు చేయటానికి ప్రయత్నించగా, తప్పించుకొని ఎన్నో నగరాలు, దేశాలు తిరిగాడు. చివరకు ఒక కపట మిత్రుణ్ణి నమ్మి తిరిగి ఇటలీకి వెళ్లాడు. వెనిస్‌లో బ్రూనోను అరెస్టుచేసి రోమ్‌కు తీసుకువెళ్ళి అక్కడ విచారణ తంతు జరిపి సజీవదహనం శిక్ష విధించారు. మత విశ్వాసాల్ని ధిక్కరించిన పాపి రక్తం కూడా భూమిపై పడకూడదనే భావనతో సజీవదహనం శిక్ష విధించారు.


మత విశ్వాసాల్ని వ్యతిరేకించిన రోజర్‌ బేకన్‌, పెత్రోపొంపోనాట్స్‌ (1462–1515) మతాచార్యులకు భయపడి వెనక్కు తగ్గినా, వారిని మతాచార్యులు కనికరించకుండా నిర్బంధించి, వారి చావుకు కారకులయ్యారు. ఫ్రాన్సుకు చెందిన బుఫాన్‌ అనే శాస్త్రజ్ఞుడు వృక్ష, జంతు, ప్రకృతి శాస్త్రాల్లో కొన్ని శాస్త్రీయ సత్యాలు కనుగొన్నా, చివరకు నేను చెప్పినవి తప్పు, నా తప్పిదాన్ని మన్నించమని లిఖితపూర్వకంగా పత్రం రాసి, మతాచార్యుల ఆగ్రహం నుంచి తప్పించుకున్నాడు. చివరకు గెలీలియో కూడా మతాచార్యుల ముందు తలవంచాడు. అయితే తాను చెప్పింది నిజమని కడ వరకూ నిల్చినవాడు సోక్రటీస్‌. ఈయనతో పోల్చదగినవాడు మానవ చరిత్రలో మరో శాస్త్రజ్ఞుడు లేడని ఎక్కువమంది విశ్వాసం.

ఆరు సంవత్సరాల సుదీర్ఘకాలం విచారణ జరగటంతో బ్రూనో కూడా కొంత మెతకతనం ప్రదర్శించాడని నార్ల వెంకటేశ్వరరావు తన జాబాలి నాటిక ముందుమాటలో పేర్కొన్నారు. కాని ‘‘మరణ దండన పొందిన నాకంటే దాన్ని నాకు విధించిన మీరే ఎక్కువ గజగజలాడుతున్నారని’’ ధీరోదాత్తంగా పలికాడు బ్రూనో. విచారణ అనంతరం ‘‘నేను బలవర్మణం పొందవచ్చు. అయితే అనేకమంది జీవితాల కంటే నా మరణం ఉత్తమమైనది కాగలదు’’ అన్న బ్రూనో మాటలు విచారణ సమయంలో రికార్డు చేయబడ్డాయి. వీటిని బట్టి బ్రూనో వీరోచితంగానే మరణాన్ని స్వీకరించాడని, ఎవరి ముందూ తలవంచక తన విశ్వాసంపై నిలబడ్డాడని అర్థమవుతుంది. కనుకనే బ్రూనో సజీవదహనం పొందిన రోజుని (ఫిబ్రవరి 17) సత్యాన్వేషణ దినంగా ప్రకటించారు. చనిపోయే నాటికి బ్రూనో వయస్సు 52 సంవత్సరాలు. ఆయన చనిపోయిన 30 సంవత్సరాల తర్వాత అది తప్పిదంగా గుర్తించి, సజీవదహనం గావించిన స్థలంలో ఒక స్థూపాన్ని నిర్మించి, ఆయన్ను అమరజీవిగా ప్రకటించారు.

చెరుకూరి సత్యనారాయణ

Updated Date - Feb 16 , 2025 | 06:10 AM