చెరువు మీదుగా హైవే పనులు
ABN, Publish Date - Jan 31 , 2025 | 01:01 AM
విశాఖ-రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్సప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా మండలంలోని చిన్నయ్యపాలెం వద్ద జరుగుతున్న ఇంటర్ చేంజ్ (సింగిల్ ట్రంపెట్) పనులను సబ్బవరం శివారు గ్రామాల రైతులు గురువారం అడ్డుకున్నారు.
అడ్డుకున్న సబ్బవరం పంచాయతీ శివారు గ్రామాల రైతులు
సబ్బవరం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): విశాఖ-రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్సప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా మండలంలోని చిన్నయ్యపాలెం వద్ద జరుగుతున్న ఇంటర్ చేంజ్ (సింగిల్ ట్రంపెట్) పనులను సబ్బవరం శివారు గ్రామాల రైతులు గురువారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కొటాన అప్పారావు, గొర్లి అచ్చింనాయుడు, తదితరులు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా సాగునీటి చెరువులో నుంచి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. సర్వే నంబరు 109లో 15.9 ఎకరాల్లో పెదనాయుడు చెరువు ఉందని, దీనిని ఆనుకొని అనకాపల్లి- ఆనందపురం హైవేకు, షీలానగర్- సబ్బవరం సాగరమాల రోడ్డును అనుసంధానం చేస్తూ ఇంటర్ చేంజ్ నిర్మిస్తున్నారని చెప్పారు. చెరువుకు చెందిన సుమారు 2.3 ఎకరాలు ఇంటర్ చేంజ్ నిర్మాణానికి అవసరం అవుతుందని, ఇందుకు ప్రతిగా జిరాయితీ భూమిని కొనుగోలు చేసి చెరువు తవ్వి ఇస్తామని గతంలో ఒకసారి జరిగిన సమావేశంలో అధికారులు చెప్పారని గుర్తు చేశారు. దీనిపై నాటి ఇరిగేషన్ ఏఈ ద్వారా ఎస్‌ఈకి సమాచారం ఇచ్చామన్నారు. అయితే చెరువు స్థలం ఇవ్వడం నిబంధనలు అంగీకరించవంటూ ఎస్‌ఈ స్పష్టం చేశారని, తరువాత ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఎవరూ ఇటీవల వరకు ఆ ప్రస్తావన తేలేదన్నారు. అయితే వారం రోజుల నుంచి పెదనాయుడు చెరువును పూడ్చి, పక్కనే ట్రెంచ్ తవ్వుతున్నారన్నారు. తమకు మాటమాత్రం అయిన చెప్పకుండా చెరువులో రోడ్డు నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నించారు. తక్షణమే పనులు ఆపాలని డిమాండ్ చేశారు. దీంతో సైట్ ఇంజనీర్ రామకృష్ణ, విజయనగరంలో వున్న ఎన్‌హెచ్‌ఏఐ పీడీకి ఫోన్ చేసి మాట్లాడారు. తాను సబ్బవరం వచ్చి రైతులతో మాట్లాడతానని ఆయన చెప్పారు. దీంతో రైతులు అక్కడి నుంచి వెనుతిరిగారు.
Updated Date - Jan 31 , 2025 | 01:01 AM