ఉపమాక వెంకన్నకు పూర్వ వైభవం
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:48 AM
నక్కపల్లి మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు.
ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలి
టీటీడీ చైర్మన్ కు హోం మంత్రి అనిత విజ్ఞప్తి
నక్కపల్లి/ తిరుమల, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి):
నక్కపల్లి మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం టీటీడీ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఉపమాక ఆలయాన్ని 2017లోనే టీటీడీకి అప్పగించారని, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి పూర్వవైభవంగా తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ టీటీడీ.. ఈవో శ్యామలరావు, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణను పిలిపించి ఉపమాక ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చైర్మన్‌తో సమావేశం అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. 2017లోనే సీఎం చంద్రబాబు ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి కోసం మాస్లర్‌ప్లాన్ సిద్ధం తయారు చేయించారని, అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఉపమాక ఆలయం నిర్లక్ష్యానికి గురైందన్నారు.
కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి ఒక రోజు మాత్రమే బంగారు ఆభరణాలను అలంకరిస్తున్నారని, ఆభరణాలను ఐదు రోజులపాటు వుంచాలని, ఉపమాక ఆలయంలో టీటీడీ లడ్డూ ప్రసాదాలను విక్రయించి, తిరుమల టికెట్ బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని, ఉపమాక ఆలయంలో నిత్య అన్నదానం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఉపమాక ఆలయ ప్రాంగణంలో ఏసీ కల్యాణ మండపం, కొండపైకి వెళ్లే మెట్ల మార్గాన్ని వెడల్పు చేసి, షెడ్లు నిర్మించడం, నక్కపల్లి- ఉపమాక రహదారిని డబుల్ లేన్‌గా విస్తరించడం, కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం, భక్తులకు విశ్రాంతి భవనం వంటివి నిర్మించాలని ఆమె కోరారు. టీటీడీ చైర్మన్, అధికారుల సానుకూల స్పందనతో ఉపమాక ఆలయానికి పూర్వవైభవం వస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. టీటీడీ చైర్మన్‌ను కలిసిన వారిలో జడ్పీ కో-ఆప్షన్ మాజీ సభ్యుడు కొప్పిశెట్టి కొండబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేశ్, ఆలయ మాజీ చైర్మన్ బుజ్జి వున్నారు.
Updated Date - Feb 18 , 2025 | 01:48 AM