జడ్చర్లలో డెయిరీ ప్రాసెసింగ్ ప్లాంట్
ABN, Publish Date - Jan 24 , 2025 | 05:37 AM
ఆర్గానిక్ డెయిరీ ఉత్పత్తుల సంస్థ అక్షయకల్ప ఆర్గానిక్.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత పటిష్ఠం చేస్తోంది. ఇందు లో భాగంగా జడ్చర్లలో రూ.20 కోట్ల పెట్టుబడితో...
రూ.20 కోట్లతో ఏర్పాటు: అక్షయకల్ప ఆర్గానిక్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆర్గానిక్ డెయిరీ ఉత్పత్తుల సంస్థ అక్షయకల్ప ఆర్గానిక్.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత పటిష్ఠం చేస్తోంది. ఇందు లో భాగంగా జడ్చర్లలో రూ.20 కోట్ల పెట్టుబడితో ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు శశి కుమార్ తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ ప్లాంట్‌ను రోజుకు 40 వేల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంతో నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాంట్‌లో మొత్తం 8 రకాలైన ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు ఆయన చెప్పారు. 2019లో తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టామని, ప్రస్తుతం 65 మందికి పైగా రైతులతో కలిసి పనిచేస్తుండగా దీన్ని 385 మందికి పెంచుకోవాలని చూస్తున్నట్లు శశి తెలిపారు.
జడ్చర్ల ప్లాంట్ ఈ ఏడాది అక్టోబరు నాటికల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని తెలిపారు. జడ్చర్లతో పాటు కంపెనీ ఇప్పటికే కర్ణాటకలోని తిప్టూర్, తమిళనాడులోని చెంగల్పట్టులో రెండు యూనిట్లను నిర్వహిస్తోందని తెలిపారు. పూర్తిగా ఆర్గానిక్ విధానంలో రైతుల నుంచి పాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. కాగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మార్కెట్లలో ఇప్పటి వరకు ఆవు పాలను మాత్రమే విక్రయిస్తున్న అక్షయకల్ప అక్టోబరు నుంచి గేదె పాలను అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. కంపెనీ ఇప్పటి వరకు రూ.200 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టిందన్నారు.
Updated Date - Jan 24 , 2025 | 05:37 AM