ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పిల్లలను ఓ కంట కనిపెట్టండి

ABN, Publish Date - Feb 16 , 2025 | 01:30 AM

పిల్లల వైఖరిలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తల్లిదండ్రులు చెప్పే మాటలను వినేందుకు కొంతమంది ఇష్టపడడం లేదు.

  • కొంతమందిలో చిన్న వయసు నుంచి ప్రవర్తనలో మార్పులు

  • తల్లిదండ్రులు సకాలంలో గుర్తించాలంటున్న వైద్యులు

  • లేనిపక్షంలో కౌమార దశకు వచ్చేసరికి మానసిక సమస్యలకు

  • దారితీసే అవకాశం ప్రమాదం ఉందని హెచ్చరిక

  • అడిగివన్నీ అందించాల్సిన అవసరం లేదు

  • ఆర్థిక పరిస్థితులు, కుటుంబ ఇబ్బందులు వంటివి అర్థమయ్యేలా చెప్పాలి

  • వారికి ప్రతిరోజూ కొంత సమయం కేటాయించాలి

  • అతి గారాబంతో అనేక రకాల ఇబ్బందులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):

పిల్లల వైఖరిలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తల్లిదండ్రులు చెప్పే మాటలను వినేందుకు కొంతమంది ఇష్టపడడం లేదు. అయితే అటువంటి పరిస్థితిని ప్రాథమిక దశలోనే గుర్తించి, సరిదిద్దాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న వయసులో తల్లిదండ్రుల మాట వినని పిల్లలు...కౌమార దశకు వచ్చేసరికి విపరీతమైన ధోరణి తారస్థాయికి చేరి మానసిక సమస్యల బారినపడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. పిల్లలను తొలి నుంచి ఒక కంట కనిపెడుతూ ఉండడం, వారి వ్యవహారశైలిలో వస్తున్న మార్పులను గుర్తించి సరిచేయడం ద్వారా తప్పుడు మార్గాల వైపు వెళ్లకుండా, ఇతర సమస్యల బారినపడకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.

సెల్‌ఫోన్‌తో సమస్యతో మొదలు..

ప్రతి ఒక్కరికీ ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ అత్యవసర వస్తువుగా మారిపోయింది. పెద్దలే కాదు.. పిల్లలు కూడా స్మార్ట్‌ ఫోన్‌ లేకపోతే తల్లిపెట్టే గోరు ముద్దలను కూడా తినడం లేదు. ఇదంతా తల్లిదండ్రులు చేసిన అలవాటే. అయితే, ఈ అలవాటే భవిష్యత్తులో పిల్లలను అనేక ఇబ్బందుల బారినపడేలా చేస్తుంది. ఒక వయసు దాటిన తరువాత పిల్లల గంటల తరబడి ఫోన్‌కు అలవాటు పడి అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. గంటల తరబడి ఫోన్‌ చూడడం వల్ల బ్రెయిన్‌లో ఉండే వైట్‌ మేటర్‌ (మెదడులోని టిష్యూ)పై ప్రభావం పడుతోంది. సాధారణంగా మెదడు విశ్రాంతి కోరుకున్నప్పుడు వెంటనే రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లాలి. అలా వెళ్లడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది మళ్లీ బ్రెయిన్‌ రిఫ్రెష్‌ అవుతుంది. అయితే, చాలా మంది ఫోన్‌లో వీడియోలు చూస్తూ మెదడు మరింత ఒత్తిడికి గురయ్యేలా చేస్తున్నారు. దీనివల్ల మనిషి ఆలోచనల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా పిల్లల్లో అయితే మెదడు భిన్నరకాలుగా స్పందిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. మెదడులోని టిష్యూ ఒత్తిడికి గురికావడం వల్ల పిల్లలు ఏకాగ్రతను కోల్పోవడం తద్వారా తీవ్రమైన ఒత్తిడికి గురికావడం జరుగుతోంది. ఏకాగ్రత లోపించడం వల్ల అన్నింటిలో వెనుకబడి విశ్వాసం కోల్పోతారు. ఆ తరువాత దిగులు (డిప్రెషన్‌) ప్రారంభమై ఎవరితో కలిసేందుకు ఇష్టపడరు. ఇది క్రమంగా మానసిక సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి మూడు నుంచి పదేళ్ల వయసు మధ్య పిల్లల్లో కనిపిస్తుంటాయని చెబుతున్నారు. ఆ తరువాత దశలో పిల్లలు వ్యవహారశైలి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటున్నారు.

తీవ్రంగా స్పందించే తీరు..

12 నుంచి 14 ఏళ్ల వయసుకు వచ్చేసరికి కొంతమంది పిల్లల వ్యవహారశైలి పూర్తి భిన్నంగా ఉంటోంది. కోర్కెలు పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునే మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. ఆ సమయంలో పిల్లలను తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. పిల్లల స్నేహితులు, వారి అలవాట్లు, తిరిగే ప్రదేశాలు గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. లేకపోతే తప్పుడు మార్గాల వైపు వెళ్లే ప్రమాదం ఉంది. పిల్లల వ్యవహారశైలి భిన్నంగా ఉంటే మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండి తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడపడం ద్వారా విపరీతమైన సమస్యలకు దారితీయకుండా కాపాడుకోవచ్చు. ఈ వయసులో పిల్లలు అనేకం కోరుతుంటారు. వాటిని తీర్చే విషయంలో తల్లిదండ్రులు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ ఇబ్బందులు వంటివి అర్థమయ్యేలా చెప్పి కాదనాలి. అవసరమైనవి అయితే కొంత ఇబ్బంది అయినా కొనవచ్చు. అవసరం లేనివి అడిగితే మాత్రం...ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. కొట్టో, తిట్టో వద్దని చెప్పడం వల్ల పిల్లలు మరింత అగ్రెసివ్‌గా తయారై, తల్లిదండ్రుల పట్ల కసిని పెంచుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వాతావరణం విపరీతమైన పరిణామాలకు దారితీయవచ్చు.

గుడ్‌ పేరెంటింగ్‌తో పరిష్కారం

గుడ్‌ పేరెంటింగ్‌ అన్నది చాలా కీలకం. పిల్లలను పెంచే విధానమే భవిష్యత్తులో వారి జీవితాలకు భరోసాను కల్పిస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం పిల్లలతో గడపాలి. చిన్న వయసు నుంచి ఇలా సమయం వెచ్చించడం చాలా మంచిది. పదేళ్లు దాటిన తరువాత మాత్రం తప్పనిసరి. అప్పుడే పిల్లల్లో వచ్చే విపరీతమైన మార్పులను గుర్తించి వాటిని సరి చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ మంచి,చెడులు, సమాజంలో వస్తున్న మార్పులు, ఇంట్లో ఉన్న పరిస్థితులను, వారి బాధ్యతలను తెలియజేస్తూ ఉండాలి. గుడ్‌ పేరెంటింగ్‌ మాత్రమే పిల్లలను మంచి మార్గంలో తీసుకువెళ్లేందుకు దోహదం చేస్తుందని నిపుణులు చెబున్నారు.

ఇలా చేయాలి..

చిన్న వయసు నుంచి పిల్లలను నలుగురితో కలిసేలా చేయాలి. శారీరక శ్రమ కలిగించే యాక్టివిటీస్‌లో భాగం చేయడం ద్వారా ఫోన్‌ వంటి వాటికి దూరంగా ఉంచవచ్చు. ఇరుగుపొరుగుతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లల్లో ఆత్మన్యూనతా భావం తగ్గుతుంది. పెద్దలు చెప్పే మాటలను వినేలా అలవాటు చేయాలి. పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో మొండితనం తగ్గుతుంది.

ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాలి

డాక్టర్‌ ముత్యాల బాలాజీ, మానసిక నిపుణులు

కొన్నాళ్లుగా పిల్లల్లో అతి ప్రవర్తన ప్రధానమైన సమస్యగా ఉంటోంది. కౌమార దశ దాటిన తరువాత పిల్లల్లో ఈ తరహా వ్యవహారశైలి అధికంగా కనిపిస్తోంది. ఎంత చెప్పినా పిల్లలు దారిలోకి రావడం లేదని తల్లిదండ్రులు మా వద్దకు తీసుకువస్తున్నారు. అటువంటి వారికి కౌన్సెలింగ్‌ చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు ప్రాథమిక దశలో పిల్లల వ్యవహారశైలిని గుర్తించి చక్కదిద్దే ప్రయత్నం చేస్తే ఈ ఇబ్బంది ఉండదు. పిల్లల్లో నియంత్రించలేని ప్రవర్తన, కడుపు నొప్పి, తలనొప్పి, దీర్ఘకాలం విచారంగా ఉండడం, కారణం లేకుండా బరువు తగ్గడం, చదువులో చురుకుదనం లేకపోవడం, మానసిక కల్లోలం, చికాకు వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. ప్రతి చిన్నదానికి అలగడం, కోప్పడడం వంటివి కూడా పిల్లల్లో మానసిక ఇబ్బందులకు కారణంగా గుర్తించాలి.

Updated Date - Feb 16 , 2025 | 01:30 AM