టీసీఎస్ లాభం రూ.12,380 కోట్లు
ABN, Publish Date - Jan 10 , 2025 | 03:59 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25).. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ రూ.12,380 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదు చేసిన రూ.11,058 కోట్ల లాభంతో....
క్యూ3లో 12% వృద్ధి నమోదు
రూ.63,973 కోట్లకు కంపెనీ ఆదాయం
ఒక్కో షేరుకు మొత్తం రూ.76 డివిడెండ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25).. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ రూ.12,380 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదు చేసిన రూ.11,058 కోట్ల లాభంతో పోలిస్తే 11.95 శాతం వృద్ధి కనబరిచింది. కాగా, ఈ క్యూ3లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.6 శాతం వృద్ధితో రూ.63,973 కోట్లకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికానికి రాబడి రూ.60,583 కోట్లుగా నమోదైంది. ఈ క్యూ3లో కంపెనీ నిర్వహణ లాభాల మార్జిన్ 24.5 శాతానికి పెరిగింది. గత క్యూ3లో ఇది 24.1 శాతంగా ఉంది. బీఎ్‌సఈలో టీసీఎస్ షేరు ధర గురువారం 1.72 శాతం తగ్గి రూ.4,036.65 వద్ద స్థిరపడింది.
1,020 కోట్ల డాలర్ల కొత్త ఆర్డర్లు: ఉత్తర అమెరికా సహా పాశ్చాత్య మార్కెట్లకు క్రిస్మస్ సెలవుల సీజన్ కావడంతో సాధారణంగానే క్యూ3లో ఐటీ రంగ పనితీరు బలహీనపడుతుంది. కానీ, ఈ డిసెంబరు త్రైమాసికంలో టీసీఎస్ 1,020 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంది. గత ఆర్థిక సంవత్సరపు క్యూ3లో లభించిన 810 కోట్ల డాలర్ల కాంట్రాక్టులతో పోలిస్తే 25.93 శాతం అధికమిది. అంతేకాదు, గత ఐదేళ్లలో మూడో త్రైమాసికానికి కంపెనీ నమోదు చేసిన అత్యధిక కొత్త ఆర్డర్ల విలువ ఇదే.
రూ.10 మధ్యంతర, రూ.66 ప్రత్యేక డివిడెండ్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్‌తోపాటు రూ.66 ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. అంటే, ఒక్కో షేరుకు మొత్తం రూ.76 డివిడెండ్ లభించనుంది. ఇందుకు అర్హులైన వాటాదారులను ఈ నెల 17న రికార్డు చేసి, వచ్చే నెల 3న చెల్లింపులు చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి, రెండో త్రైమాసికాల్లో (క్యూ1, క్యూ2)నూ కంపెనీ ఒక్కో షేరుకు రూ.10 చొప్పున మొత్తం రూ.20 మధ్యంతర డివిడెండ్ చెల్లించింది.
ఉద్యోగుల్లో 5,370 మంది తగ్గుదల: క్యూ1, క్యూ2 ట్రెండ్‌కు భిన్నంగా టీసీఎ్‌సలో ఉద్యోగులు మళ్లీ తగ్గారు. క్యూ3లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,370 తగ్గి 6,07,354కు పరిమితమైంది. గత త్రైమాసికానికి కంపెనీ ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 13 శాతానికి పెరిగింది. క్యూ2 అట్రిషన్ రేటు 12.3 శాతంగా ఉంది.
25,000 మందికి ప్రమోషన్లు: గడిచిన మూడు నెలల్లో 25,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చినట్లు టీసీఎస్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.10 లక్షల మందిని పైస్థాయికి ప్రమోట్ చేయడం జరిగిందని కంపెనీ వెల్లడించింది. ఈ సంఖ్య మొత్తం సిబ్బందిలో దాదాపు 20 శాతానికి సమానం.
బెంగళూరులో రూ.1,625 కోట్లకు భారీ స్థలం కొనుగోలు: ఐటీ హబ్ బెంగళూరులో భారీ స్థలాన్ని తమ గ్రూప్‌నకు చెందిన కంపెనీ నుంచి రూ.1,625 కోట్లకు కొనుగోలు చేసినట్లు టీసీఎస్ తెలిపింది.
కృత్రిమ మేధతో మరిన్ని ఉద్యోగాలు: కృత్రిమ మేధ (ఏఐ) మరిన్ని ఉద్యోగాలు సృష్టించనుందని టీసీఎస్ సారథి కృతివాసన్ అన్నారు. ఈ ఆధునిక సాంకేతికత కారణంగా ప్రస్తుత ఉద్యోగాల్లో కొన్ని క్రమంగా కనుమరుగైనప్పటికీ, సరికొత్త విధులతో కూడిన కొత్త ఉద్యోగాలు భారీ సంఖ్యలో పుట్టుకురానున్నాయని పేర్కొన్నారు.
అన్ని మార్కెట్ల నుంచి సమృద్ధిగా ఆర్డర్లు
గడిచిన త్రైమాసికంలో అన్ని రంగాలు, మార్కెట్ల నుంచి సమృద్ధిగా ఆర్డర్లు లభించాయని, కంపెనీ దీర్ఘకాలంలో మెరుగైన వృద్ధి కనబరిచేందుకు ఇది దోహదపడనుందని టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ అన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎ్‌ఫఎ్‌సఐ), కన్స్యూమర్ వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటున్నాయని, కొన్ని వ్యాపార విభాగాల్లో ఐటీ వ్యయాలు మళ్లీ పెరుగుతున్నాయన్న ప్రాథమిక సంకేతాలున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ రెండు అంశాలతోపాటు స్థానిక మార్కెట్లో బలమైన పనితీరు కొనసాగడం కంపెనీ భవిష్యత్‌పై ధీమాను పెంచిందన్నారు.
ప్రణాళికకు అనుగుణంగా ప్రాంగణ నియామకాలు
ఫ్రెషర్ల ప్రాంగణ నియామకాలు (క్యాంపస్ హైరింగ్) ప్రణాళికకు అనుగుణంగా సాగుతున్నాయని టీసీఎస్ మానవ వనరుల చీఫ్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా 40,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోనున్నట్లు కంపెనీ గతంలోనే ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో మరిన్ని అధిక ప్రాంగణ నియామకాలు చేపట్టేందుకు కంపెనీ సిద్ధమవుతోందదని లక్కడ్ అన్నారు. అలాగే, మున్ముందు త్రైమాసికాల్లో ఉద్యోగుల వలసలు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - Jan 10 , 2025 | 03:59 AM