ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీకాళహస్తిలో కమ్యూనిస్టు కేతనం

ABN, Publish Date - Jan 28 , 2025 | 05:21 AM

బ్రిటిష్‌ వలసపాలనకు వ్యతిరేకంగా జాతీయోద్యమం విజయం సాధించటం ప్రపంచ చరిత్రలోనే అపూర్వ సంఘటన. ప్రజా సంకల్పబలానికి, పోరాట పటిమకు జాతీయోద్యమం నూతన భాష్యం చెప్పింది...

బ్రిటిష్‌ వలసపాలనకు వ్యతిరేకంగా జాతీయోద్యమం విజయం సాధించటం ప్రపంచ చరిత్రలోనే అపూర్వ సంఘటన. ప్రజా సంకల్పబలానికి, పోరాట పటిమకు జాతీయోద్యమం నూతన భాష్యం చెప్పింది. మానవ చరిత్రలో సామాన్య ప్రజలు సాగించిన మహోజ్వల పోరాటాల్లో అద్వితీయ స్థానాన్ని సంపాదించుకుంది. 1885 నుంచి 1947 వరకూ వివిధ దశల్లో సాగిన జాతీయోద్యమం వివిధ వర్గాల ప్రజల శక్తియుక్తులను తనలో ఇముడ్చుకోగలిగింది.

జాతీయోద్యమ వాతావరణంలో ఎదిగిన పసుపులేటి వెంకటప్పయ్య ఒక సామాన్య కుటుంబంలో పుట్టి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడంతో పాటు కమ్యూనిస్టు నాయకుడుగా ఎదుగుతూ ఉద్యమాలు చేసి చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో విప్లవ కెరటంలా వెలుగొందాడు. శ్రీకాళహస్తి పట్టణంలో రాధాకృష్ణ, కమ్మలమ్మ దంపతులకు 1925 జనవరి 25న వెంకటప్పయ్య జన్మించాడు. ఎస్‌ఎస్‌ఎల్‌సి వరకు చదివాడు. చిన్నతనంలోనే కమ్యూనిస్టు భావాల్ని జీర్ణించుకొని జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. పదహారేళ్ల వయసులోనే ‘తెల్లదొరలారా! ఇక మీ ఆటలు కట్టిపెట్టి ఇండియాను వదిలి ఇంగ్లండ్‌ పారిపోవాలి’ అంటూ క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. చిత్తూరు జిల్లా తూర్పున తొలి తరం కమ్యూనిస్టు నాయకత్వానికి చుక్కానిలా నిలిచాడు. సీపీఎం జిల్లా ప్రప్రథమ కార్యదర్శిగానూ పనిచేశాడు. స్వాతంత్ర్య పోరాటంలో, కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 17వ ఏట క్విట్‌ ఇండియా పోరాటం జరుగుతున్న సమయంలో శ్రీకాళహస్తి మీదుగా వెడుతున్న గూడ్సురైలు పట్టాలను అక్కుర్తి వద్ద తొలగించాడు. ఈ సంఘటనలో రైల్వేకి రూ.40వేల నష్టం సంభవించింది.


దీంతో ఆయన్ని అరెస్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రహస్య ప్రదేశంలో తలదాచుకున్నాడు. అయినా బ్రిటిష్‌ ప్రభుత్వం 1942లో వెంకటప్పయ్యను మూడు నెలల పాటు వేలూరు సెంట్రల్‌ జైల్‌లో, కొంతకాలం కడలూరు జైల్లో నిర్బంధించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వెంకటప్పయ్యకు వెయ్యి రూపాయలు జరిమానా విధించడంతో ఆ డబ్బును కోర్టులో కట్టి జైలు నుంచి బయటికి వచ్చాడు. ఈయనకు వలె పసుపులేటి సుబ్బరామదాస్‌కు ప్రభుత్వం అక్కుర్తి డీరైల్‌మెంట్‌ కేసులో 1942 అక్టోబర్‌ 17న కఠిన కారాగారశిక్ష విధించి ఆలీపురం క్యాంప్‌ జైలులో కొంతకాలం బందీగా ఉంచి, తరువాత బళ్లారి వెల్లసీ శానిటోరియం జైలులో ఉంచింది. కడకు 1946 మార్చి 30న ఆయన విడుదలయ్యారు. అక్కుర్తి సంఘటనకు పసుపులేటి వెంకటప్పయ్య, పసుపులేటి సుబ్బరామదాస్‌, గున్నేరి నారాయణరెడ్డి, పి.డి. వీరాస్వామి, అప్పలకూటి వెంకటేశం, ఎస్‌. వెంకటసుబ్బయ్య, మార్కొండ సుబ్రమణ్యం, పి. వేణుగోపాల్‌, ఎస్‌. అనంతరామన్‌, పి. బాలగంగయ్య, మేలచ్చూరు కిష్టమ్మ, ఎల్‌. రామలింగారెడ్డి, నాగోలు సుబ్బారెడ్డి, నాగోలు ఈశ్వరరెడ్డి, రుమ్మాల అంకిరెడ్డి, జి. వెంకటరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, తొండగంగడు, పోలుగాడు, కె. గుండయ్య (గున్నయ్య), వెంకాయల వెంకటయ్య, వెంకట్రాయలు, సంగవరం వెంకటరామ నాయుడు, ఇరగంటి పురుషోత్తం, ముచేలి వీరరాఘవ చెట్టి, కాళప్పనాయుడు.


కమ్యూనిస్టు నేతగా వెంకటప్పయ్య బందీ కావడానికి ముందు 17 సంవత్సరాల వయసులోనే కంచుపట్ర కార్మికసంఘం, చేనేత, బీడీ కార్మిక, పారిశుధ్య కార్మికుల కోసం సంఘాలు ఏర్పాటు చేసి వారి సమస్యల కోసం పోరాటాలు నిర్వహించారు. దీంతో బ్రిటిష్‌ ప్రభుత్వం వెంకటప్పయ్యపై నిఘా ఉంచింది. 1942లో శ్రీకాళహస్తి కమ్యూనిస్టు పార్టీ స్థాపించి కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారు. స్వాతంత్ర్యానంతరం 1948లో తన మేనత్త కుమార్తె తులసమ్మను వివాహం చేసుకున్నారు. తులసమ్మ కూడా భర్తనే అనుసరించింది. పత్రికలు ప్రాచుర్యంలో లేని ఆ రోజుల్లో చైనా దేశం నుంచి నెలనెలా వెంకటప్పయ్యకు పత్రికలు వచ్చేవి. తన భావాలను, ఉద్యమాలను పదిమందికీ తెలియజేయాలనే లక్ష్యంతో కరపత్రాల ముద్రణ కోసం సొంతంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ముద్రణాయంత్రం ఇప్పటికీ ఆయన నివాసంలో ఉంది. జర్నలిజంపై మక్కువతో తన చిన్న కుమార్తెను ఆ రంగంలో ప్రవేశపెట్టారు. ఎమర్జెన్సీ కాలంలో వెంకటప్పయ్యపై నిఘా ఉంచడంతో ఒకటిన్నర సంవత్సరాలు మారువేషంలో తిరిగారు. ఆయన జీవితంలో ఎనిమిది సంవత్సరాలు జైలోనే గడిపారు. 1958లో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎనిమిది రోజులు నిరాహారదీక్ష చేపట్టి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.


1964లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నుంచి విడిపోవడంతో వెంకటప్పయ్య సీపీఎం వెంట నిలబడ్డారు. చిత్తూరు జిల్లా సీపీఎం ప్రప్రథమ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా కంచుపట్ర ఉద్యమంలో కార్మికులకు అండగా నిలిచి ఎనలేని పోరాటాలు చేశారు. అప్పట్లో పానగల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో పదుల కొద్దీ కంచుపట్ర ప్రైవేటు కర్మాగారాలు ఉండేవి. అక్కడ కార్మిక యూనియన్లు ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం పోరాటాలు చేశారు. కాళంగి రిజర్వాయర్‌ నిర్మాణ క్రమంలో ముంపునకు గురయ్యే పొలాల రైతులతో కలసి పోరాటం చేశారు. పుచ్చలపల్లి సుందరయ్యతో ప్రత్యక్ష సంబంధాలు కలిగివుండేవారు. సామాజిక రుగ్మతలను తొలగించడంలో కీలకపాత్ర పోషించారు. వెంకటప్పయ్యకు శ్రీకాళహస్తిలోని పాత మధు థియేటర్‌ (ప్రస్తుతం అమరజ్యోతి కల్యాణమండపం), రాధాకృష్ణా టూరింగ్‌ టాకీస్‌ (ఒకప్పటి వెంకటేశ్వర మహల్‌, ప్రస్తుతం చైతన్య స్కూల్‌)తో పాటు సినిమా వీధిలో నాలుగు గృహాలు ఉండేవి. అయితే తన పోరాటాల కోసం ఆస్తిని సైతం పోగొట్టుకున్నారు వెంకటప్పయ్య. 1962 శ్రీకాళహస్తి నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి బలరామరెడ్డి చేతిలో కేవలం 1100 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కుప్పం నుంచి వజ్రవేలు శెట్టి, పుత్తూరు నుంచి శివయ్య, తంబళ్లపల్లి నుంచి సి.కె. నారాయణరెడ్డి సీపీఎం తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వెంకటప్పయ్య ఉపన్యాసానికి శత్రువులు కూడా చెవులప్పగించి వినేవారు. వెంకటప్పయ్య శ్రీకాళహస్తిలో స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించారు. శ్రీకాళహస్తి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎనలేని సేవలందించారు. 1996 నవంబర్‌ 28న శ్రీకాళహస్తిలో వెంకటప్పయ్య మరణించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, కమ్యూనిస్టు నేతగా నేటితరానికి ఆయన ఆదర్శనీయుడు.

డా. ఎం. దీనదయాళ్‌

అకడమిక్‌ కన్సల్టెంట్‌, చరిత్ర శాఖ,

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి


ఇవి కూడా చదవండి..

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 28 , 2025 | 05:21 AM