ద్విచక్ర వాహనాలు లగ్జరీ కాదు..
ABN, Publish Date - Jan 27 , 2025 | 02:35 AM
ప్రస్తుత భారత మార్కెట్లో ద్విచక్ర వాహనాలు లగ్జరీ వస్తువు ఏ మాత్రం కాదని, వాటిపై పన్ను తగ్గించాలని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) డైరెక్టర్...
పన్ను భారం తగ్గించండి..
హోండా మోటార్‌సైకిల్ డైరెక్టర్ యోగేశ్ మాధుర్
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత మార్కెట్లో ద్విచక్ర వాహనాలు లగ్జరీ వస్తువు ఏ మాత్రం కాదని, వాటిపై పన్ను తగ్గించాలని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్) యోగేశ్ మాధుర్ అన్నారు. భరించగల స్థాయి అనేది ఒక సమస్య కావడంతో వచ్చే ఏడాది పరిశ్రమ ఒక అంకె వృద్ధికి దిగజారే ముప్పును ఎదుర్కొంటున్న విషయం ఆయన గుర్తు చేశారు. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ఆదాయపు పన్ను రేట్లను హేతుబద్ధీకరించడం కూడా అవసరమని ఆయన నొక్కి చెప్పారు. గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ తగ్గినందు వల్ల ఈ ఏడాది స్కూటర్, మోటార్ సైకిళ్ల అమ్మకాలు ప్రోత్సాహకరంగా లేవని మాధుర్ చెప్పారు. 350 సీసీ వరకు టూ వీలర్లను ప్రభుత్వం 28 శాతం జీఎ్‌సటీ శ్లాబ్‌లో పెట్టగా ఆ పై సామర్థ్యం గల వాహనాలకు 3 శాతం సెస్ కూడా అదనంగా విధిస్తోంది. ఫలితంగా అధిక సామర్థ్యం గల టూ వీలర్లపై పన్ను 31 శాతం వరకు ఉంటోంది. ఈ పన్ను భారాన్ని తగ్గించడం వల్ల టూవీలర్ పరిశ్రమకు భారీ ఊరట లభిస్తుందని మాధుర్ అన్నారు.
ఆటో ఎగుమతుల్లో 19% వృద్ధి: గత ఏడాది ఆటో మొబైల్ ఎగుమతుల్లో 19 శాతం వృద్ధి నమోదైంది. ద్విచ క్ర వాహన ఎగుమతులు పెరగడం ఇందుకు కారణం. 2023 లో 42,85,809 వాహనాలు విక్రయించగా 2024లో మొత్తం 50,98,810 వాహనాలు విక్రయించినట్టు భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం (సియామ్) గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రధానంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో భారత వాహనాలకు డిమాండ్ పెరిగిందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ అన్నారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Also Read: న్యూఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
Updated Date - Jan 27 , 2025 | 02:35 AM