మూగ జీవాలకు మంచి రోజులు
ABN, Publish Date - Feb 22 , 2025 | 10:36 PM
పశు పోషణ భారంగా మారిన రైతాంగాన్ని ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పశువుల కోసం గోకులాల షెడ్లు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. ఉపాధి హామీ పథకంలో వీటి నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
ఉపాధి హామీలో గోకులాల నిర్మాణం
కూటమి ప్రభుత్వం చొరవతో పశువులకు గూడు
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతాంగం
కొయ్యూరు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): పశు పోషణ భారంగా మారిన రైతాంగాన్ని ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పశువుల కోసం గోకులాల షెడ్లు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. ఉపాధి హామీ పథకంలో వీటి నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
వ్యవసాయంలో పశువులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే వీటిని సంరక్షించుకోవడానికి రైతులకు భారంగా మారింది. రసాయన ఎరువుల వాడకం పెరగడంతో పశువులను రైతులు విక్రయిస్తున్నారు. దీంతో ఏజెన్సీ వ్యాప్తంగా పశుగణం తగ్గిపోతోంది. సేంద్రియ ఎరువు గగనమైంది. దీనిని గుర్తించిన కూటమి ప్రభుత్వం పశుగణనను పెంచేందుకు పశువులను కట్టి మేపుకొనేందుకు వీలుగా గోకుల షెడ్లు మంజూరు చేస్తున్నది. ఉపాధి హామీ పథకంలో వీటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా మార్గదర్శకాలు విడుదల చేసింది. గోకులం షెడ్ల నిర్మాణంలో ప్రభుత్వం 90 శాతం భరిస్తుండగా రైతు పది శాతం భరించాలి. కూటమి ప్రభుత్వ ఆదేశంతో తొలి విడతలో మండలంలో ప్రతీ పంచాయతీకి రెండు గోకులాలు చొప్పున మంజూరు చేసింది. ఆరు పశువులు ఉంటే రూ.2.3 లక్షలు, నాలుగు ఉంటే రూ.1.6 లక్షలు రెండు ఉంటే రూ.లక్షతో షెడ్లు నిర్మించనున్నారు. అలాగే కోళ్లు, మేకల పెంపకానికి షెడ్లు నిర్మించుకొనేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. వీటికి 70 శాతం ప్రభుత్వం, 30 శాతం రైతు భరించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. చింతపల్లి క్లస్టరు పరిధిలోని కొయ్యూరు, చింతపల్లి, జీకే వీధి మండలాలలో రూ.2.74 కోట్లతో 132 షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు కొయ్యూరు మండలంలో 66 షెడ్లు, చింతపల్లికు 34, జీకే వీధి మండలంలో 32 షెడ్లు నిర్మించనున్నారు. వీటిలో 40 షెడ్లు వివిధ దశల్లో ఉండగా.. మరో 35 షెడ్లకు పునాదులు పూర్తికావచ్చాయి. మిగిలిన వాటిని నిర్మించేందుకు ఉపాధి హామీ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి 132 షెడ్లు పూర్తిచేయించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
గోకులం షెడ్లు పూర్తికి చర్యలు
ఉపాధి హామీ పథకం ఏపీడీ లాలం సీతయ్య
క్లస్టరు పరిధిలో మంజూరైన గోకులం షెడ్లు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇవి త్వరితగతిన పూర్తయితే మిగిలిన వారికి అవగాహన వస్తుంది. రెండో విడత నిర్మాణాలకు అందరూ ముందుకు వస్తారు ప్రస్తుతం మంజూరు చేసిన షెడ్ల నిర్మాణాలు చురుగ్గానే జరుగుతున్నాయి.
Updated Date - Feb 22 , 2025 | 10:36 PM