కాపుజగ్గరాజుపేటలో భారీ చోరీ
ABN, Publish Date - Mar 06 , 2025 | 01:32 AM
తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. దుండగులు కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి 70 తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. ఇందుకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
70 తులాల బంగారాన్ని అపహరించుకుపోయిన దొంగలు
కూర్మన్నపాలెం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):
తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. దుండగులు కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి 70 తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. ఇందుకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 88వ వార్డు పరిధి కాపుజగ్గరాజుపేట ఎస్టీబీఎల్ సమీపంలో గల వసుంధర గార్డెన్స్‌లో ఉప్పులూరి ఉమ పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆమె భర్త అప్పలరాజు ఉద్యోగ రీత్యా ఖతార్‌లో ఉంటున్నారు. ఉమ తల్లి రత్నం సమీపంలోని ఇంట్లో ఉంటున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఈ నెల 3వ తేదీ ఉదయం ఉమ తమ ఇంటికి తాళం వేసి పిల్లలతో కలిసి తల్లి వద్దకు వెళ్లారు. బుధవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్ రూమ్‌లోని బీరువా తలుపులు పగులకొట్టి ఉన్నాయి. బీరువాలో భద్రపరిచిన సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలు (70 తులాలు) కనిపించకపోవడంతో ఆమె దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Updated Date - Mar 06 , 2025 | 01:33 AM