Budget Allocation: ఆప్‌పై మోదీ ఐటీ గూగ్లీ!
ABN, Publish Date - Feb 02 , 2025 | 04:17 AM
దేశ రాజధానిలో అధిక సంఖ్యలో ఉండే మధ్య తరగతి ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకే ఆదాయ పన్నులో రాయితీ ప్రకటించిందా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ తీరు
ఆదాయపన్ను రాయితీకి అసలు కారణమిదే?
రాజధానిలో అత్యధికులు మధ్యతరగతి వారే
పన్ను చెల్లింపులో వారికి ఊరట కల్పించి.. ఎన్నికల్లో తమ వైపునకు తిప్పుకొనే వ్యూహం
ఎన్డీయే పాలిత బిహార్‌పై వరాల వర్షం
ఏపీలో టీడీపీని సంతృప్తిపరిచే ప్రయత్నం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ అసెంబ్లీకి నాలుగు రోజుల్లో ఎన్నికలు.. కోడ్ రీత్యా ప్రత్యక్షంగా వరాలు ప్రకటించలేని పరిస్థితి. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేతిలో వరుసగా రెండుసార్లు పరాజయం. ఈ నేపథ్యంలో మూడోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. కేంద్ర బడ్జెట్‌నే తమ ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేసిందా? దేశ రాజధానిలో అధిక సంఖ్యలో ఉండే మధ్య తరగతి ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకే ఆదాయ పన్నులో రాయితీ ప్రకటించిందా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. రూ.12 లక్షల వరకు పన్ను రాయితీ ప్రకటించడం ద్వారా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ తిరుగులేని గూగ్లీ సంధించారని అంటున్నారు. ఆదాయ పన్ను రాయితీని రూ.10 లక్షలకు పెంచాలని, కేంద్రం మధ్యతరగతిని ఏటీఎంగా భావించకూడదంటూ కేజ్రీవాల్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అయితే ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండడాన్ని మోదీ సర్కారు అవకాశంగా మలచుకుంది. కేజ్రీవాల్ డిమాండ్ కన్నా ఎక్కువగానే ప్రయోజనం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను రాయితీ అనేది దేశవ్యాప్తంగా అందరికీ ప్రయోజనం కలిగించేదే అయినా.. ప్రధానంగా ఢిల్లీలో ఉన్న 40 లక్షల మంది పన్ను చెల్లింపుదారులను దృష్టిలో పెట్టుకునే దీనిని ప్రకటించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 1.55 లక్షల మంది ఓటర్లలో 67 శాతం మధ్యతరగతి వారే అయినందున అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఓట్లను ఆకర్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఆదాయ పన్ను రూపేణా రూ.1.78 లక్షల కోట్లు చెల్లిస్తున్న ఢిల్లీ వాసులకు ఇది ఊరటే అవుతుందని, ఈ రాయితీతో మఽధ్యతరగతి ప్రజలు ఢిల్లీలో బీజేపీ వైపే మొగ్గు చూపుతారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవీ చదవండి:
ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి
కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..
భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 02 , 2025 | 10:31 AM