ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్యాంకులకు నిధుల కొరత

ABN, Publish Date - Jan 03 , 2025 | 05:30 AM

అందరికీ అప్పులిచ్చే బ్యాంకులే ఇప్పుడు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం ఈ కొరత రూ.2 లక్షల కోట్లకుపైగా ఉన్నట్టు సమాచారం...

రూ.2 లక్షల కోట్లకుపైగా లోటు.. ఆదుకోవాలని ఆర్‌బీఐకి వినతి

న్యూఢిల్లీ: అందరికీ అప్పులిచ్చే బ్యాంకులే ఇప్పుడు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం ఈ కొరత రూ.2 లక్షల కోట్లకుపైగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికానికి సంబంధించి 2024 డిసెంబరు 15 నాటికి కంపెనీలు, వ్యాపార సంస్థలు, వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు ముందస్తు పన్ను (అడ్వాన్స్‌ ట్యాక్స్‌) కింద రూ.3.15 లక్షల కోట్లు చెల్లించారు. దీనికి తోడు పండగల సీజన్‌ ఖర్చుల కోసం కంపెనీలు, వ్యక్తిగత వినియోగదారులు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలోనే నగదు వెనక్కి తీసుకున్నారు. ఇది చాలదన్నట్టు డాలర్‌తో రూపాయి మారకం రేటును నిలబెట్టేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) పెద్ద మొత్తంలో రూపాయలతో డాలర్లు కొనుగోలు చేసి.. మార్కెట్లో విడుదల చేయాల్సి వస్తోంది. ఈ మూడు కారణాలతో ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగంలో రూ.2 లక్షల కోట్లకుపైగా నిధుల కొరత ఏర్పడిందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.


పనిచేయని సీఆర్‌ఆర్‌ కోత: గత నెల (డిసెంబరు)లో ప్రకటించిన ద్రవ్య విధాన సమీక్షలో తమ డిపాజిట్లలో బ్యాంకులు తన వద్ద హామీగా ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని ఆర్‌బీఐ 4.5 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. దీంతో గత నెల 28వ తేదీ నాటికి బ్యాంకులకు అదనంగా రూ.1.16 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చాయి. అయినా ప్రస్తుతం బ్యాంకులకు నిధుల కొరత తప్పడం లేదు. దీంతో స్వల్పకాలిక నిధుల సర్దుబాటు కోసం, బ్యాంకుల మధ్య జరిగే ఓవర్‌నైట్‌ కాల్‌ మనీ వడ్డీ రేటు గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా 6.34 శాతానికి చేరింది.


ఆదుకోండి ప్లీజ్‌..

ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు బ్యాంకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎక్కువ వడ్డీ చెల్లిస్తాం, మా బ్యాంకులో డిపాజిట్‌ చేయండని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అయితే ఐపీఓ మార్కెట్‌ బూమ్‌తో ఆ ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించడం లేదు. దీంతో మా దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు తీసుకుని, అందుకు సమానమైన రూపాయలు ఇవ్వమని ఆర్‌బీఐని కోరినట్టు సమాచారం. దీంతో డాలర్‌తో రూపాయి మారకం రేటు పుంజుకోవడంతో పాటు ఆర్‌బీఐ ఫారెక్స్‌ నిల్వలూ పెరుగుతాయని చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై ఆర్‌బీఐ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఉలుకూ పలుకూ లేక పోవడం బ్యాంకులను గాభరా పెడుతోంది. దీంతో ప్రస్తుత నిధుల కొరతను ఎలా అధిగమించాలో పాలుపోవడం లేదని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jan 03 , 2025 | 05:30 AM