ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శరవేగంగా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే

ABN, Publish Date - Feb 04 , 2025 | 01:12 AM

విశాఖపట్నం-రాయపూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది.

  • చురుగ్గా సాగుతున్న విశాఖ- రాయ్‌పూర్‌ ఆరు లేన్ల రోడ్డు నిర్మాణం

  • ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి ఎక్స్‌ప్రెస్‌ హైవే

  • 464 కిలోమీటర్లు, రూ.20 వేల కోట్లు

  • ఏపీలో 100 కి.మీ.లు, ఒడిశాలో 240, ఛత్తీస్‌గఢ్‌లో 124 కి.మీ.లు

  • సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం వద్ద అనకాపల్లి- ఆనందపురం రోడ్డుకు ఇంటర్‌ ఛేంజ్‌

సబ్బవరం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం-రాయపూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. మూడు రాష్ట్రాల మీదుగా ఆరు వరుసలతో నిర్మిస్తున్న ఈ రహదారికి సంబంధించి సబ్బవరం మండల పరిధిలో రోడ్డు నిర్మాణంతోపాటు సిగ్నల్‌ లైట్లు, నేమ్‌ బోర్డులు, సైన్‌ బోర్డులు, సీసీ కెమెరాలు, సోలార్‌ లైట్లు తదితర పనులు పూర్తయ్యాయి. రహదారిపై ఎక్కడా మనుషులు, పశువులు దాటకుండే వుండడానికి గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిని కలుపుతూ సబ్బవరం సమీపంలో చిన్నయ్యపాలెం వద్ద సింగిల్‌ ట్రంపెట్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం మినహా మిగిలిన పనులు పూర్తయినట్టు ఎన్‌హెచ్‌ఏఐ అధికారి ఒకరు తెలిపారు.

భారతమాల ప్రాజెక్టు ఫేజ్‌-1 కింద ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ ఆరు వరుసల గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రతిపాదించింది. డీపీఆర్‌, భూసేకరణ, టెండర్‌ ప్రక్రియలు 2021లో పూర్తయ్యాయి. ఏడీబీ నిధులు సుమారు రూ.20 వేల కోట్లతో నిర్మించే ఈ రోడ్డు పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం వున్న జాతీయ రహదారితో (రాజాపులోవ- రాయ్‌పూర్‌) సంబంధం లేకుండా కొత్తగా దీనిని నిర్మిస్తున్నారు. ఎన్‌హెచ్‌-130 సీడీ నంబరు కేటాయించిన ఈ రహదారి మొత్తం పొడవు 464 కిలోమీటర్లు. ఏపీలో 100 కి.మీ.లు, నాలుగు ప్యాకేజీలు; ఒడిశాలో 240 కి.మీ.లు, 11 ప్యాకేజీలు; ఛత్తీస్‌గఢ్‌లో 124 కి.మీ.లు, మూడు ప్యాకేజీలుగా ఉంది. ఏపీలో సబ్బవరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా ఆలూరు వరకు నాలుగు ప్యాకేజీలుగా పనులు చేపట్టారు. ఆలూరు-జక్కువ 1వ ప్యాకేజీ, జక్కువ-కొర్లాం 2వ ప్యాకేజీ, కొర్లాం-కంటకాపల్లి 3వ ప్యాకేజీ, కంటకాపల్లి-సబ్బవరం 4వ ప్యాకేజీగా విభజించారు. సబ్బవరం నుంచి కొత్తవలస మండలం కంటకాపల్లి వరకు సుమారు 20 కి.మీ.ల రహదారి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. సబ్బవరం మండలంలో చిన్నయ్యపాలెం, మలునాయుడుపాలెం, గుల్లేపల్లి, ఎల్లుప్పి గ్రామాల పరిధిలో ఆరు కిలోమీటర్లు ఉంది. వాస్తవంగా 2024 చివరి నాటికి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం పూర్తికావాలి. అయితే కొన్నికారణాల వల్ల ఏడాది ఆలస్యంగా 2025 డిసెంబరునాటికి పూర్తి అవుతుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. సబ్బవరానికి ఏడు కిలోమీటర్లు దూరంలో గులివిందాడ- చీపురువలస మధ్య టోల్‌ ప్లాజ్‌ నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం- రాయ్‌పూర్‌ మధ్య దూరం 130 కిలోమీటర్లు, ప్రయాణ సమయం ఆరు గంటలు తగ్గుతుంది.

సాగరమాల పనులు త్వరలో ప్రారంభం

కాగా సబ్బవరం నుంచి షీలానగర్‌ వరకు సాగరమాల (పోర్టు కనెక్టివిటీ రోడ్డు) రోడ్డు నిర్మాణానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.950 కోట్లు కేటాయించింది. గతంలోనే భూ సేకరణ పూర్తికాగా, నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయితే విశాఖ నగరంలో భారీ వాహనాల రద్దీ పూర్తిగా తగ్గిపోతుంది.

Updated Date - Feb 04 , 2025 | 01:12 AM