tribal roads: గిరిజన రోడ్లకు మోక్షం
ABN, Publish Date - Jan 19 , 2025 | 12:30 AM
tribal roads: సీతంపేట ఏజెన్సీలో రహదారులకు మోక్షం కలిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెలల వ్యవధిలోనే మారుమూల గిరిజన గ్రామాలకు బీటీ, సీసీ రోడ్లు నిర్మిస్తోన్నారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
- రూ.16 కోట్లు కేటాయింపు
- శరవేగంగా పనులు
- తప్పనున్న డోలీ మోతలు
- హర్షం వ్యక్తం చేస్తున్న ఆదివాసీలు
సీతంపేట రూరల్, జనవరి18(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో రహదారులకు మోక్షం కలిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెలల వ్యవధిలోనే మారుమూల గిరిజన గ్రామాలకు బీటీ, సీసీ రోడ్లు నిర్మిస్తోన్నారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ పరిధిలో 14, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో మరో మూడు రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.9.17కోట్లతో సుమారు 16.15 కిలోమీటర్ల మేర చేపట్టే రహదారుల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 14 రహదారులకు గాను 8 రోడ్ల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన ఆరు రోడ్ల పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. అలాగే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రూ.7కోట్లతో సుమారు 6.20 కిలోమీటర్ల మేర బీటీ రహదారుల పనులు చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే గిరిజనులకు రహదారి కష్టాలు తీరనున్నాయి.
పనులు ఇలా..
మన్యంలో నేటికీ నడిచి వెళ్లలేని గ్రామాలు సుమారు 12 వరకు ఉన్నాయి. వీటిలో ఎగువ ద్వారబంధం, దిగువ ద్వారబంధం, రుక్మిణిగూడ వంటి గిరిశిఖర గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు కూటమి ప్రభుత్వం రహదారుల సౌకర్యం కల్పిస్తోంది. రూ.3.20 కోట్లతో దోనుబాయి బీటీ రహదారి నుంచి రుక్మిణిగూడ వరకు (3.2 కిలోమీటర్లు), రూ.2కోట్లతో ఎగువ ద్వారబంధం గ్రామానికి (2 కిలోమీటర్లు), రూ.1.80కోట్లతో జొనగ బీటీ రోడ్డు నుంచి మండ వరకు (కిలోమీటర్) తారు రోడ్లు నిర్మిస్తున్నారు. ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే కాంట్రాక్టర్లకు బిల్లులను చెల్లిస్తుండడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పూర్తికానున్నాయి.
పర్యాటక ప్రాంతాలకు కూడా..
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రోడ్లు, తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా బెన్నరాయి జలపాతం వరకు కిలోమీటరు మేర సీసీ రహదారి నిర్మాణానికి రూ.80లక్షలు, జగతిపల్లి వ్యూ పాయింట్ వరకు సీసీ రోడ్డుకు రూ.40లక్షలు, ఆడలీ వ్యూ పాయింట్ వరకు బీటీ రహదారి నిర్మాణానికి రూ.92లక్షలలు కేటాయించారు. అదే విధంగా సీతంపేట నుంచి నౌగూడ అక్షరబ్రహ్మ దేవాలయం వరకు రూ.80లక్షలతో బీటీ రహదారి నిర్మిస్తున్నారు.
గత ఐదేళ్లూ నరకం..
వైసీపీ ఐదేళ్ల పాలనలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిని జగన్ సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా రోడ్లు, తాగునీరు వంటి కనీస మౌలిక సౌకర్యాలకు అడవి బిడ్డలు దూరమయ్యారు. విద్య, వైద్యం, రేషన్, పింఛన్ వంటివి పొందేందుకు ఎత్తయిన కొండలు దిగి మైదాన ప్రాంతాలకు వచ్చేవారు. ఎవరికైనా జబ్బు చేస్తే వారిని డోలీలో పీహెచ్‌సీలకు తరలించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. డోలీ మోతలకు చెక్ పెట్టేందుకు గిరిశిఖర గ్రామాలకు పక్కా రహదారి సౌకర్యం కల్పిస్తోంది. దీంతో ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని గ్రామాలకూ రోడ్లు నిర్మిస్తాం
సీతంపేట ఏజెన్సీలోని గిరిశిఖర గ్రామాలన్నింటికీ ప్రాధాన్యత క్రమంలో పక్కా రహదారి సౌకర్యం కల్పిస్తాం. రహదారులు లేక గిరిజనుల పడుతున్న కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఇంకా రోడ్లు లేని గిరిజన గ్రామాలు కొన్ని ఉన్నాయి. వాటి కోసం కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చెప్పిన విధంగా గిరిజన ప్రాంతాల్లో ఇక డోలీ మోతలు కనిపించవు. గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
-నిమ్మక జయకృష్ణ, ఎమ్మెల్యే, పాలకొండ
Updated Date - Jan 19 , 2025 | 12:30 AM