ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్టాఫ్‌ నర్సు పోస్టులకు పైరవీలు

ABN, Publish Date - Jan 20 , 2025 | 12:03 AM

వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియ అధికారులకు తలనొప్పి వ్యవహారంగా మారింది.

  • - ప్రజాప్రతినిధుల సిఫారసులు

  • - ఇప్పటివరకు 20 మంది లేఖలు తెచ్చినట్టు సమాచారం

  • - అధికారులకు నేరుగా ఫోన్లు చేయిస్తున్న అభ్యర్థులు

  • - తల పట్టుకుంటున్న ఆరోగ్యశాఖ యంత్రాంగం

  • - ఇదే అదనుగా రంగంలోకి దళారులు

  • - పోస్టుకు రేటు కట్టి బేరసారాలు

  • - మెరిట్‌ ప్రాతిపదికగానే నియమకాలుంటాయన్న అధికారులు

విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):

వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియ అధికారులకు తలనొప్పి వ్యవహారంగా మారింది. 106 పోస్టుల భర్తీకి 8,300 మంది దరఖాస్తు చేశారు. డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ఎలాగైనా పోస్టు దక్కించుకునేందుకు కొంతమంది అభ్యర్థులు పైరవీలకు తెరతీశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల సిఫారసు లేఖలతో అధికారులను కలుస్తున్నారు. మరికొందరు నేరుగా ప్రజాప్రతినిధులతో ఫోన్లు చేయిస్తున్నారు. ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు సిఫారసు లేఖలతో అధికారులను సంప్రదించగా, మరో పది మంది ఫోన్లు చేయించినట్టు తెలిసింది.

వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్‌-1) పరిధి (ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం)లో ఖాళీగా ఉన్న 106 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి అధికారులు ఇటీవల నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 17 వరకు సాగిన ప్రక్రియలో 8,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే, ఒక్కో పోస్టుకు 78 మంది మధ్య పోటీ నెలకొంది. డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ పరిధిలోని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌లో ఖాళీగా ఉన్న 72 పోస్టులను, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా 34 పోస్టులను భర్తీ చేస్తామని ఆర్డీ పి.రాధారాణి తెలిపారు.

నియామక ప్రక్రియ ఇలా...

దరఖాస్తు గడువు ముగియడంతో అధికారులు వడపోత ప్రారంభించారు. మెరిట్‌ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తామని ఆర్డీ వెల్లడించారు. మార్కులకు 75 శాతం, కరోనా, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేసిన వారికి వెయిటేజీ ఉంటుందన్నారు. ఈ నెల 26న నాటికి తుది జాబితాను సిద్ధం చేసి, అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ఈ నెల 29న తుది జాబితా ప్రదర్శిస్తామని, 30, 31 నాటికి నియామక పత్రాలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధుల నుంచి అధికారులపై ఒత్తిడి వస్తోంది. నగర పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆరుగురు అభ్యర్థులకు సిఫారసు చేయగా, గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ సీనియర్‌ నేత ఇద్దరికి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో సీనియర్‌ నేత ఇద్దరికి సిఫారసు లేఖలు ఇచ్చారు. దీంతో అధికారులు తల పట్టుకుంటున్నారు.

రంగంలోకి దళారులు

ఆరోగ్యశాఖలో నియామక ప్రక్రియ ఎప్పుడు జరిగినా దళారులు రంగంలోకి దిగుతుంటారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి అభ్యర్థుల నుంచి పోస్టుకు రేటు కట్టి వసూలు చేస్తుంటారు. తాజా నియామక ప్రక్రియలోనూ దళారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. తొలుత కొంత మొత్తం చెల్లిస్తే చాలని, పోస్టు వచ్చిన తరువాత మిగిలిన మొత్తం ఇవ్వాలని అభ్యర్థులను ఆశపెడుతున్నారు. ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఆర్డీ సూచించారు. ఉద్యోగ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని వస్తే వారి వివరాలను తెలియజేయాలని ఆమె కోరారు. మెరిట్‌ ప్రాతిపదికనే ఎంపిక ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో అపోహలు, అనుమానాలను తావులేదన్నారు. మెరిట్‌ జాబితాను విడుదల చేసిన తరువాత అభ్యంతరాలను స్వీకరిస్తామని, వాటిని నివృత్తి చేసిన తరువాత తుది జాబితాను వెల్లడిస్తామన్నారు.

Updated Date - Jan 20 , 2025 | 12:03 AM