అమెరికా గతం... భారత్‌కు భయం!
ABN, Publish Date - Feb 04 , 2025 | 05:57 AM
సామాజిక జీవితంలో అన్నికంటే కష్టమైంది.. గతాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నించటం! ప్రవహించే నదిలో రెండోసారి కాలుపెట్టలేమని గ్రీకు తత్వవేత్త హెరాక్లైటస్ 2500 ఏళ్ల క్రితమే చెప్పాడు....
సామాజిక జీవితంలో అన్నికంటే కష్టమైంది.. గతాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నించటం! ప్రవహించే నదిలో రెండోసారి కాలుపెట్టలేమని గ్రీకు తత్వవేత్త హెరాక్లైటస్ 2500 ఏళ్ల క్రితమే చెప్పాడు. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి గతంలోకి వెళ్లనూలేం. దాన్ని పునరుద్ధరించనూ లేం. ఈ సత్యం సాధారణ వ్యక్తులకూ తెలుసు. అందుకే స్వతహాగా వాళ్లు ఆ ప్రయత్నాలు చేయరు. వర్తమానంలో పడుతున్న బాధలు గతంలో ఉండేవి కావనీ ధర్మం నాలుగు పాదాల మీద నడిచే యుగం ఒకప్పుడు ఉండేదన్న భావన అన్ని నాగరికతల్లో కనపడుతుంది. గతంలో ఉందో లేదో తెలియని అటువంటి యుగం.. భవిష్యత్తులో ఏర్పడాలని కోరుకోటానికీ, దానికోసం ప్రయత్నించటానికీ ఒక ఆదర్శంగా ప్రజలకది అప్పుడప్పుడూ ఉపయోగపడుతుంది. మంచికీ చెడుకూ దాన్ని వాడుకున్న సందర్భాలు చరిత్రలో కనపడతాయి. పలు గిరిజనుల పోరాటాల్లో అది ఎంతోకొంత ఉపయోగపడింది. దానికి భిన్నంగా మతోన్మాదం కోసం, జాత్యహంకారం కోసం, నియంతృత్వ స్థాపన కోసం దాన్ని వినియోగించుకున్న సంఘటనలూ ఉన్నాయి.
ఆధునిక ప్రజాస్వామ్యంలో సంప్రదాయ ధర్మయుగ పునరుద్ధరణకు ప్రయత్నించటం చాలా అరుదు. దాని జోలికి వెళ్లకపోయినా చరిత్ర పుటల్లోకి ఎక్కిన ఘనమైన గతాల పునరుద్ధరణకు ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. అమెరికాను మళ్లీ గొప్పదేశంగా మారుద్దామని (మేక్ అమెరికా గ్రేట్ అగెన్) డొనాల్డ్ ట్రంప్, ఆయన అనుచరులూ చేస్తున్న హడావుడిలో ఇదే కనపడుతుంది. నిజమే! ఒకప్పుడు అమెరికాకు అన్నింటా ప్రథమ స్థానమే ఉండేది. అది క్రమేపీ పడిపోతున్నా ఇప్పటికీ అమెరికాకు ఆ స్థానం ఇంకా మిగిలే ఉంది.
భౌగోళికంగా ఎన్నో అనుకూలతలు, ప్రపంచ యుద్ధాల్లో జరిగిన అతితక్కువ నష్టం, వలసదోపిడీయే లేని చరిత్ర, ఆఫ్రికా నుంచి కొనుగోలుచేసిన నల్లజాతి వారితో చేయించిన కఠిన శ్రమ, తిండి గింజలకు ఏ దేశం వైపు చూడాల్సిన అవసరం లేని పరిస్థితి, నిరంతరం కొత్త భూముల్లోకి విస్తరించగలిగే సౌలభ్యం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ప్రపంచ యుద్ధాలు... యూరపు దేశాలకూ ఆసియా, ఆఫ్రికాలకూ వినాశనాన్నీ విపరీత జననష్టాన్నీ తెస్తే అవే యుద్ధాలు అమెరికాను వస్తూత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపాయి. ఆయుధ తయారీ పరిశ్రమల్లో అమెరికాకు పోటీ లేకుండా చేశాయి.
ఏ దేశానికైనా భారీ పరిశ్రమలూ అవి ఉత్పత్తిచేసే యంత్రాలూ వాటితో తయారైన వస్తువులూ పరికరాలూ ఆయువుపట్టుగా ఉంటాయి. పారిశ్రామిక విప్లవం (1760) బాగా విస్తరించిన తర్వాత ఏ దేశ శక్తినైనా వాటితోనే కొలవటం సాధారణమైంది. ఇప్పుడు దానికి అమెరికాలో కొరత ఏర్పడింది. పలు భారీ పరిశ్రమలు వేరే దేశాలకు తరలిపోయాయి. పారిశ్రామిక ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఎగుమతులతో పోల్చితే దిగుమతులు పెరిగాయి. 2023లో వాణిజ్యలోటు 779.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పారిశ్రామిక ఉత్పత్తుల కోసమే కాదు సేవల రంగానికి (సర్వీస్ సెక్టర్) సంబంధించి కూడా ఇతర దేశాలపై ఆధారపడటం పెరిగింది. పొరుగుసేవలు (ఔవుట్‌సోర్సింగ్) అనివార్యమయ్యాయి. సమాచార సాంకేతికత వీటిని సులభం చేసింది. నిరుద్యోగం నిరంతరం పీడించే సమస్యగా మారింది. వలస వచ్చిన విదేశీ నిపుణులతో పోటీపడటం కష్టమైంది.
1945–1970 మధ్య కాలాన్ని ఆర్థికాభివృద్ధిపరంగా పాశ్చాత్య దేశాలకు స్వర్ణయుగంగా భావిస్తారు. ఉద్యోగ కల్పన గరిష్ఠస్థాయికి వెళ్లటం... సామాజిక భద్రతా పథకాల అమలు.. పారిశ్రామిక ఉత్పాదకతలో గణనీయ పెరుగుదల.. సంక్షేమ రాజ్యదృష్టితో ప్రభుత్వాలు వ్యవహరించటం.. కార్మిక సంఘాలు బలంగా ఉండటం.. అసమానతలు అదుపులో ఉండటం ఆ కాలంలో జరిగింది. ఆ తర్వాత సంక్షోభ కాలాలు మొదలయ్యాయి. 1973లో చమురు ఉత్పత్తి దేశాలు కూడబలుక్కుని ధరలు పెంచటం ప్రపంచాన్ని కుదిపివేసింది. 1970 నాటికి బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర 3.35 డాలర్లు ఉంటే 1980ల నాటికి అది 37.38 డాలర్లకు చేరుకుంది. అంతా సర్దుకున్నట్లే కొంతకాలం అనిపించటం, ఆ తర్వాత కొంతకాలానికే ఆర్థికంగా అతలాకుతలం అవ్వటం, తిరిగి మళ్లీ పుంజుకోవటం.. ఇలా ఆర్థిక వ్యవస్థ కొంతకాల వ్యవధిలో పైకీ కిందకీ అవ్వటం సాధారణమైపోయింది.
ఈ సంక్షోభాలకు ప్రభుత్వాల అతి నియంత్రణే కారణమనీ సంక్షేమరాజ్యం కొత్త ఆవిష్కరణలకు అడ్డంకిగా నిలిచిందనీ సామాజిక భద్రతా పథకాలు భారంగా మారాయనీ ప్రభుత్వాల అతి వ్యయం భారంగా పరిణమించిందనీ స్వేచ్ఛా వాణిజ్యానికి ప్రభుత్వాల విధానాలు అవరోధాలయ్యాయనీ, పెట్టుబడుల స్వేచ్ఛా ప్రవాహాలకు అడ్డుగోడలు తయారయ్యాయనీ.. పలు వాదనలు బయలుదేరి సరళీకృత ఆర్థిక విధానాలే వీటికి విరుగుడనే భావన బాగా బలపడింది. మరోవైపు చైనాలోనూ రాజకీయ మార్పులు మొదలయ్యాయి. ప్రైవేటురంగానికి అక్కడ ప్రాధాన్యత పెరిగింది. 1980ల చివరినాటికి రష్యాతో సహా సోషలిస్టు ప్రభుత్వాలన్నీ కూలిపోయాయి. ప్రైవేటీకరణతో అంతా సర్దుకుని ఆర్థిక వృద్ధి పరుగులు తీస్తుందనే భావన ఎన్నాళ్లో నిలవలేదు. యుద్ధాలకూ అంతర్యుద్ధాలకూ అడ్డుకట్టపడలేదు. ఆర్థిక సంక్షోభాలూ సమసిపోలేదు. ఆగ్నేయాసియా దేశాల్లోనూ సంక్షోభం (1998) తలెత్తింది. ఇక 2007–08లో అమెరికాను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా ప్రభావాన్ని చూపింది.
ఆర్థిక సంక్షోభాలు తీవ్రమైనప్పుడల్లా రాజకీయాల్లో విపరీత పోకడలు కనపడతాయి. శ్వేతజాతి ఆధిపత్య భావనలతో పాటు వలస జీవులపై వ్యతిరేకతలనూ ఎగదోయటం సంక్షోభాల కాలాల్లో చాలా సులువు. ట్రంప్ చేసిందీ అదే. గడిచిన వైభవాన్ని పునరుద్ధరిస్తామని పదేపదే చెప్పటం సంక్షోభాల కాలంలో ఎక్కువగా కనపడుతుంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడైన వెంటనే ‘మేక్ ఇన్ అమెరికా’ తన ప్రాధాన్యతగా చెప్పటంతో పాటు ఇతర దేశాల్లో ఉత్పత్తిచేసి అమెరికాలో అమ్మాలనుకుంటున్న కంపెనీలు కనీవినీ ఎరగని పన్నులకు సిద్ధం కావాలనీ హెచ్చరించారు. ఇక అమెరికాలోనే తయారుచేసే ఉత్పత్తులకు కనీవినీ ఎరగనట్లుగా పన్నుల రాయితీలను ఇస్తామనీ ప్రకటించారు. పర్యావరణాన్ని పట్టించుకోకుండా చమురు, సహజవాయువు వెలికితీత కోసం ‘డ్రిల్ బేబీ డ్రిల్’ అనే నినాదానికీ ఊపు తెచ్చారు.
అర్భాటత్వం ఎంతగా ఉన్నా అమెరికాలో తయారీరంగాన్ని పునరుద్ధరించటం అంత తేలికకాదు. ఒక్క అమెరికానే కాకుండా పాశ్చాత్యదేశాల్లోనూ అది సులువు కాదు. వలస సామ్రాజ్యాల కాలంలో, ఆదిమ తెగలను తుదముట్టించిన కాలంలో ఉన్న అనుకూలతలు పాశ్చాత్య దేశాలకు ఇప్పుడు లేవు. ఏకపక్షంగా ముడిసరుకులను కొల్లగొట్టటమూ ఇప్పుడు సాధ్యంకాదు. ఆసియా దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంలోనూ దూసుకువెళుతున్నాయి. ఇక అమెరికాలో స్థూలదేశీయ ఉత్పత్తిలో (జీడీపీ)లో తయారీరంగం వాటా 1950లో 28శాతం ఉంటే 2023 నాటికి 10.2 శాతానికి పడిపోయింది. శ్రామికశక్తిలో 25.6 శాతం మంది తయారీ రంగంలో అప్పుడు ఉంటే 2015 నాటికి ఆ శాతం 7.8కు చేరుకుంది. పరిశ్రమలతో పాటు గనుల తవ్వకం, నిర్మాణ రంగాన్ని కలిపిచూస్తే శ్రామికశక్తి వాటా 1955లో 35.9 శాతం ఉండేది. 2015నాటికి అది 13.6 శాతానికి పడిపోయింది. సేవలరంగంలో ఉద్యోగుల వాటా ఆనాడు 40.7 శాతం ఉంటే 2015 నాటికి అది 69.5 శాతమైంది.
ఆసియా దేశాల్లోని 2023 నాటి పరిస్థితితో పోల్చి చూసినా తయారీ రంగంలో అమెరికా వెనుకబాటు స్పష్టంగా కనపడుతుంది. భారత్ మినహా (13శాతం) చైనా (30.1శాతం), దక్షిణ కొరియా (25.6శాతం) తైవాన్ (33శాతం), జపాన్ (20.6శాతం), వియత్నాం (24శాతం), థాయ్‌లాండ్ (25శాతం), మలేసియా (23శాతం), సింగపూర్ (20–25శాతం) లాంటి దేశాలు తయారీ రంగంలో బాగా ముందున్నాయి. వలసపాలన తర్వాత పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆసియా దేశాలు వ్యూహాలు రచించుకుని ముందడుగులు వేస్తున్న తరుణంలోనే అమెరికా పెట్టుబడులు కూడా ఎక్కువ లాభాల కోసం చౌకగా లభ్యమయ్యే శ్రమ, ముడిసరుకులను అన్వేషిస్తూ అక్కడికే చేరుకోవటం మొదలుపెట్టాయి. లాభాపేక్షతో, ఆధిపత్య అవసరాలతో తయారీ రంగం అమెరికాలో క్షీణించింది. సోవియట్ రష్యా, చైనాలను దృష్టిలో ఉంచుకుని జపాన్‌ను రెండో ప్రపంచయుద్ధం తర్వాత బాగా ప్రోత్సహించింది. ఆ దేశ ఎగుమతులను అందుకే ఆపలేక పోయింది. చివరికి జపాన్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌ను ముంచెత్తాయి. రాజకీయ, ఆర్థిక అవసరాలతో చైనాతో చెలిమి చేయాల్సి రావటంతో ఆ దేశ ఉత్పత్తులకు ద్వారాలు తెరవాల్సి వచ్చింది. ప్రస్తుతం చైనా (16.5శాతం), మెక్సికో (14.2 శాతం), కెనడా (13.6శాతం)లు అమెరికా దిగుమతుల అవసరాలు తీర్చటంలో మొదటి మూడు స్ధానాల్లో ఉన్నాయి. ఈ దేశాలపై మొన్ననే పన్నుల యుద్ధానికి తెరతీశారు.
ఆసియాలో పెద్దదేశంగా ఉండి తయారీరంగంలో అమెరికాకు సవాల్ విసరలేకపోవటం భారత్ విశిష్టతగానే చెప్పుకోవాలి! మూడు దశాబ్దాలుగా బాగా దగ్గరై, అమెరికా కోరుకునే ఆర్థిక విధానాలు చేపట్టినప్పటికీ ట్రంప్ హెచ్చరికల వేడి భారత్‌కూ తగులుతోంది. అధిక పన్నులు తప్పవనే సంకేతాలను ఇవ్వటానికి ఏ అవకాశాన్నీ వదులుకోవటం లేదు. మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఇచ్చిన 10 ఏళ్ల నాటితో పోల్చితే తయారీరంగం వాటా పెరగలేదు. అప్పటికంటే (16.7శాతం) తగ్గింది. ట్రంప్–మోదీ మధ్య నడవడిక, భావ సారూప్యత సంగతెలా ఉన్నా ఇప్పుడు ఆర్థిక అంశాలే నివురుగప్పిన నిప్పులా మారాయి. మన ఎగుమతుల్లో అమెరికాకే ఎక్కువున్న నేపథ్యంలో పన్నుల యుద్ధం మొదలైతే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే వినియోగాన్ని పెంచటానికి ఆదాయపన్ను భారాన్ని తాజా బడ్జెట్‌లో బాగానే తగ్గించారు. ఆ పన్ను కట్టే ప్రజల సంఖ్య చాలా స్వల్పంగా ఉన్న మనదేశంలో ఈ ఆర్థిక వ్యూహం ఎంత ఫలిస్తుందో ఇప్పుడే చెప్పలేం. వ్యవసాయ, సామాజిక రంగాలకు కేటాయింపులు తగినంతగా పెరగకపోవటంతో జరిగే అనర్థాన్నీ తేలికగానూ కొట్టేయలేం.
చరిత్రను పునరావృతం చేయలేం. చేస్తామనే ఆలోచనే భయపెడుతుంది. మన పాలకుల్లోనూ అదెక్కడో కనపడుతోంది! అది ప్రాప్తకాలజ్ఞతే కావచ్చు! సమయోచిత అడుగు వేయటానికి సూచికే కావచ్చు!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
Read Latest Andhra Pradesh News And Telugu News
Updated Date - Feb 04 , 2025 | 05:57 AM