పశువులకు బీమా (ధీ)మా
ABN, Publish Date - Mar 02 , 2025 | 01:23 AM
పశువులకు బీమా రూపేణా ధీమా ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పశువుల ధరలు ఎక్కువగా పెరిగిపోవడంతో ప్రమాదవశాత్తు వ్యాధితో పశువు చనిపోతే రైతు నష్టాన్ని చవిచూస్తున్నాడు.
20 శాతం ప్రీమియం చెల్లిస్తే పశువుకు రూ.30 వేల వరకు బీమా
పశువుల ధర పెరిగిన నేపథ్యంలో బీమా చెల్లింపు తప్పనిసరి
ఇటీవలే ప్రీమియం చెల్లింపులకు ప్రభుత్వం జిల్లాకు రూ. 5 లక్షలు విడుదల
పాడి రైతులచే ప్రీమియం చెల్లింపు దిశగా పశు వైద్యాధికారులు
పశువులకు బీమా రూపేణా ధీమా ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పశువుల ధరలు ఎక్కువగా పెరిగిపోవడంతో ప్రమాదవశాత్తు వ్యాధితో పశువు చనిపోతే రైతు నష్టాన్ని చవిచూస్తున్నాడు. దానిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లింపు చేసేలా చేసి రైతులకు భరోసా ఇచ్చే ప్రణాళిక సిద్ధం చేసింది. దానిలో భాగంగా జిల్లాలో పశువులకు ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం తరఫున వాటాగా రూ. 5 లక్షలు నిధులు విడుదల చేసింది. వీటితో త్వరితగతిన పశువులకు ప్రీమియం రైతులచేత కట్టించేలా చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. పశువులన్నింటికి బీమా ప్రీమియం చెల్లింపు చేయాలని ఆదేశాలు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి.
(భీమవరం రూరల్–ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 45,539 ఆవులు, లక్షా 78 వేల 137 గేదెలు మొత్తం 2 లక్షల 23 వేల 676లు పశువులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన నిధులతో కొద్దిసంఖ్యలో పశువులకు ప్రీమియం చెల్లింపు జరుగుతుంది. తదుపరి నిధులతో పశువులన్నింటికి ప్రీమియం చెల్లింపులు చేయాల్సి ఉంది. గతంలో లక్ష రూపాయ లు విలువ చేసే పశువులు చనిపోతే బీమా ద్వారా లబ్ధి పొందిన రైతులు ఉండడంతో వారిని చూసి మిగిలిన రైతులు ప్రీమియం చెల్లింపునకు ఆసక్తి చూపుతున్నారు. అందుకని ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రీమియం చెల్లించేందుకు రైతులు వేగంగా ఉంటారు.
రూ. 30 వేలుపైన పొందాలంటే..
పశువులకు ప్రీమియం ద్వారా రూ. 30 వేలు పైబడి బీమా పొందాలంటే ఈవిధంగా ప్రీమియం సొమ్ములు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 30 వేల వరకు పశువులకు బీమా పొందాలనుకున్న రైతులన్న ప్రీమియం చెల్లింపులో 80 శాతం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతకు పైబడి బీమా పొందాలంటే రూ.30 వేలుపైన పెరిగిన సొమ్ము ఎంతకైనా వంద రూపాయలకు 6.4 శాతం ప్రీమియం రైతు చెల్లించుకోవాలి. ఈవిధంగా లక్ష వరకైనా రైతు చెల్లించుకోవచ్చు. లక్ష రూపాయల బీమాలో రూ.30వేల వరకు 80 శాతం ప్రీమియం సొమ్ము ప్రభుత్వం చెల్లిస్తుంది. 20 శాతం రైతు వాటాగా ఉంటుంది. మిగిలిన రూ.70 వేలకు ప్రీమియం మొత్తం సొమ్ము రైతే 6.4 శాతం కింద చెల్లించాలి.
గేదె ధర సరాసరి రూ. 80 వేలు
పశువుల ధరలు గతంతో పోలిస్తే గడిచిన మూడేళ్లలో బాగా పెరిగిపోయాయి. పాల ఉత్ప త్తి ఎక్కువగా ఉండడంతో మంచిజాతి గేదెలనే కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల గేదె ధర తక్కువ అంటే రూ. 60 వేలు, సరాసరి రూ. 80 వేలు, అంతకన్నా ఎక్కువ లక్ష పైనే ధర ఉంటున్నా యి. ప్రమాదవశాత్తు గేదె చనిపోతే లక్షల్లో నష్టాన్ని రైతు చూస్తున్నారు. బీమా ద్వారా రూ. 30 వేలు అందుకుంటే రూ. 70 వేల గేదె ఖరీదులో సగమైనా నష్టపరిహారంగా వస్తుంది. అందుకని గేదెలకు, ఆవులకు బీమా తప్పనిసరే అనుకోవాలి. ఆ తరహాలోనే రైతులూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం 80 శాతం ప్రీమియం చెల్లింపు వల్ల రూ. 200తోనే రూ. 30 వేల బీమా రైతు పశువుకు పొందేందుకు సులభదాయకంగా ఉంది.
బీమాతో నష్టాన్ని అధిగమించొచ్చు
ప్రీమియం చెల్లింపు వల్ల పశువులకు నష్టం వాటిల్లితే రైతు దానిని అధిగమించవచ్చు. 20 శాతం ప్రీమియం వాటాగా రైతు చెల్లిస్తే సరిపోతుంది. వారం రోజుల క్రితమే ప్రీమియం చెల్లింపునకు ప్రభుత్వం వాటాగా కట్టేందుకు జిల్లాకు రూ. 5 లక్షల నిధులు మంజూరయ్యాయి.
– కె.మురళీకృష్ణ
జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి
Updated Date - Mar 02 , 2025 | 01:23 AM