ఇల్లు అద్దెకిస్తాం!
ABN, Publish Date - Mar 03 , 2025 | 12:10 AM
పాలకొల్లు పట్టణంలో ఎక్కువ సంఖ్యలో ఇళ్లకు అద్దెకు ఇవ్వబడును అంటూ బోర్డులు వేలాడుతున్నాయి.
పాలకొల్లులో పదుల సంఖ్యలో బోర్డులు
టిడ్కో ఇళ్ల ఆక్యుపెన్సీ ఎఫెక్ట్
రూ.4వేల లోపు అద్దె ఇళ్లు ఖాళీ
చిత్తడి ప్రాంతాల్లో ఇళ్లకు అద్దె బోర్డులు
పాలకొల్లులో మొత్తం టిడ్కో ఇళ్లు 6,144
లబ్ధిదారులు ఉంటున్న టిడ్కో ఇళ్లు 2,560
పాలకొల్లు పట్టణంలో ఎక్కువ సంఖ్యలో ఇళ్లకు అద్దెకు ఇవ్వబడును అంటూ బోర్డులు వేలాడుతున్నాయి. పేదల కోసం నిర్మించిన 2,560 టిడ్కో ఇళ్లలో గృహప్రవేశాలు కావడంతో అద్దె ఇళ్లపై ప్రభావం పడింది. పట్టణ శివార్లలో మధ్య తరహా ఇళ్లలో ఉండే లబ్ధిదారులు టిడ్కో ఇళ్లకు తరలిపోవడంతో అద్దె ఇళ్లు ఖాళీ అయ్యాయి. ఇళ్లు అద్దెకు ఇచ్చిన వారు కూడా పేద, మధ్య తరగతి వారు కావడంతో వారి ఆదాయానికి కోత పడింది. చిన్న ఇంట్లో ఒక పోర్షన్ అద్దెకు ఇవ్వడం ద్వారా వారికి కొంత వెసులుబాటు ఉండేది. అద్దె రాబడి తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయని పలువురు ఇళ్ల యజమానుల ఆందోళన. ఇంకా 3,500 పైగా టిడ్కో ఇళ్లు కేటాయించ వలసి ఉంది. అది కూడా పూర్తయితే మరిన్ని అద్దె ఇళ్లు ఖాళీ.
పాలకొల్లు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పాలకొల్లు సమీపంలో నిర్మించిన ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లను కొన్నిటిని లబ్ధిదారులకు కేటాయిం చారు. లబ్ధిదారులు కుటుంబాలతో టిడ్కో ఇళ్లకు వెళ్లడంతో పట్టణం లో అద్దె ఇళ్లు ఖాళీ అయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లకు అద్దెకు ఇవ్వబడును అంటూ బోర్డులు వెలిశాయి. పాలకొల్లు ప్రాంతానికి సంబంధించి 6,144 టిడ్కో ఇళ్లు నిర్మించగా, ఇప్పటికి 2,560 ఇళ్లలో గృహ ప్రవేశాలు చేశారు. దీంతో పట్టణంలోని మధ్య తరహా అద్దె ఇళ్లు ఖాళీ అయ్యాయి. రూ.4వేల లోపు అద్దె ఉన్న ఇళ్లలో మూడింట రెండింతలు ఖాళీగా కనిపిస్తున్నాయి. పట్టణ శివారు ప్రాంతాలలో నిర్మించిన చిన్న తరహా ఇళ్లు చిత్తడి ప్రాంతాల్లోని ఇళ్లపై టిడ్కో ఇళ్ల ప్రభావం పడింది. ఏడాదిన్నరగా పాలకొల్లు పట్టణంలో వందల సంఖ్యలో అద్దె ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. లాకు దిగువ రామారావు పేట, కొత్తపేట, చింతలతోట తదితర ప్రాంతాల్లో వంద పోర్షన్లకు పైగా ఖాళీ అయ్యాయి.
పట్టణంలో ఎన్టీఆర్ టిడ్కో గృహాల నిర్మాణం గత టీడీపీ ప్రభు త్వ హయాంలోనే 80 శాతం పైబడి పూర్తయ్యింది. అనంతరం వైసీపీ ప్రభుత్వ పాలనలో టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో త్వరలో మిగిలిన పనులు పూర్తిచేసి టిడ్కో ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తామని ప్రకటించారు. మొత్తం టిడ్కో ఇళ్లను లబ్ధిరాలకు కేటాయిస్తే కుటుంబానికి ఇద్దరు పెద్దలు ఇద్దరు పిల్లలు చొప్పున లెక్కించినా పట్టణం నుంచి సుమారు 25 వేలకు జనాభా కొత్త ఇళ్లకు తరలిపోతారు.
మధ్య తరగతి వర్గాలకు ఇబ్బందులే!
పట్టణంలోని మధ్య తరహా అద్దె ఇళ్లన్నీ దాదాపు ఖాళీ అవుతా యి. స్లమ్ ఏరియాలలో 80 గజాలు, 100 గజాలు విస్తీర్ణంలో చిన్న గదులతో రెండు పోర్షన్లు ఉంటే ఒక పోర్షన్ ఇంటి యజమాని ఉన్నా మరో పోర్షన్ అద్దెకు ఇస్తున్నారు. ఈ తరహా ఇళ్ల యజమా నులు చిరు వ్యాపారులు, చిరుద్యోగులు. వారికి వచ్చే ఆదాయానికి తోడుగా ఎంతో కొంత ఇంటి అద్దె ఆదుకునేది. ఇప్పుడు ఇళ్లు ఖాళీ అవ్వడంతో ఆయా ఇళ్ల యజమానులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు తొలగించి ఆధునిక హంగులతో ఇళ్లు నిర్మించుకునే స్తోమత లేనివారి పోర్షన్లు ఇప్పుడు ఖాళీ అవుతున్నా యి. ఇల్లు పడగొట్టి నూతనంగా నిర్మించే స్తోమత లేనివారు కొద్దిపాటి ఆదాయం కోల్పోతామని పేద, మధ్య తరగతి గృహస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.4వేల లోపు అద్దె పొందుతున్న ఇళ్ల యజమానులకు ఇబ్బందులు తప్పవు. వారి ఇళ్లను ఆధునీక రించేందుకు ప్రభుత్వ రుణాలు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Mar 03 , 2025 | 12:10 AM