Trade Strategy : జీరో ఫర్ జీరో టారిఫ్ వ్యూహం మెరుగు
ABN, Publish Date - Feb 22 , 2025 | 04:25 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్‌కు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) ఓ సూచన చేసింది.
అమెరికా పరస్పర సుంకాల ముప్పును పరిష్కరించేందుకు జీటీఆర్‌ఐ ప్రతిపాదన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్‌కు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) ఓ సూచన చేసింది. పరస్పర సుంకాలు అమలులోకి రాకముందే యూఎ్‌సకు భారత్ ‘జీరో ఫర్ జీరో’ టారిఫ్ వ్యూహాన్ని ప్రతిపాదించాలని సూచించింది. అమెరికాతో పూర్తి స్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం కంటే ఈ ప్రతిపాదనతో నష్టం తక్కువని జీటీఆర్‌ఐ అభిప్రాయపడింది. ఈ వ్యూహంలో భాగంగా, దేశీయ పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి నష్టం జరగకుండా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఏయే ఉత్పత్తులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేయవచ్చని భారత్ గుర్తించాలి. అందుకు బదులుగా, అమెరికా కూడా అదే సంఖ్యలో భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుంది. భారత్ ఈ జాబితా నుంచి వ్యవసాయ ఉత్పత్తులను చాలా వరకు మినహాయించవచ్చు. ఈ జాబితాను రూపొందించేందుకు జపాన్, కొరియా, ఆసియాన్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను పరిశీలించాలని జీటీఆర్‌ఐ తన నోట్‌లో పేర్కొంది. ఏప్రిల్‌కు ముందే ఈ జాబితాపై అమెరికాతో చర్చించి, ఆమోదం పొందగలిగితే భారత్‌పై పరస్పర సుంకాల ప్రభా వం అతి స్వల్పంగా లేదా దాదాపుగా ఉండకపోవచ్చని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ అన్నారు. జీరో ఫర్ జీరో టారిఫ్ వ్యూహం ద్వారా భారత్ 90 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై అధిక సుంకాల భారాన్ని తప్పించవచ్చన్నారు. జీరో ఫర్ జీరో టారిఫ్ వ్యూహం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, సంక్లిష్టమైన రాయితీలు, వ్యవసాయ సబ్సిడీల్లో కోత, మేధో సంపత్తి హక్కులను బలహీనపరిచే, సమాచార ప్రవాహ ఆంక్షలను ఎత్తివేయాల్సి వచ్చే పూర్తి స్థాయి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కంటే తక్కువ నష్టం కలిగించేదన్నారు. 2024 నాటికి భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 12,500 కోట్ల డాలర్ల స్థాయికి చేరింది.
పరస్పర సుంకాలతో భారత్‌కు చెందిన పలు రంగాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఒకవేళ అమెరికా ఏకరీతి టారిఫ్ విధిస్తే, భారత ఎగుమతులు అదనంగా 4.9 శాతం సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రంగాల వారీగా సుంకాలు విధిస్తే మాత్రం, మన వ్యవసాయ ఎగుమతులకు అధిక నష్టం వాటిల్లనుంది. రొయ్యలు, డెయిరీ, ప్రాసెస్డ్ ఫుడ్ రంగాలు 38.2 శాతం వరకు సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తుల విషయానికొస్తే, ఔషధాలు, వజ్రాలు, ఆభరణాలు, ఎలకా్ట్రనిక్స్ ఎగుమతులపైనా సుంకం భారం గణనీయంగా పెరగనుంది.
Updated Date - Feb 22 , 2025 | 04:25 AM