కోళ్లకు అంతుచిక్కని వైరస్
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:17 AM
కోళ్లకు అంతుచిక్కని వైరస్ పట్టి పీడిస్తున్నది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి ఉదయా నికి మృత్యువాత పడుతున్న పరిస్థితులు నెలకొ న్నాయి.
గంటల వ్యవధిలోనే మృత్యువాత
కోళ్ల పెంపకందారుల ఆందోళన
పెంటపాడు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : కోళ్లకు అంతుచిక్కని వైరస్ పట్టి పీడిస్తున్నది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి ఉదయా నికి మృత్యువాత పడుతున్న పరిస్థితులు నెలకొ న్నాయి. జిల్లాలో కొన్ని రోజులుగా సుమారు లక్షకు పైగా కోళ్ళు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సుమారు నెల రోజుల ముందు నుంచి అధిక సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. పందేల కోసం నెలల తరబడి కంటికి రెప్పలా పెంచిన పందెం కోళ్లు కూడా చాలా వరకు మృతి చెందాయి. కోళ్ల పెంపకందారులు లక్షల రూపాయలు నష్టపో యారు. కోళ్ల సంఖ్య తగ్గిపోవడంతో చాలా బరుల్లో పందేలు కూడా పస లేనట్లుగా సాగాయి. కనీసం జోడీలు కూడా దొరకలేదు.
నాలుగేళ్ళ క్రితం ఇదే వ్యాధి
కోళ్లకు వచ్చిన ఈ వ్యాధి కొత్తదేమి కాదు. నాలుగు సంవత్సరాల క్రితం ఈ వ్యాధి సోకి అనేక కోళ్లు మృత్యువాత పడ్డాయి. అప్పుడు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో పెంపకందారులు తీవ్ర ఆవేదన చెందుతూ వచ్చారు. వైరస్ సోకడంతో అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ధరలు పూర్తిగా పతనమయ్యాయి. పెంపకందారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపా రస్తులు తీవ్రంగా నష్టపోయారు. వైరస్ తగ్గుముఖం పట్టడానికి అప్పుడు చాలా రోజులు సమయం తీసుకుంది. ఇప్పుడు మరలా అదే వైరస్ కోళ్లకు వచ్చినట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి.
వైరస్ లక్షణాలు తెలియవు
ఈ వైరస్ సోకిన కోడికి వైరస్ లక్షణాలు ఏమీ కానరావు. ఉదయం బాగా ఉన్న కోడికి ఒకవేళ వైరస్ సోకితే తిరుగుతూనే చనిపోతు ంది. ఈ వైరస్ నేరుగా కోడి గుండెపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ సోకిన కోడికి గుండెనిండా నీరు పట్టేయడం వల్ల గుండెపోటు లాంటిది సంభవించి చనిపోతుంది. ఒకవేళ వైరస్ సోకిన కోడిని కనిపెట్టి వ్యాక్సిన్ వేయించినా ఫలితం ఏ మాత్రం ఉండదు.
జిల్లాలో లక్షకు పైగా కోళ్లకు వైరస్
పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని రోజులుగా లక్షకు పైగా కోళ్లకు వైరస్ సోకినట్లు తెలు స్తోంది. దీంతో పెంపకం నిర్వాహకులు ఆర్థికంగా చాలా వరకు నష్టపోయారు. వైరస్ ఇంకా ప్రబలితే గతం మాదిరిగా ముందు ముందు కోడి ధరలు ఎక్కడ పతనమమైపోతా యోనని పెంపకం దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ కోళ్ల మాంసం తినకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
వైరస్ పరిధి మూడు కిలో మీటర్లు
వైరస్ సోకిన కోడి కారణంగా సుమారు 3 కిల్లోమీటర్ల దూరంలో ఉండే మరో కోడికి వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఈ వ్యాధి తీవ్రత ఎంతో దారుణంగా ఉందో తెలుసుకోవచ్చు. పౌలీ్ట్రలో ఒక కోడికి వైరస్ సోకితే మిగిలిన అన్ని కోళ్లకు కూడా గంటల వ్యవధిలోనే వైరస్ సోకి కోళ్లు మొత్తం మృత్యువాత పడతాయి.
రోడ్డు పక్కన
కోళ్ల కళేబరాలు
వైరస్ కారణంగా మృత్యువాత పడిన కోళ్లను చాలా మంది సంచులలో వేసి రహ దారుల పక్కనే పడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చుట్టు పక్కల ఉండే కోళ్లకు అతి వేగంగా ఈ వైరస్ సోకే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. వైరస్ కారణంగా కోళ్లు చనిపోతే వాటిని ఊరికి దూరంగా తీసుకువెళ్ళి కాల్చేయడం గాని లేదా సుమారు 3 అడుగుల గొయ్యిని తీసి అందులో సున్నం వేసి పూడ్చటం గాని చేయాలంటున్నారు. లేకపోతే చనిపోయిన కోళ్ల కారణంగా మరిన్ని కోళ్లు మృత్యువాత పడతాయంటూ హెచ్చరిస్తున్నారు.
Updated Date - Jan 21 , 2025 | 12:17 AM