భూమి ఆన్‌లైన్‌కు లంచం అడిగారని..
ABN, Publish Date - Feb 22 , 2025 | 12:43 AM
నెల్లిమర్ల మండల రెవె న్యూ కార్యాలయం ఎదుట ఓ రైతు శుక్రవారం పురుగుల మం దు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఘటన
నెల్లిమర్ల, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల మండల రెవె న్యూ కార్యాలయం ఎదుట ఓ రైతు శుక్రవారం పురుగుల మం దు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. తన భూమిని ఆన్‌లైన్ చేయాలని దరఖాస్తు చేసి కొన్నేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో చివరకు ఆత్మహత్యకు చే సుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పని పూర్తి కావాలంటే రూ. లక్షలు ఇవ్వాలనే వీఆర్వోతో డిమాండ్ చేయడంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుషిణి పంచాయతీ చనమల్లుపేట గ్రామానికి చెందిన రైతు చనమల్లు అబద్ధంకు అదే గ్రామంలో 126, 127, 131, 202 తదితర సర్వే నెంబర్లలో 1.60 ఎకరాల భూమి ఉంది. అందుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన భూముల వివరాలేవీ ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దాంతో భూమి అమ్మకానికి, రుణాల సదుపాయానికి వీలు కావడం లే దు. 2020 అక్టోబరు 15న తన భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసి నాలుగేళ్లు పూర్తయినా పనికాలేదు. సదరు రైతుల భూమికి సంబంఽధించి ఎలాంటి వివాదాలు, అడ్డంకులు లేవని తెలుస్తోంది.
పురుగు మందు డబ్బా తెచ్చుకుని...
శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఎప్పటిలాగానే తహసీల్దార్ కార్యాలయానికి అబద్ధం చేరుకున్నాడు. ఆయనతో పాటు కుటుంబసభ్యులు వచ్చారు. రెవెన్యూ కార్యాలయంలో తన పనికావడం లేదని భోరున విలపి స్తూ అకస్మాత్తుగా తన సంచిలోని పురుగు మందు డబ్బా తెరిచి తాగేందుకు ప్రయత్నించాడు. దీంతో కుటుంబీకులు, అక్కడ ఉన్న వారు డబ్బాను లాక్కుని ఆయన ప్రాణాలను కాపాడారు. అదే సమయంలో ఆయనతో పాటు కుమారుడు, కుమార్తె, సోదరుడు కూడా అక్కడే ఉన్నారు. ఈ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.. తన భూమిని ఆన్‌లైన్ చేయాలని కోరుతున్నా గుషిణి వీఆర్వో రెడ్డి గోవింద్ పని కాకుండా దాటవేస్తున్నాడన్నారు. గట్టిగా నిలదీస్తే రూ.3 లక్షలు ఇవ్వాలని డి మాండ్ చేశారన్నారు. అందుకే తాను చనిపోయేందుకు నిర్ణయించుకున్నానన్నాడు. తండ్రి ఆత్మహత్యకు యత్నించడంతో కుమారుడు, కుమార్తె బోరున విలపించారు. వారు మాట్లాడుతూ మా భూమిని మా పేరున ఆన్ లైన్ చేసేందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. లంచం డిమాండ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశా రు. ఆత్మహత్యాయత్నం ఘటన అనంతరం అబద్ధం కుటుంబ సభ్యులు రెవెన్యూ కార్యాలయంలోనికి వెళ్లి వీఆర్వో గోవింద్‌ను, సిబ్బందిని నిలదీశారు. వీఆర్వో రెడ్డి గోవింద్‌ను వివరణ కోరగా తాను ఇక్కడ వీఆర్వోగా బాధ్యతలు చేపట్టి కేవలం రెండు నెలలే కావస్తోందన్నారు. అబద్దం పెట్టుకున్న దరఖాస్తు నా దృష్టికి రాలేదని అన్నారు. తాను లంచం అడిగిన మాట అవాస్తవమన్నారు. ఈ ఘటనపై తహసీల్దార్ బి.సుదర్శనరావు వివరణ కోరగా.. వీఆర్వో లంచం కావాలని అడిగాడనే విషయంపై తాను విచారణ చేయిస్తానన్నారు.
Updated Date - Feb 22 , 2025 | 12:43 AM