సామాజిక అసమానతలపై గళమెత్తిన గద్దర్
ABN, Publish Date - Jan 31 , 2025 | 02:16 AM
ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా కవి, కళాకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ తన పాటలతో ప్రజలలో ఉత్తేజాన్ని కలిగించారు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చారు. ఆ గొంతు శాశ్వతంగా మూగబోయి పద్దెనిమిది...
ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా కవి, కళాకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ తన పాటలతో ప్రజలలో ఉత్తేజాన్ని కలిగించారు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చారు. ఆ గొంతు శాశ్వతంగా మూగబోయి పద్దెనిమిది నెలలయింది. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు, మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన లచ్చమ్మ, శేషయ్య దంపతులకు జనవరి 31, 1949లో జన్మించారు. దాదాపు అరవై వసంతాలకు పైగా ప్రజలతో మమేకమై ఎన్నో ప్రజా ఉద్యమాలకు తన మాట, పాట ద్వారా ఊపిరి నింపిన విప్లవకారుడు ఆయన. నక్సల్బరీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత బహుజన ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం ఇలా అన్ని ఉద్యమాలలో తన పాటలతో ప్రజా జీవితాలను ప్రభావితం చేశారు. ప్రభుత్వాలను కదిలించారు.
‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతావ్ కొడకో నైజాము సర్కరోడా’ అని రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన కొరకు గళమెత్తారు. 1980లో చాల ఇళ్లలో ‘భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న’, మదన సుందరి..., ‘భారతదేశం భాగ్యసీమరా సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుందో నాయన, నీతి గల్ల మన దేశంలోన అవినీతెందుకు పెరిగిపోయర’ పాటలు వినిపించేవి. చుండూరు దళితుల ఊచకోతకు వ్యతిరేకంగా ‘జ్ఞానం ఒక్కరి సొత్తు కాదన్న అది సర్వజాతుల సంపదోరన్న, దళిత పులులమ్మా’ అనే పాట జనాన్ని ఉర్రూత లూగించింది.
నిజామాబాద్, హైదరాబాద్‌లలో గద్దర్ విద్యాభ్యాసం చేశారు. 1975లో కొద్దికాలం కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా.. పోరు తెలంగాణమా’ పాట ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమం అప్పటిదాకా ఒక ఎత్తు. ఆ పాట తర్వాత మరొక ఎత్తుగా కొనసాగింది. గద్దర్ ఆట, పాట కోట్లాది మందిని కదిలించింది. ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. ‘అమ్మా తెలంగాణమా..’, ‘అడవి తల్లికి వందనం’ ఇలాంటి వందలాది పాటలతో ప్రభావం చూపారు గద్దర్. జనం గోసను తన పాటల ద్వారా వినిపించారు. గద్దర్ ఒక సంచలనం, ఆయన పిలుపు ఒక ప్రభంజనం, గద్దర్ పాట విని రోమాలు నిక్కబొడుచుకోనివారు ఉండరు. కొన్ని వేలమంది ఉద్యమం బాట పట్టారు. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై...’ పాటకు నంది అవార్డుకు ఎంపికయ్యారు గద్దర్. కానీ దానిని స్వీకరించేందుకు తిరస్కరించారు.
పీపుల్స్‌వార్, మావోయిస్టు ఉద్యమం, తెలంగాణ ఉద్యమాల్లో తన గొంతు వినిపించారు గద్దర్. తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారు. దేశంలో దళితుల హత్యలపై ఆయన అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. అమరవీరుల కుటుంబాలకు చేయూతనిచ్చేవారు. పీపుల్స్‌వార్ పార్టీ క్యాడర్ రిక్రూట్‌మెంట్ ఆయన పాటల ద్వారా ప్రభావితమయింది. చాలామంది సానుభూతిపరులు, పౌర–ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, దళిత బహుజన సంఘాలలో సాంస్కృతిక విప్లవం తెచ్చిన వ్యక్తి. ఆయన పాటలతో ఉత్తేజమై ఎందరో నక్సల్ ఉద్యమంలో చేరారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. నాడు మరణం అంచుల దాకా వెళ్లి, ప్రాణాలతో బయటపడ్డారు.
1969 తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావజాల వ్యాప్తి కోసం ఊరూరా తిరిగి, బుర్రకథలతో ప్రచారం చేసేవారు. అలా ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి. నరసింగరావు.. భగత్‌సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి. నరసింగరావు ప్రోత్సాహంతో గద్దర్ ‘ఆపర రిక్షా’ పేరుతో తన మొదటి పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
సామాజిక తెలంగాణ స్వప్నం నెరవేరలేదని, ఎంతో కాలం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం కొందరి చేతుల్లోనే ఉందని గద్దర్ వాపోయేవారు. తాను జీవించి ఉన్న చివరి రోజులలో సామాజిక సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ, అణగారిన వర్గాల అభ్యుదయం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని గ్రహించి ఆ పార్టీ ఏర్పాటు చేసిన సభలలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ పట్ల ఆయనకు వల్లమాలిన అభిమానం. భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీతో పాల్గొన్నారు, పౌర ప్రజా సంఘాలతో మమేకమై భారత్ బచావో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఉరేగించినా, దేశానికి పతకాలు సాధించిన రెజ్లర్లపై లైంగిక వేధింపులు జరిగినా, బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించినా... మాకు సంబంధించిన విషయాలు కావని మౌనం పాటిస్తున్న పార్టీలు, చివరికి గద్దర్‌ను భౌతికంగా నిర్మూలించేందుకు దాడులు జరిపిన పార్టీలు సైతం గద్దర్‌ని కొనియాడుతున్నాయి. అలాగే ఒక విప్లవకారుడి చివరి అంతిమ యాత్రలో ప్రభుత్వ లాంఛనాలతో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అరుదైన వ్యక్తి గద్దర్. ప్రాంతాల మధ్య అంతరాలను, వెనుకబాటు తనాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు. సమాజ పురోభివృద్ధికి ప్రతిబంధకాలు అవిద్య, అజ్ఞానం, మూఢనమ్మకాలు, మతోన్మాదం, అశ్లీలత అని భావించి... తన ఆట, పాట ద్వారా ప్రజలను ఆలోచింపజేసి భావ విప్లవం తెచ్చిన మహానుభావుడు ఆయన.
2023 జనవరిలో రాయలసీమ ప్రజా సంఘాల వేదికలో గద్దర్ ప్రసంగించారు. రాయలసీమ పట్ల ప్రత్యేక అభిమానంతో నీళ్లు, నిధులు, ప్రాంతీయ అసమానతలు తుదముట్టించడానికి లౌకిక ప్రజాతంత్ర ఉద్యమానికి బాసటగా నిలిచారు. ముప్పై సంవత్సరాల క్రిందట మహాబోధి విద్యాలయం ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు విద్యా ప్రదానం చేశారు. తల్లిదండ్రులు కోల్పోయిన వారికి, సింగిల్ పేరెంట్ పిల్లలకు తాను స్థాపించిన పాఠశాలలో ఉచిత విద్య అందించారు. గుమ్మడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు నేలపైన ప్రజాకళలు ఉన్నంత వరకు గద్దర్ పాట సజీవంగా ఉంటుంది.
జి. వెన్నెల గద్దర్
చైర్‌పర్సన్, తెలంగాణ సాంస్కృతిక సారథి
(నేడు గద్దర్ జయంతి)
Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం
Updated Date - Jan 31 , 2025 | 02:16 AM