పేదలకు ఉపశమనం
ABN, Publish Date - Feb 01 , 2025 | 12:57 AM
అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో పేదల ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు కూటమి సర్కారు గ్రీన్‌సిగ్నల్
150 గజాల వరకు ఉచితం
జిల్లాలో సుమారు 25 వేల మందికి ప్రయోజనం
త్వరలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాలకు తాజాగా కన్వేయన్స్ డీడ్‌ల పంపిణీకి చర్యలు
విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):
అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో పేదల ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత టీడీపీ హయాంలో విశాఖలో సుమారు 50 వేల మంది పేదలకు పట్టాలు జారీచేసిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయం మేరకు 150 గజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. అంతకంటే ఎక్కువ ఆక్రమిత స్థలాలుంటే నిబంధనల మేరకు ఫీజులు చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పిస్తారు. అయితే 2019 అక్టోబరు 15వ తేదీ కంటే ముందు స్థలాలను ఆక్రమించుకున్న వారు మాత్రమే అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.
తాజా ఉత్తర్వుల మేరకు జిల్లాలో సుమారు 25 వేల మంది ఆక్రమణదారులకు ఊరట కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్రమబద్ధీకరణకు వీలుగా త్వరలో గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. కోడ్ ముగిసిన తరువాత వాటిని పరిశీలించి, అర్హులను నిర్ధారిస్తారని, ఆ తరువాత క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపడతారని అధికారులు చెబుతున్నారు.
150 గజాల వరకు ఉచితం
గెడ్డలు, నీటి ప్రవాహ ప్రాంతాలు, చెరువులు మినహా ఇతర ప్రభుత్వ భూముల్లో 2019 అక్టోబరు 15వ తేదీ కంటే ముందుగా స్థలాలను ఆక్రమించుకున్నవారు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. వీరిలో 150 గజాల వరకు ఆక్రమించుకున్న వారికి ఉచితంగానే క్రమబద్ధీకరిస్తారు. దీంతో పాటు పట్టా రూపంలో కన్వేయన్స్ డీడ్ ఇస్తారు. రెండేళ్ల తరువాత ఆ భూమిపై శాశ్వత హక్కులు కల్పిస్తారు. వీరికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. కాగా 151 నుంచి 300 గజాల వరకు ఆక్రమణలకు పాల్పడినవారు భూమి విలువలో 15 శాతం ఫీజు, 50 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. 301 నుంచి 450 గజాల వరకు భూమి విలువ 100 శాతం, 50 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది.
ఇవీ మార్గదర్శకాలు
భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీచేసింది. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతంలో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.2 లక్షలు, పట్టణాల్లో రూ.1.44 లక్షలు మించకూడదు. సొంతంగా కారుంటే క్రమబద్ధీకరణకు అర్హత ఉండదు. అయితే జీవనోపాధికి ట్యాక్సీ, వ్యవసాయం కోసం ట్రాక్టర్ సొంతంగా సమకూర్చుకున్నా అనుమతిస్తారు. మెట్ట, మాగాణి కలిసి ఐదెకరాలకు మించకూడదు.
అధిక ఆదాయం ఉన్న వారికి కూడా 150 గజాల వరకు ఉచితంగానే క్రమబద్ధీకరిస్తారు. 151 నుంచి 300 గజాల వరకు క్రమబద్థీకరణ కోరితే భూమివిలువలో 15 శాతం ఫీజు, పూర్తిగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 301 నుంచి 450 గజాల వరకు భూమి విలువలో 200 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజులు అక్కడ ఉన్న ధరల మేరకు చెల్లించాల్సి ఉంటుంది.
25 వేల మందికి ఉపశమనం
నగరంతోపాటు పరిసరాల ప్రాంతాల్లో కొండలు, కొండవాలు ప్రాంతాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలను ఆక్రమించుకుని వేలాది మంది ఇళ్లు నిర్మించుకున్నారు. గత టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో 296 మేరకు నగరంలో 83,891 మంది క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేయగా 46,526 మందిని అర్హులుగా గుర్తించి పట్టాలిచ్చారు. మరో 544 మందికి పట్టాలు జారీచేసే ప్రక్రియ పెండింగ్‌లో ఉండిపోయింది. 36,821 దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా 388 జీవో మేరకు 53,347 మంది దరఖాస్తు చేయగా 8,687 మంది అర్హులని తేల్చారు. వీరిలో 7,030 మంది క్రమబద్ధీకరణకు డబ్బు చెల్లించడంతో పట్టాలిచ్చారు. అయితే 296, 388 జీవో మేరకు క్రమబద్ధీకరణ చేసిన రెండేళ్లలో కన్వేయన్స్ డీడ్ ఇవ్వాలి. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పూర్తిగా పక్కనపెట్టేసింది. తాజాగా వారందరికీ కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు గతంలో క్రమబద్ధీకరణ జీవో మేరకు దరఖాస్తు చేయని వారంతా మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
Updated Date - Feb 01 , 2025 | 12:57 AM