ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొలంబియా ధిక్కారం

ABN, Publish Date - Jan 28 , 2025 | 05:29 AM

ట్రంప్, అమెరికా రావడం నాకేమంత సంతోషాన్నిచ్చే విషయంకాదు. నిజానికి, కొంత విసుగు కూడా వస్తుంది. అయితే, కొన్ని నచ్చిన విషయాలు కూడా లేకపోలేదు. వాషింగ్టన్ నగరంలో నల్లజాతి ప్రజలు నివసించే ప్రాంతాలని సందర్శించడం నాకు అక్కడ ఇష్టం....

ట్రంప్,

అమెరికా రావడం నాకేమంత సంతోషాన్నిచ్చే విషయంకాదు. నిజానికి, కొంత విసుగు కూడా వస్తుంది. అయితే, కొన్ని నచ్చిన విషయాలు కూడా లేకపోలేదు. వాషింగ్టన్ నగరంలో నల్లజాతి ప్రజలు నివసించే ప్రాంతాలని సందర్శించడం నాకు అక్కడ ఇష్టం. అమెరికా రాజధాని నగరంలో బారికేడ్లతో నల్లజాతి ప్రజలు, లాటినో ప్రజల మధ్య ఘర్షణని నేను చూశాను. వారూ వీరూ ఏకం కావాల్సి ఉంది కాబట్టి, ఆ ఘర్షణ అర్థంలేనిది.


కవి వాల్ట్ విట్మన్, వాగ్గేయకారుడు పాల్ సైమన్, మేధావి నోమ్ చామ్‌స్కీ, నవలా రచయిత హెన్రీ మిల్లర్‌ అభిమానిని నేను. నా రక్త సంబంధీకులైన శాకో, వాంజెట్టిలు అమెరికా చరిత్రలో చిరస్మరణీయులు. వాళ్ళ వారసత్వాన్ని నేను అనుసరిస్తాను. కార్మిక నాయకులు అయినందుకు వాళ్ళని అమెరికాలోని ఫాసిస్టులు మరణశిక్ష విధించి చంపేశారు. అలాంటి ఫాసిస్టులే మా దేశంలోనూ ఉన్నారు.

ట్రంప్‌, మీ దేశపు చమురు అంటే నాకు అసహ్యం. అది దురాశతో మానవాళికి చేటు కలిగిస్తుంది. నాకు జీర్ణాశయవ్యాధి ఉంది గనక తాగకూడదు. అయినా, ఏదో ఒకరోజు విస్కీ తాగుతూ, మనం దీని గురించి సూటిగా మాట్లాడుకోవచ్చు. అయినా, అది సాధ్యం కాదేమో. మీరు కొలంబియన్లని హీనజాతికి చెందినవాళ్ళని అనుకుంటూ ఉంటారు. మేము హీనులం కాదు. కొలంబియన్లు ఎవరూ హీనజాతీయులు కాదు.


మీరు ఒక మొండి ఘటం కోసం చూస్తుంటే, ఆ వ్యక్తిని నేనే. ఇందులో వేరే మాట లేదు. మీ ఆర్థిక బలిమితోటి, మీ దురహంకారంతోనూ అల్లెండీ ప్రభుత్వాన్ని కూల్చినట్లు, నా ప్రభుత్వాన్ని కూడా కూల్చే కుట్రకి తెరదీయవచ్చు. కానీ, నేను నా విశ్వాసాలకి దృఢంగా కట్టుబడతాను. నేను చిత్రహింసలని ప్రతిఘటించాను. మిమ్మల్ని కూడా ఎదిరిస్తాను. మేము చాలామందిని భరించాం, మా స్వేచ్ఛని సాధించుకున్నాం. కొలంబియాలో స్వేచ్ఛాప్రియులు ఉండాలని నేను కోరుకుంటాను. మీరు కలిసిరాకపోతే, నేను ఇతర దేశాలవైపు చూస్తాను. కొలంబియా ప్రపంచం మధ్యలో ఉంది. ఇది పసుపుపచ్చ సీతాకోకచిలుకల దేశం, ఔరెలియోనో బెందియా వంటి సేనానాయకుల దేశం. ఆ పరంపరకు చెందివాడినే నేను. బహుశా ఆఖరువాడినేమో.

మీరు నన్ను హత్య చేయవచ్చు. కానీ, నేను నా జనంలో జీవించి ఉంటాను. మేము అమెరికా దేశాలలో మీకంటే ముందునుంచే జీవిస్తూ ఉండిన జనాలం. గాలీ, పర్వతాలూ, కరీబియన్ సముద్రమూ, స్వేచ్ఛా కలగలిసి ఊపిరిపోసుకున్న ప్రజలం మేము. మీకు మా స్వేచ్ఛ అంటే నచ్చదు. సరే. నేను శ్వేతజాతికి చెందిన బానిస యజమానులతో కరచాలనం చేయబోను. శ్వేతజాతికి చెందిన స్వేచ్ఛాప్రియులతోటీ, అబ్రహాం లింకన్ వారసులతోటీ, అమెరికాలోని నల్ల రైతులు, శ్వేతజాతి రైతులతోటీ చేయి కలుపుతాను. కోవిడ్ నుంచి బతికి బట్టకట్టాక, ఇటలీ టుస్కనీ పర్వతాల అవతల యుద్ధరంగాన్ని చేరుకున్న తర్వాత వాళ్ళ సమాధుల దగ్గర నేను కన్నీరు కార్చాను, ప్రార్థనలు చేశాను. అమెరికా అంటే, నా దృష్టిలో వాళ్ళు మాత్రమే. వాళ్ళకే నేను తల వంచుతాను. మరెవ్వరికీ కాదు. దేశాధిపతీ, నన్ను పడగొట్టు. అమెరికా దేశాల ప్రజలూ, మానవాళీ స్పందిస్తారు.


కొలంబియా ఇక ఉత్తర దిశవైపు చూడదు. ప్రపంచం వైపు చూస్తుంది. కొర్డోబా ఖలీఫా నాగరికతలో మా మూలాలు ఉన్నాయి. రిపబ్లిక్‌ని ఏర్పాటుచేసిన మధ్యధరా ప్రాంత రోమన్ లాటిన్ జనాలలోనూ, ప్రజాస్వామ్యాన్ని స్థాపించిన ఏథెన్స్ జనాలలోనూ మా మూలాలు ఉన్నాయి. మీరు ఇక్కడికి బానిసలుగా కొనితెచ్చిన నల్ల జాతీయుల ప్రతిఘటనా స్ఫూర్తి మా రక్తంలో ప్రవహిస్తుంది. వాషింగ్టన్ నగరం నిర్మాణమయినదానికంటే ముందే, అమెరికా దేశాలన్నిటిలో స్వేచ్ఛాయుతంగా పరిఢవిల్లిన ప్రాంతం కొలంబియా. అక్కడ, ఆ నల్లజాతి ప్రజల ఆఫ్రికా గీతాలలో నేను సేదదీరుతూ ఉంటాను.

ఈజిప్షియన్ ఫారోల కాలంలోనే హస్తకళలు వికసించి, చిరిబికెట్ తొలి చిత్రకారులు నడయాడిన నేల మాది. మీరు మమ్మల్ని ఎప్పటికీ శాసించలేరు. స్వేచ్ఛ కోసం గర్జించి, సైమన్ బొలివర్ నాయకుడై కాపాడిన సీమ మాది. మా ప్రజలు కొంచెం భయస్తులు, సిగ్గరులు, అమాయకులు, దయగల మనుషులు. మా నుంచి మీరు దౌర్జన్యంగా లాక్కున్న పనామా కాలువని తిరిగి ఎలా స్వాధీనం చేసుకోవాలో మా జనాలకు తెలుసు. ఒకనాడు కొలంబియాగా, ఇప్పడు పనామాలో భాగంగా కొనసాగుతున్న బొకాస్ డెల్ టోరో ప్రాంతంలో మీరు హతమార్చిన రెండువందల మంది లాటిన్ అమెరికా యోధులు అక్కడే విశ్రమిస్తున్నారు.


నేను ధిక్కార పతాకాన్ని ఎగరవేస్తున్నాను. నేను ఒంటరిగానే నిలబడినా, మా పూర్వీకుడు గైటాన్ చెప్పినట్లు ఈ జెండా లాటిన్‌ అమెరికన్‌ ఆత్మగౌరవంతో తలెత్తుకుని సగర్వంగా నిలబడుతుంది. అమెరికా దేశాధిపతీ, మీ పూర్వీకులు అమెరికాకి వలస వచ్చిన మనుషులు. మీ దిగ్బంధం మమ్మల్ని భయపెట్టబోదు. కొలంబియా అందమైన దేశం మాత్రమే కాదు, అది భూమికి మధ్యలో, ప్రపంచపు హృదయమై వుంది.

ఈ రోజు నుంచి కొలంబియా ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. చేతులు చాచి అందరినీ ఆహ్వానిస్తున్నది. మేము స్వేచ్ఛ, జీవితం, మానవతా నిర్మాతలం. మా శ్రమ ఫలితంగా అమెరికాలో ప్రవేశించే వస్తువుల పైన మీరు 50శాతం సుంకం విధించబోతున్నారని తెలిసింది. మేమూ అదే పని చేస్తాము. మా ప్రజలు ఇక మొక్కజొన్న పండిస్తారు. మొక్కజొన్న పంటని కనిపెట్టింది కొలంబియాలోనే. మా ప్రజలు మొక్కజొన్నతో ప్రపంచం కడుపునింపుతారు.

అనువాదం: సుధాకిరణ్‌


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 05:29 AM