cheating ఎన్నాళ్లీ చీటింగ్
ABN, Publish Date - Jan 22 , 2025 | 11:59 PM
Cheating all the time గాపురం మండలానికి చెందిన అప్పలనాయుడు పెట్రోల్‌బంకులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జీతంలో కొంత మొత్తాన్ని నెలనెలా చీటీ కడుతున్నాడు. పిల్లల చదువులు, భవిష్యత్ అవసరాల కోసం అతి కష్టం మీద డబ్బులు మిగుల్చుకుని చీటీ కడుతున్నాడు. మరో రెండు నెలలు చెల్లిస్తే పాట అయిపోతుంది. ఈ సమయంలో చీటీల నిర్వాహకుడు ఉడాయించాడు. అప్పలనాయుడు లబోదిబోమంటున్నాడు.
ఎన్నాళ్లీ చీటింగ్
వందలాదిగా మోసపోతున్న జిల్లా వాసులు
భోగాపురంలో భారీ సంఖ్యలో బాధితులు
రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన నిర్వాహకులు
- భోగాపురం మండలానికి చెందిన అప్పలనాయుడు పెట్రోల్‌బంకులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జీతంలో కొంత మొత్తాన్ని నెలనెలా చీటీ కడుతున్నాడు. పిల్లల చదువులు, భవిష్యత్ అవసరాల కోసం అతి కష్టం మీద డబ్బులు మిగుల్చుకుని చీటీ కడుతున్నాడు. మరో రెండు నెలలు చెల్లిస్తే పాట అయిపోతుంది. ఈ సమయంలో చీటీల నిర్వాహకుడు ఉడాయించాడు. అప్పలనాయుడు లబోదిబోమంటున్నాడు.
- విజయనగరానికి చెందిన రాజులమ్మ కూలి పనులు చేస్తూ రోజువారీ కూలి డబ్బుల్లో కొంత దాచుకుని నెలవారీ చీటీ కడుతోంది. చివరిలో వచ్చే డబ్బులు అమ్మాయి పెళ్లి ఖర్చులకు సరిపోతాయని భావించింది. దాదాపు ఎనిమిది నెలలు కట్టింది. గత నెలలో చీటీల నిర్వాహకుడు ఉన్నఫలంగా పరారీ అయ్యాడు. అప్పటి నుంచి ఆమె ఆందోళన చెందుతోంది.
- రాజాంకు చెందిన వెంకటేష్ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. ఏటా సంక్రాంతికి చీటీ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకుని నెలానెలా డబ్బులు కడుతున్నాడు. పండుగకు ఎక్కువ పెట్టుబడి అసరం ఉంటుందని భావించి చీటీ కట్టాడు. కానీ సంక్రాంతికి ముందే నిర్వాహకుడు చేతులెత్తేశాడు. దీంతో వెంకటేష్‌కు ఈ ఏడాది పండుగ లేకుండా పోయింది.
భోగాపురం, జనవరి22(ఆంధ్రజ్యోతి):
పెద్ద అవసరం తీరుతుందని.. కష్ట, సుఖాల్లో డబ్బులు ఉపయోగపడతాయని భావించి కూలీలు, చిరు వ్యాపారులు, చిరుద్యోగులు జిల్లాలో చీటీ కడుతున్నారు. ఆదాయం సరిపోకపోయినా కొద్దిమొత్తం మిగుల్చుకుని ఈ విధంగా డబ్బులు ఆదా చేసుకుంటున్నారు. నిర్వాహకులు ముందు తీపి మాటలు చెప్పి కొన్ని నెలల పాటు డబ్బులు వసూలు చేశాక పెద్ద మొత్తంతో ఉన్నఫలంగా ఉడాయిస్తున్నారు. ఇంకొందరు చీటీల నుంచి వసూలయ్యే మొత్తాన్ని నెలనెలా పాట పాడిన వారికి ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకుని వడ్డీ కడతామంటారు. ఆ డబ్బులను ఇతర వ్యాపారాల్లో పెడుతున్నారు. అక్కడ నష్టం వస్తే చేతులెత్తేస్తున్నారు. ఈ తరహా మోసం చేసిన అనేక మంది నేటికీ కోర్టు కేసుల్లో ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా జిల్లాలో బాధితులు ఇంతలింతలుగా ఉంటున్నారు. కొద్దిరోజుల కిందట భోగాపురం ప్రాంతంలో అత్యధికంగా చీటీల మోసాలు వెలుగులోకి వచ్చాయి. వందల మంది బాధితులుగా మిగిలారు. డబ్బులను చీటీ నిర్వాహకుల నుంచి ఏవిధంగా రాబెట్టుకోవాలోనని మథన పడుతున్నారు. భోగాపురం గ్రామంలో సుమారు 8 నుంచి 10 మంది వరకు చీటీ నిర్వాహకులున్నారు. వీరిలో కొంత మంది మహిళలు కూడా ఉన్నారు. నిర్వాహకులు చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మి చాలా మంది చీటీలు కట్టారు. పొరిగింటివారిని, ఎదురింటివారిని చూసి కూడా చీటీలు కట్టారు. భోగాపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 500 నుంచి 700 మంది వరకు చీటీలు కట్టారు. వాటిలో సుమారు రూ.లక్ష నుంచి రూ.25 లక్షల వరకు చీటీలు ఉన్నాయి. సుమారు రూ.40కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు బాధితుల సొమ్మును ఇవ్వకుండా నిర్వాహకులు మోసం చేశారు. కొంత మంది గ్రామం విడిచి వెళ్లిపోయారు. బాధితులు తీవ్ర నిరాశలో ఉన్నారు. పెద్దమొత్తంలో పోగొట్టుకున్న వారి వేదనకు అంతు లేకుండా ఉంది. ఎలా బతకాలో తెలియడం లేదంటూ వాపోతున్నారు. ఇదే విషయమై భోగాపురం సీఐ ఎన్వీ ప్రభాకర్‌ను వివరణ కోరగా చీటీల మోసంపై భోగాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై బాధితులు కేసు పెట్టారని, ఆ కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
స్టేషన్‌కు క్యూ కడుతున్న బాధితులు
భోగాపురం పోలీస్ స్టేషన్‌కు బాధితులు క్యూ కడుతున్నారు. చీటీలు కట్టి మోసపోయామని, ఆదుకోవాలని బుధవారం స్టేషన్‌ను ఆశ్రయించారు. గ్రామంలో ఓ మహిళా చీటీ నిర్వాహకురాలి తీరుపై పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా ఫలితం కానరాకపోవడంతో బాధితులు ఆమె ఇంటికి తాళం వేశారు. తాజాగా పోలీసులను ఆశ్రయించారు.
Updated Date - Jan 22 , 2025 | 11:59 PM