అమ్మాయిలు మిస్సింగ్!
ABN, Publish Date - Feb 16 , 2025 | 01:27 AM
నగరంలో యువతులు, మహిళల అదృశ్యం కేసులు పెరుగుతున్నాయి.
నగరంలో పెరుగుతున్న కేసులు
స్నేహం పేరిట ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో మోసగాళ్ల రిక్వెస్ట్‌లు
తర్వాత ప్రేమ పేరుతో వల
పెళ్లి చేసుందామంటూ మాయమాటలు
కాదంటే మార్ఫింగ్ ఫొటోలు పంపించి పరువు తీస్తామని బెదిరింపులు
నమ్మి మోసపోతున్న కొందరు
భయపడి ఇళ్లు వదిలివెళ్లిపోతున్నవారు మరికొందరు
బాధితుల్లో పెళ్లై పిల్లలున్నవారు కూడా...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో యువతులు, మహిళల అదృశ్యం కేసులు పెరుగుతున్నాయి. అందుకు గల కారణాలను పరిశీలిస్తే అత్యధికం ప్రేమ పేరిట మోసాలు, స్నేహం పేరుతో వంచన, సన్నిహితుల బ్లాక్‌మెయిలింగ్ వంటివే ఉంటున్నాయి.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌ల వినియోగం పెరిగింది. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు కలిగి ఉంటున్నారు. వాటిల్లో తమ వ్యక్తిగత వీడియోలను అప్‌లోడ్ చేయడం, ఇతరులు అప్‌లోడ్ చేసిన వీడియోలు, ఫొటోలను వీక్షించడం వ్యసనంగా మార్చుకుంటున్నారు. కొంతమంది మోసగాళ్లు దీనిని ఆసరాగా తీసుకుని అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మొదట్లో స్నేహం పేరుతో రిక్వెస్ట్‌లు పంపిస్తారు. ఆ తరువాత తీయని మాటలతో చాటింగ్ మొదలెడతారు. ఫోన్ నంబర్లు తీసుకుంటారు. పొగడ్తలతో ముంచెత్తుతూ దగ్గరవుతారు. తర్వాత ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపుతున్నారు. అక్కడి నుంచి కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని సమస్యలేమైనా ఉన్నట్టయితే వాటిని అధిగమించేలా చేస్తామంటూ ఆకట్టుకుంటారు. వారితో చనువుగా మాట్లాడినప్పుడు కాల్ రికార్డు చేస్తుంటారు. అలాగే వ్యక్తిగతంగా కలిసినప్పుడు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. వాటిని అడ్డం పెట్టుకుని పెళ్లి చేసుకుందామని కొందరు, తన కోర్కె తీర్చాలని మరికొందరు, డబ్బులు ఇవ్వాలని ఇంకొందరు వేధించడం మొదలుపెడుతున్నారు. నిరాకరిస్తే తమ వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు, మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరింపులకు దిగుతుంటారు. ఈ పరిస్థితిని యువతుల నుంచి పెళ్లై పిల్లలు ఉన్న మహిళల వరకూ ఎదుర్కొంటున్నారు. కొంతమంది బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకుని కొద్దిరోజులకే మోసపోతున్నారు. మరికొందరు మోసగాళ్ల బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు భయపడి వారు చెప్పినట్టు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం తమ వీడియోలు ఫొటోలు ఎక్కడ బయపెట్టేస్తే కుటుంబసభ్యులు, బంధువులు ఎదుట తలెత్తుకుని బతకలేమనే మనస్తాపంతో ఇళ్లు విడిచిపోతున్నారు. ఈ తరహా కేసులు గత కొంతకాలంగా పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది జనవరి ఒకటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ వరకూ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 539 మంది మహిళలు అదృశ్యమైతే వారిలో 388 మందిని పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలికల విషయానికి వస్తే గత ఏడాది జనవరి ఒకటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 12 వరకు 163 మంది అదృశ్యమైతే వారిలో 149 మందిని పోలీసులు కనిపెట్టి నగరానికి తీసుకువచ్చారు.
అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ
సీపీ శంఖబ్రతబాగ్చి
నగరంలో ప్రేమ, పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశాం. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో అకౌంట్‌లు కలిగి ఉండడం, ఎక్కువ సమయం వాటిల్లోనే గడపుతుండడంతో మోసాలకు ఆస్కారం పెరుగుతోంది. దీనిపై బాలికలతోపాటు మహిళలకు ఏయూలోని మహిళా అధ్యయన కేంద్రం సహకారంతో డాక్యుమెంటరీలు, కళాజాతాలు, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తాం. మిస్సింగ్ కేసుల్లో అత్యధికం తెలిసిన వారి మాయమాటలే కారణం కావడంతో అలాంటి వారి తీరుతెన్నులు, మాట తీరు ఎలా ఉంటాయనేది కూడా కేస్ స్టడీస్‌తో వివరిస్తాం.
మిస్సింగ్ ఆచూకీ తెలిసినవారు
మహిళలు 539 388
బాలికలు 163 149
Updated Date - Feb 16 , 2025 | 01:27 AM