స్మార్ట్‌స్ర్టీట్స్ అధ్వానం
ABN, Publish Date - Feb 12 , 2025 | 12:55 AM
జీవీఎంసీ పరిధిలో స్మార్ట్‌సిటీ మిషన్‌లో భాగంగా నిర్మించిన స్మార్ట్‌స్ర్టీట్‌లు ఆక్రమణలు, నిర్వహణ లోపంతో కళావిహీనంగా మారిపోయాయి.
స్మార్ట్‌సిటీ మిషన్‌లో భాగంగా పనులు
రూ.60 కోట్లతో ఐదు రహదారుల సుందరీకరణ
విశాలంగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం
ఫుట్‌పాత్‌లపై యథేచ్ఛగా దుకాణాలు, షెడ్‌ల ఏర్పాటు
జీవీఎంసీ, పోలీస్‌శాఖల పర్యవేక్షణ లోపం
రూ.కోట్లు వెచ్చించినా ప్రయోజనం శూన్యం
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ పరిధిలో స్మార్ట్‌సిటీ మిషన్‌లో భాగంగా నిర్మించిన స్మార్ట్‌స్ర్టీట్‌లు ఆక్రమణలు, నిర్వహణ లోపంతో కళావిహీనంగా మారిపోయాయి. ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన స్థితిని కల్పించే లక్ష్యంతో రూ.60 కోట్లు వెచ్చించి ఐదు రోడ్లను స్మార్ట్‌స్ర్టీట్స్‌గా అభివృద్ధి చేశారు. అయితే లక్ష్యానికి అనుగుణంగా నిర్వహించడంలో జీవీఎంసీ, పోలీస్ అధికారులు విఫలమవడంతో రోడ్లకు ఇరువైపులా దుకాణాలు, మెకానిక్ షెడ్‌లు వెలిశాయి. ఫుట్‌పాత్‌లపై వేసిన టైల్స్ పైకిల లేచిపోవడం, పనులు పూర్తిస్థాయిలో చేపట్టకుండా వదిలేయడంతో కళావిహీనంగా మారాయి.
దేశంలోని ముఖ్య నగరాల్లో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులతోపాటు తగిన మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా 2015లో స్మార్ట్‌సిటీ మిషన్‌కు కేంద్రం శ్రీకారం చుట్టింది. మొదటిదశలో దేశంలోని 20 నగరాలను ఎంపికచేసి అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, అందులో విశాఖనగరానికి చోటు లభిం చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో నిధులను సమకూర్చడం ద్వారా ఆయా ప్రాజెక్టులను ఐదేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయించింది. జీవీఎంసీ పరిధిలో ఎంపికచేసిన ప్రాంతాన్ని స్మార్ట్‌సిటీ గా అభివృద్ధి చేయాలని భావించడంతో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, కోస్టల్‌బ్యాటరీ, జగదాంబజంక్షన్, సిరిపురం, పెదవాల్తేరు, పార్క్‌హోటల్ జంక్షన్ మధ్య ఉన్న ప్రాంతాన్ని (ఏబీడీ) అభివృద్ధి చేసేందుకు ఎంపికచేశారు. ఆ ప్రాంతంలో సుమారు రూ.1,700 కోట్లు వెచ్చించి 67 ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా ఏబీడీ ప్రాంతంలోని 70 కిలోమీటర్ల మేర 62 రోడ్లను రూ.130 కోట్లతో స్మార్ట్‌స్ర్టీట్‌లుగా అభివృద్ధి చేయాలని గ్రేటర్ విశాఖ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (జీవీఎస్‌సీసీఎల్) నిర్ణయించింది. స్మార్ట్‌స్ర్టీట్‌లుగా ఎంపికచేసే రోడ్లలో గాలిలో ఆక్సిజన్‌శాతం పెరిగేలా, ప్రజలను ఆర్యోగకరమైన అలవాట్లు పెంచుకునేలా సౌకర్యాలు కల్పించే ప్రాజెక్టుని డిజైన్ చేశారు. పాదచారులు నడిచేందుకు విశాలమైన ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, రోడ్డుపక్కనే వాహనాల పార్కింగ్‌ట్రాక్‌లు, రోడ్డుకి ఇరువైపులా మొక్కలను పెంచేందుకు గ్రీన్‌డెక్ట్‌లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అయితే దీనివల్ల ప్రస్తుతం ఉన్న రోడ్ల వెడల్పు తగ్గిపోతుందని, వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురై ట్రాఫిక్ సమస్యకు దారితీస్తుందని ప్రజలతోపాటు ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేవలం ఏడు కిలోమీటర్లు మేర ఐదు రోడ్లను మాత్రమే రూ.60 కోట్లతో స్మార్ట్‌స్ర్టీట్‌లుగా అభివృద్ధి చేయాలని జీవీఎస్‌సీసీఎల్ నిర్ణయించింది. ఈ మేరకు పెదవాల్తేరు జంక్షన్ నుంచి చినవాల్తేరు మార్గంలో ప్రభుత్వ మానసికవ ైద్యశాల జంక్షన్ వరకు ఉన్నరోడ్డు, పార్క్‌హోటల్ జంక్షన్ నుంచి పెదవాల్తేరు జంక్షన్ రోడ్డు, సిరిపురం జంక్షన్ నుంచి ఆల్‌ఇండియా రేడియో కేంద్రానికి ఇరువైపులా ఉన్న రెండు రోడ్లు, సిరిపురం జంక్షన్ నుంచి పాండురంగాపురం డౌన్ రోడ్డును స్మార్ట్‌స్ర్టీట్‌లుగా ఎంపిక చేశారు.
అధ్వానంగా మారిన వైనం
జీవీఎంసీ రూ.60 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన ఈ ఐదు రోడ్లలో ఒకటైన పెదవాల్తేరు జంక్షన్ నుంచి ప్రభుత్వ మానసిక వైద్యశాల జంక్షన్ రోడ్డు ప్రస్తుతం అధ్వానంగా మారింది. రోడ్డు పొడవునా అందమైన టైల్స్‌తో నిర్మించిన ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్‌ట్రాక్‌లు, పార్కింగ్ స్థలాలను ఆక్రమించి దుకాణాలు, మెకానిక్ షెడ్లు, స్ర్కాప్ గోడౌన్లను ఏర్పాటు చేశారు. స్మార్ట్‌స్ర్టీట్ ప్రాజెక్టు డిజైన్‌లో పేర్కొన్నట్టుగా ప్రజా వినియోగంలో ఉండేలా చూడాల్సిన జీవీఎంసీ, పోలీస్ అధికారులు ఆ బాధ్యతను విస్మరించడంతో ఆక్రమణదారులకు అడ్డులేకుండాపోయింది. వాకింగ్‌ట్రాక్, ఫుట్‌పాత్‌లను తవ్వేయడంతో రూ.కోట్లు వెచ్చించి వేసిన టైల్స్ పైకి లేచిపోయాయి. వాకింగ్‌ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లపై నడిచేందుకు చోటులేకపోవడంతో పాదచారులంతా రోడ్డుపైనే నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ రోడ్డులో ఉన్న బస్టాప్‌లను కూడా ఆక్రమించి, దుకాణాలను ఏర్పాటు చేసుకోవడం పరిస్థితికి అద్దంపడుతోంది. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్మార్ట్‌స్ట్రీట్‌గా అభివృద్ధి చేసిన రోడ్డులో ఆక్రమణలను తొలగించి లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.
Updated Date - Feb 12 , 2025 | 12:55 AM