పశుగ్రాసం సాగుకు భరోసా
ABN, Publish Date - Jan 20 , 2025 | 11:45 PM
Ensuring fodder cultivation చిన్న, సన్న కారు పాడి రైతులకు బాసటగా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తోంది. పశుగ్రాసం సాగుకు ఆర్థికంగా ఊతం ఇవ్వనుంది. గ్రాసం పెంపకం పథకానికి ఉపాధి హామీ నిధులు వెచ్చించనుంది. ఈపథకానికి శాతశాతం రాయితీ అమలు చేయనుంది. గరిష్ఠంగా ఐదు ఎకరాల్లో పశుగ్రాసం పెంచుకొనేందుకు అవకాశం ఉంటుంది.
పశుగ్రాసం సాగుకు భరోసా
శత శాతం రాయితీతో పథకం అమలు
గరిష్ఠంగా ఐదెకరాల్లో సాగుకు ప్రోత్సాహం
గజపతినగరం, జనవరి20(ఆంధ్రజ్యోతి): చిన్న, సన్న కారు పాడి రైతులకు బాసటగా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తోంది. పశుగ్రాసం సాగుకు ఆర్థికంగా ఊతం ఇవ్వనుంది. గ్రాసం పెంపకం పథకానికి ఉపాధి హామీ నిధులు వెచ్చించనుంది. ఈపథకానికి శాతశాతం రాయితీ అమలు చేయనుంది. గరిష్ఠంగా ఐదు ఎకరాల్లో పశుగ్రాసం పెంచుకొనేందుకు అవకాశం ఉంటుంది.
రైతుల్లో ఎక్కువ మంది వ్యవసాయానికి తోడుగా పాడిని చేపడుతుంటారు. గేదెలు, ఆవులు పెంచుతుంటారు. ఈఏడాది వర్షాలు కురవడంతో పశుగ్రాసానికి ఇప్పటివరకు పెద్దగా కొరత లేదు. వేసవిలో గ్రాసం కొరత తలెత్తితే అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశుగ్రాసం సాగుకు భరోసా ఇస్తోంది. లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే చేస్తోంది. కొత్త పథకం ద్వారా పచ్చి మేతను పాడి పశువులకు అందించవచ్చు. ఒక్కో మండలానికి 35నుంచి 45 ఎకరాలవరకు సాగుకు రైతులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఐదెకరాల లోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ చిన్న కారు రైతులు ఈ పథకానికి అర్హులు. వీరికి ఖచ్చితంగా ఉపాధి జాబ్‌కార్డు ఉండాలి. అర్హులైన వారు సమీపంలోని పశువైద్యులు, రైతుసేవాకేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు పొలానికి సంబంధించిన1బీకార్డు, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం నకలు కాపీలు జతచేయాలి. గ్రామసభద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులు పశుగ్రాసం సాగుకు అర్హులుగా గుర్తిస్తారు. జిల్లా వ్యాప్తంగా 3లక్షల77వేల960ఆవులు ఉండగా 97వేల845గేదెలను రైతులు పెంచుతున్నారు. పశుసంపదను పెంచడంతో పాటు పాడిపశువుల వల్ల రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
నిఽధుల కేటాయింపు ఇలా..
పదిసెంట్లలో పశుగ్రాసం పెంపకానికి కూలి ఖర్చు కింద రూ.3వేలు, సామగ్రి కింద విత్తనం కొనుగోలుకు రూ.3,599 కలిపి మొత్తం రూ.6,599 చెల్లిస్తారు. అదే 50సెంట్లలో పెంపకానికైతే వేతనం కింద రూ.15వేలు, విత్తన ఖర్చులకు రూ.17,992 అందజేస్తారు. ఉపాధి హామీ పథకం అధికారులు, పశువైద్యులు ధ్రువీకరించాకే రైతులకు బిల్లులు చెల్లిస్తారు. ఉపాధి హామీ పథకం ద్వారా పసుగ్రాసం అందించేందుకు గ్రామస్థాయిలో సర్వే చేపట్టనున్నారు.
గ్రామాల్లో సర్వే
చిన్న, సన్నకారు రైతులు పశుగ్రాసం పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిపై గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్న రైతులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి. పాడి అభివృద్ధికి పశుగ్రాసం ఎంతో దోహదపడుతుంది.
- సీహెచ్ రామారావు, ఏపీవో, గజపతినగరం
=================
Updated Date - Jan 20 , 2025 | 11:45 PM