కంబాలకొండలో నగర వనం
ABN, Publish Date - Feb 09 , 2025 | 12:28 AM
కంబాలకొండలో రూ.1.4 కోట్లతో నగరవనం ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే ఉన్న వసతులకు అదనంగా మరికొన్నింటిని సమకూర్చుతున్నారు.
రూ.1.4 కోట్లతో అభివృద్ధి
గెస్ట్ హౌస్, యాంఫీ థియేటర్, యోగా హాలు ఆధునికీకరణ
విశాలంగా క్యాంటీన్, రెండుచోట్ల డెక్‌లు
సందర్శకుల కోసం వాకింగ్ ట్రాక్
వచ్చే నెల 30న ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్ చేతులమీదుగా ప్రారంభం
విశాఖపట్నం/ఆరిలోవ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి):
కంబాలకొండలో రూ.1.4 కోట్లతో నగరవనం ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే ఉన్న వసతులకు అదనంగా మరికొన్నింటిని సమకూర్చుతున్నారు. శిథిలావస్థకు చేరిన అతిథి గృహాలు, యాంఫీ థియేటర్, యోగా సెంటర్‌లను ఆధునికీకరిస్తున్నారు. నగర వనాన్ని వచ్చే నెల 30వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రారంభించనున్నారు. ఆలోగా పనులు పూర్తిచేయాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు.
నగర వాసులకు ఆటవిడుపు కోసం వనాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు నిధులు మంజూరుచేసింది. నగరంలో జంతు ప్రదర్శనశాలకు ఎదురుగా ఉన్న కంబాలకొండలో ఇప్పటికే పలు వసతులు ఉన్నాయి. సందర్శకులు సేదతీరేందుకు వీలుగా ఉన్న వసతులను విస్తరించడం/ఆధునికీకరించడం, కొత్తగా కొన్నింటిని నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం చేస్తారు. గతంలో ఉన్న క్యాంటీన్‌ను పూర్తిగా తొలగించి దాని స్థానంలో విశాలంగా గడ్డి, తాటిదూలాలలో కొత్తది నిర్మించారు. దీనికి రూ.3.5 లక్షలు కేటాయించారు. దానికి ఆనుకుని శిథిలావస్థకు చేరిన యాంఫీ థియేటర్‌ను సుమారు రూ.3 లక్షలతో ఆధునికీకరిస్తున్నారు. క్యాంటీన్, యాంఫీ థియేటర్ మధ్య రూ.2.5 లక్షలతో సుమారు 10 అడుగుల ఎత్తులో చెక్కతో డెక్ నిర్మిస్తున్నారు. అలాగే బోటు షికారు సౌకర్యం ఉన్న డేగలగెడ్డ రిజర్వాయర్‌కు ఆనుకుని ఇనుముతో నిర్మించిన డెక్ పాడైవడంతో దానికి సమీపంలో రూ.3.5 లక్షలతో చెక్కతో 15 అడుగుల ఎత్తులో కొత్తది నిర్మిస్తున్నారు. దానిపై నుంచి కంబాలకొండలో చాలా వరకు ప్రాంతం, చుట్టూ ఉన్న కొండలు కనిపిస్తాయి.
అదేవిధంగా క్యాంటీన్‌కు కొద్దిదూరంలో గల గెస్ట్‌హస్‌ను రూ.15 లక్షలతో ఆధునికీకరిస్తున్నారు. గెస్ట్ హౌస్‌లో ఏసీ, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. సందర్శకులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వినియోగించుకునేలా అద్దెకు ఇస్తారు. డేగలగెడ్డ రిజర్వాయర్‌కు ఆనుకుని రెండుచోట్ల గడ్డితో పగోడాలు ఏర్పాటుచేశారు. రిజర్వాయర్‌కు ఆనుకుని సుమారు అర కిలోమీటరు పొడవునా రెండు మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. గతంలో ఉన్న యోగా సెంటర్‌ను రూ.ఐదు లక్షలతో ఆధునికీకరిస్తున్నారు.
జాతీయ రహదారి నుంచి కంబాలకొండ వెళ్లి, తిరిగి బయటకు వచ్చే క్రమంలో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కంబాలకొండ నుంచి నేరుగా జాతీయ రహదారి వైపు రాకుండా హైవేకు సమాంతరంగా కంబాలకొండలోనే ఒక రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించి జూ ప్రధాన గేటు ఎదురుగా హైవేపైకి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా శనివారం అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ శాస్త్రి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కోటేశ్వరరావులు కంబాలకొండలో పనులు పరిశీలించి అక్కడ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Updated Date - Feb 09 , 2025 | 12:28 AM