vetanadarulu వేతనదారుల ‘ఉన్నతి’కి చర్యలు
ABN, Publish Date - Jan 28 , 2025 | 11:33 PM
Measures for the unnati of vetanadarulu ఉపాధి వేతనదారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఉన్నతి పథకం కింద స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణలను అందించేందుకు రంగం సిద్ధం చేసింది.
వివరాల సేకరణలో అధికారులు
పార్వతీపురం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఉపాధి వేతనదారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఉన్నతి పథకం కింద స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణలను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. వేతనదారులకు లేదా వారి కుటుంబంలో ఉన్న వారికి వివిధ రంగాల్లో తర్ఫీదు ఇచ్చి వారి ఆర్థిక బలోపేతానికి చర్యలు తీసుకోనున్నారు. 2023-24లో వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కూలీలు ఈ పథకానికి అర్హులు. టెన్త్ పూర్తయిన వేతనదారులు లేదా వారి పిల్లలకు కుటుంబ పోషణకు ఉపయోగపడే వివిధ కోర్సులో శిక్షణ అందించనున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారు ఉన్నతి పథకంలో చేరొచ్చు. విద్యార్హతను బట్టి శిక్షణను ఎంపిక చేసుకోవచ్చు. కాగా ఇప్పటికే అధికారులు వేతనదారుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రభుత్వం ఇవ్వనున్న శిక్షణను గురించి తెలియజేస్తున్నారు. వేతనదారులు లేదా వారి పిల్లలు ఏ రంగంలో శిక్షణ పొందుతారో తెలుసుకుంటున్నారు.
90 రోజుల పాటు శిక్షణ
శిక్షణకు ఎంపికైన వేతనదారులు లేదా వారి పిల్లలకు 31 రంగాలకు సంబంధించి 215 కోర్సుల్లో 90 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కాలంలో రోజుకు రూ.300 చొప్పున అందిం చనున్నారు. మొత్తంగా 90 రోజులకు రూ. 27 వేలు భృతిగా చెల్లించనున్నారు. కుట్టు, ఎంబ్రా యిడరీ, ఎలక్ర్టిక్, డ్రైవింగ్, ఫ్లంబింగ్ తదితర రంగాల్లో శిక్షణ అందించనున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 2,08,010 కుటుంబాలకు జాబ్ కార్డులు ఉండగా 3,93,282 మంది వేతనదారులు ఉపాధి పనులు చేస్తున్నారు.
వివరాలు సేకరిస్తున్నాం..
వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాల వివరాలను సేకరిస్తున్నాం. వారికి ప్రభుత్వం ఇవ్వనున్న శిక్షణను గురించి తెలియజేస్తున్నాం. వారికి ఏ రంగంలో శిక్షణ తీసు కునేందుకు ఆసక్తి ఉందో తెలుసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లా నుంచి 546 మందిని ఎంపిక చేసి స్కిల్ డెవలప్‌మెంట్ శాఖకు అప్పగించాం.
- రామచంద్రరావు, పీడీ, డ్వామా, పార్వతీపురం మన్యం
Updated Date - Jan 28 , 2025 | 11:33 PM