POCSO case పోక్సో కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు
ABN, Publish Date - Jan 09 , 2025 | 12:48 AM
జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్‌లో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నగరానికి చెం దిన ఇద్దరికి పోక్సో ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి మూడేళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
విజయనగరం క్రైం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్‌లో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నగరానికి చెం దిన ఇద్దరికి పోక్సో ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి మూడేళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నగరానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు నిత్యం గొడవ పడుతుండటంతో.. అమ్మమ్మ దగ్గరకు వెళ్లి, అక్కడే చదువుకొంటోంది. బాలిక తల్లి.. భర్తను వదిలేసి కోడూరు విజయ్‌కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే, బాలిక అమ్మఒడి డబ్బు విషయం అడిగేందుకు తల్లి వద్దకు వెళ్లింది. అదే సమయంలో కోడూరు విజయ్‌కుమార్ తనను లైంగికంగా వేధించాడని, అందుకు తన తల్లి ప్రోత్సహించిందని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్‌ఐ పి.శ్యామలాదేవి పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ పూర్తయ్యే విధంగా మహిళా పీఎస్ సీఐ నర్సింహమూర్తి చర్యలు చేపట్టారు. కోడూరు విజయ్ కుమార్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి వేధించాడని, అందుకు తల్లి సహకరించినట్టు నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయాధికారి నాగమణి ఆ ఇద్దరు దోషులకు తీర్పు ఖరారు చేశారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పోక్సో కేసులో నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను ఎస్పీ అభినందించారు.
Updated Date - Jan 09 , 2025 | 12:50 AM