ముక్కోటి ఏకాదశికి ముస్తాబైన సింహగిరి
ABN, Publish Date - Jan 10 , 2025 | 01:13 AM
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి శుక్రవారం ఉత్తర ద్వారంలో వైకుంఠవాసునిగా దర్శనం ఇవ్వనున్నారు. సింహగిరిపై ఉత్సవ ఏర్పాట్లను గురువారం దేవస్థానం, ఇంజనీరింగ్, పోలీస్ అధికారులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంయమనంతో ఉండాలని, అప్పుడే ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేందుకు వీలుకలుగుతుందన్నారు. శుక్రవారం అంతరాలయ దర్శనం, రాజగోపుర ప్రవేశాలను పూర్తిగా నిషేధించామని దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి చెప్పారు. ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాల్సిందేనని, ఉచిత పాస్‌లు జారీ చేయలేదన్నారు.
నేటి ఉదయం 5 నుంచి 11.30 వరకూ
ఉత్తర ద్వారంలో అప్పన్న దర్శనం
ఏర్పాట్లు పూర్తి: ఈఓ శ్రీనివాసమూర్తి
ఆర్జిత సేవలన్నీ రద్దు
సింహాచలం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి):
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి శుక్రవారం ఉత్తర ద్వారంలో వైకుంఠవాసునిగా దర్శనం ఇవ్వనున్నారు. సింహగిరిపై ఉత్సవ ఏర్పాట్లను గురువారం దేవస్థానం, ఇంజనీరింగ్, పోలీస్ అధికారులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంయమనంతో ఉండాలని, అప్పుడే ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేందుకు వీలుకలుగుతుందన్నారు. శుక్రవారం అంతరాలయ దర్శనం, రాజగోపుర ప్రవేశాలను పూర్తిగా నిషేధించామని దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి చెప్పారు. ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాల్సిందేనని, ఉచిత పాస్‌లు జారీ చేయలేదన్నారు.
వైదిక కార్యక్రమాల వివరాలు...
- శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవ. అనంతరం ప్రభాత ఆరాధనలు. 3 గంటలకు అయ్యవారి సేవ, మేలి ముసుగులతో బేడా తిరువీధి
- 4.15 గంటలకు ఆలయ ఉత్తర ద్వారంలో ప్రత్యేక పూజల అనంతరం అనువంశిక ధర్మకర్త, వారి కుటుంబ సభ్యులకు తొలిదర్శనం
- 4.30 నుంచి 5 గంటల వరకూ ఉత్తర రాజగోపురంలో స్వామికి విశేష అలంకరణ. 5 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు ఉత్తర రాజగోపురంలో ముందుగా ఏర్పాటుచేసిన పుష్పవేదిక పైనుంచి భక్తులకు వైకుంఠవాసుడి అలంకారంలో శేషపాన్పుపై స్వామివారి దర్శనం.
- 12 గంటల నుంచి సింహగిరి మాడవీధుల్లో తిరువీధి ఉత్సవం
- మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మహా నివేదన. ఆ సమయంలో భక్తులకు ఆలయంలో స్వామివారి దర్శనాలు లభించవు. 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు దర్శనాలు లభిస్తాయి. రాత్రి 7 గంటలకు రాత్రి ఆరాధన ఉంటుంది. ఆ సమయంలో భక్తులకు దర్శనాలు నిలుపుదల చేస్తారు. ప్రత్యేక ఉత్సవం కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలన్నీ గురువారం రద్దు చేశారు. అనువంశిక ధర్మకర్త, ఆయన కుటుంబ సభ్యులకు మినహా ఇతరులకు అంతరాలయ ప్రవేశం ఉండదు. అన్న ప్రసాద విభాగం ద్వారా భక్తులకు అసంఖ్యాకంగా భోజన వసతి కలిపిస్తున్నారు.
సింహగిరిపై శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి రూ.500 ఉత్సవ ప్రత్యేక దర్శన టికెట్లు ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సుమారు లక్ష లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర రాజగోపురంతోపాటు ఆలయంలో పలు ప్రాంతాలను సర్వాంగ సుందరంగా వివిధ రకాల పుష్పమాలికలతో అలంకరించారు.
ట్రాఫిక్, శాంతి భద్రతలు, నిఘా విభాగం, నేర నియంత్రణ విభాగాలకు చెందిన సుమారు 400 మంది పోలీసులు విధుల్లో ఉంటారు. వారిలో ఏసీపీలు ఇద్దరు, సిఐలు 10 మంది, ఎస్‌ఐలు 20 మంది ఉంటారు. గురువారం సాయంత్రానికే ట్రాఫీక్ పోలీసులు సింహాచలం చేరుకున్నారు.
ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు
జిల్లా దేవదాయ శాఖాధికారిణి అన్నపూర్ణ
విశాఖపట్నం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి):
విశాఖ జిల్లాలోని అన్ని వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి దర్శనాలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్టు జిల్లా దేవదాయ శాఖ అధికారిణి అన్నపూర్ణ తెలిపారు. ఆమె గురువారం మాట్లాడుతూ, తిరుపతిలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ టెలి కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారన్నారు. అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించుకొని, పోలీసుల సహకారం తీసుకుంటున్నామన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 01:13 AM