Murder రూ.వెయ్యి కోసమే హత్య
ABN, Publish Date - Jan 09 , 2025 | 12:55 AM
ఎరుకొండలో ఈనెల 5న రాత్రి సమయంలో గొర్లె పవన్‌కుమార్ హత్య కేసులో నిందితుడు బొంతు అప్పలనాయుడును బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.
పూసపాటిరేగ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఎరుకొండలో ఈనెల 5న రాత్రి సమయంలో గొర్లె పవన్‌కుమార్ హత్య కేసులో నిందితుడు బొంతు అప్పలనాయుడును బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గొర్లె పవన్‌కుమార్, బొంతు అప్పల నాయుడు పెయింటింగ్ పనులు కలిసి చేస్తుండేవారన్నారు. పనులు పూర్తయిన తర్వాత అప్పలనాయుడు డబ్బులు తీసుకుని పంచేవాడు. అయితే ఒక పనిలో రూ.వెయ్యి పవన్‌కుమార్‌కు ఇవ్వకపోవటంతో దానికోసం పదే పదే అతడు అడుగుతుండేవాడు. ఈ క్రమంలో కొప్పెర్ల వైన్‌షాపు వద్ద కూడా అప్పలనాయుడుతో వేరొకరు ఉండగా పవన్‌కుమార్ డబ్బులు అడిగాడు. అక్కడ అప్పలనాయుడు పలకకుండా వెళ్లిపోవటంతో వేరొక స్నేహితుడి నుంచి అతడికి పవన్ డబ్బుల కోసం గట్టిగా అడిగాడు. దాంతో మనస్తాపానికి గురైన అప్పలనాయుడు.. పవన్‌ను వేరొకచోటుకు తీసుకుని వెళ్లి చంపేయాలని నిర్ణ యించుకున్నాడు. పెయింటింగ్ పనికి ఉపయోగించే కత్తి లాంటి పరికరాన్ని జేబులో పెట్టుకుని పవన్‌కుమార్‌కు ఫోన్‌చేసి గ్రామంలో వైఎస్‌ఆర్ విగ్రహం దగ్గరకు రమ్మని పిలిచాడు. అక్కడ పవన్‌ను అప్పలనాయుడు తన బైక్‌పై ఎక్కించుకుని వెళ్లి తన ఇంటి దగ్గర దించేశాడు. తిరిగి పవన్ ఇంటి దగ్గరకు వెళ్లి ఘర్షణకు దిగాడు. ముందే తెచ్చుకున్న కత్తిలాంటి పరికరంతో ఛాతీపై, కడుపులో అప్పలనాయుడు పొడిచాడు. దాంతో పవన్‌కుమార్ అక్కడిక్కడే మృతి చెందాడని తెలిపారు. ఆ తర్వాత అప్పలనాయుడు అక్కడ నుంచి పరారై గ్రామానికి చేరువలోని తోటలో దాక్కొన్నాడు. అక్కడ నుంచి బైక్‌పై విశాఖకు పరావుతుండగా అరెస్టు చేశామని సీఐ తెలిపారు.
Updated Date - Jan 09 , 2025 | 12:55 AM