శరవేగంగా రంపుల ఘాట్ విస్తరణ పనులు
ABN, Publish Date - Feb 24 , 2025 | 11:43 PM
కృష్ణాదేవిపేట- చింతపల్లి జాతీయ రహదారిలో రంపుల ఘాట్ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొండలను సైతం పిండి చేసి రహదారి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 70 శాతం రహదారి పనులు పూర్తి చేశారు. మరో 30 శాతం పనులు పూర్తి చేయాల్సి వుంది.
70 శాతం జాతీయ రహదారి పనులు పూర్తి
చింతపల్లి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కృష్ణాదేవిపేట- చింతపల్లి జాతీయ రహదారిలో రంపుల ఘాట్ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొండలను సైతం పిండి చేసి రహదారి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 70 శాతం రహదారి పనులు పూర్తి చేశారు. మరో 30 శాతం పనులు పూర్తి చేయాల్సి వుంది.
రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, రంపుల ఘాట్, చింతపల్లి, పాడేరు, అరకు మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి 516-ఈ నిర్మాణం జరుగుతున్నది. ఆరు నెలల క్రితం రంపుల ఘాట్ రోడ్డు విస్తరణ పనులను నేషనల్ హైవే అథారిటీ అధికారులు ప్రారంభించారు. ఘాట్‌లో ఉన్న చెట్లను, బండరాళ్లను తొలగించి రహదారి నిర్మిస్తున్నారు. ఈ ఘాట్‌రోడ్డును తొలుత బ్రిటీష్ అధికారులు నిర్మించారు. సుమారు ఎనిమిది అడుగుల వెడల్పుతో 14 మలుపులతో నిర్మాణం జరిగింది. ఈ రహదారిని పదేళ్ల క్రితం పది అడుగులుగా వెడల్పు చేశారు. ఈ రహదారిలో ఎదురెదురుగా ప్రయాణించే వాహనాలు తప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ప్రస్తుతం నేషనల్ హైవే అథారిటీ అధికారులు 20 మీటర్ల వెడల్పుతో ఘాట్‌రోడ్డును విస్తరిస్తున్నారు. మలుపులను విశాలంగా నిర్మించారు. ఘాట్ రోడ్డులో వాహనాలు ఓవర్‌టేక్ చేయకుండా మార్కింగ్ చేస్తున్నారు. కాగా మరో రెండు నెలల్లో ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Updated Date - Feb 24 , 2025 | 11:43 PM