ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హాస్టళ్లు 16.. వార్డెన్లు ఏడుగురు

ABN, Publish Date - Mar 06 , 2025 | 11:35 PM

జిల్లాలోని బీసీ వసతి గృహాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకపక్క సంక్షేమ అధికారుల(వార్డెన్లు) కొరత వేధిస్తుంటే, మరోపక్క శిథిలావస్థలో ఉన్న భవనాలు భయపెడుతున్నాయి.

అసౌకర్యాల మధ్య ఉన్న చినమేరంగి ఫ్రీమెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లు

- వసతి గృహాలను వేధిస్తున్న సంక్షేమాధికారుల కొరత

- కొందరికి అదనపు బాధ్యతలు అప్పగింత

- అభివృద్ధికి నోచుకోని హాస్టళ్లు

- అరకొర నిధులు విడుదల

- కొన్నిచోట్ల అద్దె భవనాలే దిక్కు

జియ్యమ్మవలస, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని బీసీ వసతి గృహాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకపక్క సంక్షేమ అధికారుల(వార్డెన్లు) కొరత వేధిస్తుంటే, మరోపక్క శిథిలావస్థలో ఉన్న భవనాలు భయపెడుతున్నాయి. ఇంకొకపక్క అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ముఖ్యంగా 16 హాస్టళ్లకు ఏడుగురే వార్డెన్లు ఉండడం సమస్య తీవ్రతకు అద్ధంపడుతోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బీసీ హాస్టళ్లు అభివృద్ధికి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా తగు చర్యలు తీసుకుంటుందని ఆశపడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. అధికారం చేపట్టి తొమ్మిది నెలలు అవుతున్నా వార్డెన్‌ పోస్టుల భర్తీపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అధ్వానంగా ఉన్న వసతి గృహాలకు సంబంధించి మైనర్‌ రిపేర్ల కోసం అరకొర నిధులు మాత్రమే విడుదల చేసింది.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సంబంధించి ఫ్రీ మెట్రిక్‌ హాస్టళ్లు 10, పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లు 6 ఉన్నాయి. జియ్యమ్మవలస, రావివలస, చినమేరంగి, కురుపాం, గరుగుబిల్లి, పార్వతీపురం (బాలికలు), పార్వతీపురం (బాలురు), నర్సిపురం, బూర్జ, పాచిపెంటలోని ఫ్రీ మెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు 490 మంది విద్యార్థులు ఉంటూ చదువుకుంటున్నారు. పాలకొండ, చినమేరంగి (బాలురు), చినమేరంగి (బాలికలు), పార్వతీపురం (బాలురు), పార్వతీపురం (బాలికలు), సాలూరు (బాలురు)లో పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు ఉండగా, వీటిల్లో 387 మంది విద్యార్థులు ఉంటూ చదువుకుంటున్నారు. ఈ 16 వసతి గృహాలకు 16 మంది సంక్షేమాధికారులు (వార్డెన్లు) ఉండాలి. కానీ ఏడుగురు మాత్రమే ఉన్నారు. దీంతో హాస్టళ్ల నిర్వహణ గాడి తప్పింది.


అదనపు బాధ్యలతో సతమతం

  • జిల్లాలో ఏడుగురు వార్డెన్లు ఉండగా, వీరిలో నలుగురికి అదనపు బాధ్యతలు అప్పగించారు. గరుగుబిల్లి బీసీ వసతి గృహం రెగ్యులర్‌ వార్డెన్‌గా పనిచేస్తున్న ఎన్‌.శ్రీనివాసరావుకు జియ్యమ్మవలస, చినమేరంగి, కురుపాం హాస్టళ్ల బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పని ఒత్తిడికి గురవుతున్నారు.

  • సాలూరు బీసీ వసతి గృహ రెగ్యులర్‌ మేట్రిన్‌గా పనిచేస్తున్న ప్రమీలకు పాచిపెంట బాలుర వసతి గృహానికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

  • పాలకొండ హాస్టల్‌(బాలురు)కు సీతంపేట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ను ఇన్‌చార్జిగా నియమించారు.

  • పార్వతీపురం బీసీ హాస్టల్‌లో రెగ్యులర్‌ సంక్షేమాధికారిగా పనిచేస్తున్న ఎస్‌.సాంబయ్యకు సీతానగరం మండలం బూర్జ హాస్టల్‌తో పాటు పార్వతీపురం మండలం నర్సిపురం హాస్టల్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

  • చినమేరంగి కాలేజీ హాస్టల్‌కు రెగ్యులర్‌ మేట్రిన్‌గా పనిచేస్తున్న ఎన్‌.సుభద్రకు చినమేరంగి కాలేజీ గర్ల్స్‌ హాస్టల్‌, పార్వతీపురం గర్ల్స్‌ హాస్టల్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

  • మిగిలిన ముగ్గురు వార్డెన్లకు మాత్రం అదనపు బాధ్యతలు ఇవ్వలేదు. వీరిలో హారిక పార్వతీపురం (బాలురు), పి.పద్మజ పార్వతీపురం (బాలికలు), నాగేశ్వరరావు రావివలస బీసీ హాస్టళ్లకు రెగ్యులర్‌ వార్డెన్లగా పనిచేస్తున్నారు. కాగా, ఒక మండలంలో పనిచేస్తున్న వసతి గృహ సంక్షేమ అధికారికి వేరే మండలంలో అదనపు బాధ్యతలు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండుచోట్లకూ వారు ఎలా తిరుగుతారని, విద్యార్థులకు మెనూ ఎలా అందిస్తారని, వారి బాగోగులు ఎలా చూస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.


11 హాస్టళ్లకు రూ.21 లక్షలే..

జిల్లాలో 16 హాస్టళ్లకు గాను 11 వసతి గృహాల్లో మరమ్మతులకు ప్రభుత్వం రూ.21 లక్షలు మంజూరు చేసింది. 9 ఫ్రీ మెట్రిక్‌, రెండు పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలో మరుగుదొడ్లు, స్నానపు గదుల మరమ్మతులకు రూ.14.1 లక్షలు, విద్యుద్దీకరణకు రూ.3.1 లక్షలు, తలుపులు, కిటికీల మరమ్మతులకు రూ.3.5 లక్షలు మంజూరయ్యాయి. గరుగుబిల్లి మండల కేంద్రంలోని హాస్టల్‌ కిచెన్‌ అభివృద్ధికి రూ. 30 వేలు మంజూరు చేసింది. ఈ పనుల బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఈడబ్ల్యూఐడీసీ)కి ప్రభుత్వం అప్పగించింది. అయితే, ఈ నిధులతో మరమ్మతులు సాధ్యమేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిధులు ఏ మాత్రం చాలవని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. వాస్తవానికి బీసీ సంక్షేమశాఖ వసతి గృహాల దారుణ పరిస్థితిని చూసి రూ.2.45 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. కానీ, కేవలం రూ.21 లక్షలు మాత్రమే మంజూరయ్యాయి.

వసతి గృహంలో మరుగుదొడ్లు, డ్రింకింగ్‌ వాటర్‌ దుస్థితి


అద్దె కొంపల సంగతేంటి?

జిల్లాలో నాలుగు హాస్టళ్లు ఏళ్ల తరబడి అద్దె కొంపల్లో నడుస్తున్నాయి. వీటిలో జిల్లా కేంద్రం పార్వతీపురంలోని పోస్ట్‌ మెట్రిక్‌ బాలురు, బాలికల హాస్టళ్లతో పాటు ఫ్రీమెట్రిక్‌ బాలుర వసతి గృహం, జియ్యమ్మవలస మండలం చినమేరంగి కాలేజీ (పోస్ట్‌ మెట్రిక్‌) బాలికల వసతి గృహం ఉన్నాయి. వీటికి నెలకు సుమారు రూ.లక్ష వరకు అద్దె చెల్లిస్తూ కొనసాగిస్తున్నారు. శాశ్వత భవనాలు లేకపోవడంతో అద్దె కొంపల్లో అసౌకర్యాల మధ్య విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీసీ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రభుత్వ దృష్టిలో ఉంది

వసతి గృహాల్లో వార్డెన్ల పోస్టులు భర్తీ విషయం, మరమ్మతులకు సంబంధించిన నిధులు విషయం ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టిలో ఉంది. వారి ఆదేశాల ప్రకారమే చర్యలు తీసుకుంటాం.

-ఎస్‌.కృష్ణ, ఇన్‌చార్జి డీడీ, బీసీ వెల్ఫేర్‌, పార్వతీపురం మన్యం జిల్లా

Updated Date - Mar 06 , 2025 | 11:35 PM