ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రగతిశీల భావోద్యమకారుడు

ABN, Publish Date - Jan 05 , 2025 | 12:52 AM

భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవం సందర్భంగా తెలుగునాట స్మరించుకోవల్సిన తొలితరం భావోద్యమకారులలో గద్దె లింగయ్య ఒకరు. సహాయనిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని...

భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవం సందర్భంగా తెలుగునాట స్మరించుకోవల్సిన తొలితరం భావోద్యమకారులలో గద్దె లింగయ్య ఒకరు. సహాయనిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని కారాగార వాసం చేసిన లింగయ్య తొలినాటి సామ్యవాదులలో ఒకరు. తెలుగులో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు ప్రణాళికను ప్రచురించిన అభ్యుదయవాది. తొలి సామ్యవాద పత్రిక ‘ప్రభ’, ప్రగతిశీల ‘నవయుగ’ పత్రికల వ్యవస్థాపకుడు. ఫ్రెంచ్ సామ్యవాద రచయిత యూజన్ పాటియార్ రాసిన అంతర్జాతీయ శ్రామిక గీతాన్ని బాలాంత్రపు నళినీ కాంతరావు తెనిగించగా 1935లో లింగయ్య తన ‘ప్రభ’ పత్రికలో ప్రచురించినట్టు తెలుస్తోంది. ఉద్యమ ప్రచారోద్యమంలో భాగంగా ఆదర్శ గ్రంథ మండలి స్థాపించి క్రొవ్విడి లింగరాజు తర్జుమా చేసిన మాక్సిం గోర్కీ అద్వితీయ నవల ‘అమ్మ’ మొదలుకుని పదుల సంఖ్యలో స్ఫూర్తిదాయక పుస్తకాలను ప్రచురించిన ప్రగతిశీలి లింగయ్య. శరత్ మొదలు రాహుల్ సాంకృత్యాయన్ వరకూ ఎందరో మహారచయితల నవలలను లింగయ్య స్వయంగా అనువదించి తెలుగువారికి పరిచయం చేశారు. ఉద్యమానికి భావజాల ప్రచారం ఎంత అవసరమో గుర్తించి బ్రిటిష్ వారి కంటపడకుండా ఏకంగా పడవల్లో అచ్చు యంత్రాలు అమర్చి కరపత్రాలు, పుస్తకాలు ముద్రించిన యోధుడు లింగయ్య.


కృష్ణా జిల్లా ఎలమర్రులో రైతు కుటుంబంలో పుట్టిన లింగయ్య జీవితం ఒక నిరంతర చైతన్య ప్రవాహం. ‘ప్రభ’ను మొదట ఎలమర్రులోనే స్థాపించి తర్వాత బందరు నుంచి ప్రచురించారు. ఆయన రాసిన ‘విప్లవ వీరులు’ ‘విప్లవ యుగం’ తదితర పుస్తకాలను ప్రభుత్వం నిషేధించింది. తొలి సామ్యవాద నాటకాల్లో ఒకటైన మునిమాణిక్యం నరసింహారావు రాసిన ‘తిరుగుబాటు’ను ప్రచురించారు. మొదటి విప్లవ పాటల సంకలనం కూడా ఆయనే ‘క్రాంతిగీతాలు’ పేరిట ప్రచురించగా ప్రభుత్వం నిషేధించింది. నాలుగేళ్లపాటు లింగయ్యను డిటెన్యూగా చేసి వేధించారు. అయినా ఆయన ఎక్కడా వెనకడుగువేయలేదు. నిత్యం జన సమూహాల మధ్యనే ఉంటూ నిర్మాణాత్మకంగా పనిచేశారు. కృష్ణాజిల్లా సోషలిస్టు పార్టీకి ప్రథమ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం క్రియాశీలకంగా కృషి చేసిన ఉదాత్తుడు లింగయ్య.


ఆదర్శ గ్రంథ మండలిని స్థాపించి లింగయ్య చేసిన సాహిత్య సేవ మహత్తరమైనది. తెలుగునాట ఏకైక గదర్ వీరుడు దరిసి చెంచయ్య ఆత్మకథ ‘నేనూ–నా దేశం’, అయ్యదేవర కాళేశ్వరరావు స్వీయ చరిత్ర ‘నా జీవిత కథ’ను తొలుత లింగయ్యే ప్రచురించారు. పుస్తకప్రచురణని కాలక్షేప వ్యవహారంగానో లాభార్జన వ్యాపారంగానో లింగయ్య చూడలేదు. అసమానతల సమాజంలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా చేసే బహుముఖ పోరాటంలో ఆయుధాలుగా అక్షరాలని ఆయన చూశారు. ఆ సాహిత్యాన్ని ప్రజల దగ్గరకు ఎలా తీసుకెళ్ళాలో కూడా యోచించారు. విజయవాడ పుస్తకప్రచురణల సంఘానికి ఉపాధ్యక్షులుగా ఎన్నో నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 1963, జనవరి 7న నెల్లూరు వెళ్లిన లింగయ్య అక్కడే గుండెపోటుతో మరణించారు. అప్పుడు ఆయన వయస్సు 52 ఏళ్లు మాత్రమే. లింగయ్య తదనంతరం ఆయన పేరు మీద వారి సంతానం లింగయ్య గ్రూప్ వ్యాపార సంస్థలతో పాటు హర్యానాలోని ఫరిదాబాద్ దగ్గర ‘లింగయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ & టెక్నాలజీ’ అనే విద్యాసంస్థను స్థాపించారు. అది ఇప్పుడు విశ్వవిద్యాలయంగా ప్రభుత్వ గుర్తింపును పొందింది. ఒక తెలుగు వ్యక్తి, అభ్యుదయ భావోద్యమకారుడి పేరుతో ఉత్తరాదిన అటువంటి విద్యాసంస్థ ఉండడం అరుదైన విశేషం. దురదృష్టవశాత్తూ గద్దె లింగయ్య జీవితాన్ని గురించిన సమాచారం కానీ, ఆయన పాల్గొన్న ఉద్యమాలు, చేసిన రచనలు, మొత్తం అనువాదాలు, ప్రచురించిన గ్రంథాలు, ఏర్పాటుచేసిన పత్రికలు, సంస్థల వివరాలేవీ ఒక్కచోట సమగ్రంగా నమోదు చేయబడలేదు. కారణాలు తెలీదు కానీ వారి వారసత్వ సంస్థలు కూడా అటువంటి ప్రయత్నం చేసినట్టు లేదు. అంతకంటే బాధాకరమైన విషయం లింగయ్య భావోద్యమానికి వారసులుగా ఉన్నవారు సైతం భావజాల రంగంలో ఆయన చేసిన క్రియాశీల కృషిని కొనసాగించినట్టు లేదు.


లింగయ్య 1911లో జన్మించారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించి వంద సంవత్సరాలు అవుతోంది. ఆ సందర్భంగా వివిధ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తెలుగు ప్రాంతాల్లో రమారమి తొంభై ఏళ్ళ క్రితం మొదట సామ్యవాద సంఘం ఏర్పడినట్లు తెలుస్తోంది. అందులో మొదటిసారిగా కమ్యూనిస్టు ప్రణాళిక నుంచి పదుల సంఖ్యలో ప్రగతిశీల సాహిత్యాన్ని విరివిగా ప్రచురించడం జరిగింది. అలా తెలుగు నేల మీద సాంస్కృతిక భావజాల రంగాన్ని సుసంపన్నం చేసిన తొలితరం బుద్ధిజీవి గద్దె లింగయ్య కృషిని ఈ సందర్భంలో గుర్తించి గౌరవించుకోవడం అభ్యుదయ భావజాల స్రవంతికి అవసరం.

నేడు విభిన్న కమ్యూనిస్టు పార్టీలు, ప్రగతిశీల సంఘాలు విలక్షణమైన ప్రయోగాలు చేస్తూ అనేక ప్రచురణలు తీసుకువస్తున్నాయి. ఎన్నో కొత్త తరహా కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాటన్నిటిలో అంతర్లీనంగా ఒకనాడు ఏటికి ఎదురీదిన గద్దె లింగయ్య వంటి తొలితరం చింతనాశీలుర చిరస్మరణీయ కృషి ఉన్నది. నిత్య విద్యార్థిగా, నిరంతర ప్రవాహశీలిగా, ప్రజాపక్ష పత్రికా సంపాదకునిగా, అవిశ్రాంత రచయితగా, చారిత్రక అనువాదకునిగా, విశిష్టమైన ప్రచురణకర్తగా, స్వాతంత్ర సమరశీలిగా, సోషలిస్టు నేతగా, కమ్యూనిస్టు విప్లవ కారుడిగా, అన్నింటినీ మించి అచంచల మానవతావాదిగా జీవించిన లింగయ్య స్ఫూర్తిని భావితరాలకు పరిచయం చేయాల్సిన గురుతర బాధ్యత ఇప్పడు మరింత ఎక్కువగా ఉంది.

గౌరవ్

సామాజిక కార్యకర్త

Updated Date - Jan 05 , 2025 | 12:52 AM