A Hub of Problems! వసతులు కరువు.. సమస్యలకు నెలవు!
ABN, Publish Date - Feb 05 , 2025 | 11:38 PM
Lack of Facilities.. A Hub of Problems! కురుపాంలో మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయం పరిస్థితి దయనీయంగా మారింది. దీర్ఘకాలికంగా అనేక సమస్యలతో సతమతమవుతోంది. ప్రధానంగా విద్యాలయాన్ని మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా సొంత భవనానికి నోచుకోవడం కూడా లేదు.
జియ్యమ్మవలస/కురుపాం, ఫిబ్రవరి5(ఆంధ్రజ్యోతి): కురుపాంలో మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయం పరిస్థితి దయనీయంగా మారింది. దీర్ఘకాలికంగా అనేక సమస్యలతో సతమతమవుతోంది. ప్రధానంగా విద్యాలయాన్ని మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా సొంత భవనానికి నోచుకోవడం కూడా లేదు. నేటికీ అద్దె భవనంలో కొనసాగుతుండగా.. అది కూడా శిథిలావస్థకు చేరింది. పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు. వాస్తవంగా ఈ పాఠశాల 2019లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఇక్కడ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది గెస్ట్ టీచర్లతో పూర్తిగా ఇంగ్లిషు మీడియంలో బోధన సాగుతోంది. కాగా గత ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోలేదు. దీంతో గెస్ట్ టీచర్లతోనే నెట్టు కొస్తున్నారు. అయితే ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
గురుకుల విద్యాలయంలో తాగునీటి సదుపాయం లేదు. 12 మరుగుదొడ్లే ఉండడంతో 200 మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు పురాతన అద్దె భవనం ఏ క్షణాన కూలుతుందో తెలియని పరిస్థితి. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఈ ప్రైవేట్ భవనానికి ప్రతినెలా అద్దె కింద రూ. 74 వేలు చెల్లిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు అద్దె రూపంలో సుమారు రూ. 47.50 లక్షల వరకు చెల్లించారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో అద్దె చెల్లింపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం..
గురుకుల విద్యాయంలో సమస్యలన్నీ ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం. త్వరలోనే వాటిని పరిష్కరిస్తారని ఆశతో ఉన్నాం.
- పి.సత్యనారాయణ, ప్రిన్సిపాల్, గురుకుల విద్యాలయం
Updated Date - Feb 05 , 2025 | 11:38 PM