ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట

ABN, Publish Date - Mar 02 , 2025 | 12:13 AM

గ్రామాల్లో శత శాతం రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి సాగు చేసేలా చైతన్యవంతం చేసే కార్యక్రమాలకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది.

కషాయం తయారు చేసే పనిలో ఉన్న మహిళలు

వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి మండలానికో గ్రామంలో శత శాతం ప్రకృతి వ్యవసాయ సాగు దిశగా అడుగులు

గ్రామాల్లో సర్వే చేస్తున్న వ్యవసాయ శాఖాధికారులు

చోడవరం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో శత శాతం రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి సాగు చేసేలా చైతన్యవంతం చేసే కార్యక్రమాలకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. చాలా ఏళ్లుగా అన్ని ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో దాని ఫలితాలు పెద్దగా కనిపించడం లేదు. ఈ క్రమంలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ఆ గ్రామంలో శత శాతం రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు ప్రస్తుతం గ్రామాల్లో సర్వే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని గుర్తించి, ఆ గ్రామంలోని రైతులందరూ సేంద్రియ ఎరువులు వాడి ప్రకృతి వ్యవసాయం చేసేలా వారిని చైతన్యవంతులను చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలులో వ్యవసాయశాఖ, అనుబంధ విభాగం ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో పాటు స్థానిక డ్వాక్రా మహిళలు, రైతుల భాగస్వామ్యంతో ఈ పథకం అమలయ్యేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం అమలు చేసేందుకు ప్రస్తుతం మండలాలవారీగా గ్రామాల ఎంపికపై అధికారులు సర్వే చేపట్టారు. గ్రామాలను గుర్తించిన అనంతరం అక్కడ స్థానిక రైతులతో పాటు స్థానిక డ్వాక్రా మహిళలకు కలిపి మండలాల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఇచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగా తొలుత ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులందరి వివరాలు సేకరించి వారు ఏ పద్ధతిలో సాగు చేస్తున్నారో తెలుసుకుని, వారికి సేంద్రియ సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ సాగులో నిరంతర ఆదాయం లభించేలా పంటలు పండించే పద్ధతులను రైతులకు అలవాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. వరి, ఇతర సాధారణ పంటలతో పాటు ఆకు కూరలు, కూరగాయలు కూడా పండించడం ద్వారా సుస్థిర ఆదాయం వచ్చేలా కార్యక్రమాలు రూపొందించి ఆ షెడ్యూల్‌ను రైతులు పాటించేలా వ్యవసాయ సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది కూడా పర్యవేక్షించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా లభ్యమయ్యే దినుసులను ఉపయోగించి వాటితో కషాయాలు, జీవ ఘన ఎరువులను తయారు చేసే విధానాలను కూడా రైతులకు చూపించనున్నారు. రైతులంతా ఈ వ్యవసాయం చేసేలా వారిని చైతన్యవంతులను చేయడం, ఆపై ఇతర గ్రామాల్లో కూడా ఇదే విధానం అనుసరించేలా అధికారులు ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి రైతులు సేంద్రియ సాగు చేసే లక్ష్యంతో ఈ ప్రకృతి వ్యవసాయ విభాగం పదేళ్ల క్రితమే ఏర్పాటైంది. వ్యవసాయశాఖకు అనుబంధంగా ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో మండల స్థాయిలో కో- ఆర్డినేటర్లు, గ్రామస్థాయిలో గ్రామ రిసోర్సు పర్సన్ల ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయ విభాగం కార్యక్రమాలు నిర్వహించే వారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత వరకూ ఈ ప్రకృతి వ్యవసాయ విభాగం కార్యక్రమాలు చక్కగానే అమలయ్యేవి. అయితే 2019 తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఈ కార్యక్రమంపై ప్రభుత్వం ఆసక్తి చూపించకపోవడంతో ఈ ప్రకృతి వ్యవసాయం పూర్తిగా మిథ్యగా మారి కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం, కూటమి ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేయాలన్న పట్టుదలగా ఉండడంతో, ప్రస్తుతం నూరుశాతం ప్రకృతి వ్యవసాయం అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే ప్రకృతి వ్యవసాయాన్ని పాటించేలా పూర్తిస్థాయిలో వ్యవసాయ విభాగాన్ని ఉపయోగించుకునేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రకృతి సాగు పెంచే దిశగా అధికారుల కార్యాచరణ విజయవంతం అయితే గ్రామాల్లో సేంద్రియ ఉత్పత్తులు మరింత విరివిగా అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రసాయన ఎరువుల వినియోగంతో భూముల సారం కోల్పోవడంతో పాటు ప్రజలు రైతుల ఆరోగ్యాలు దెబ్బతినడం మినహా, మరెలాంటి ఉపయోగం లేనందున, తిరిగి సేంద్రియ పంటల వైపు రైతులు మొగ్గు చూపేలా అధికారులు కార్యాచరణ చేపడుతున్నారు.

Updated Date - Mar 02 , 2025 | 12:13 AM