జీబీఎస్ కలకలం
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:37 AM
గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) బారినపడి సోమవారం ఒక మహిళ మృతిచెందడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.
కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
ఆస్పత్రిలోని రెండు విభాగాల్లో మరో ఐదుగురు బాధితులు
లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం కావాలంటున్న వైద్యులు
కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, బయట ఆహారానికి దూరంగా ఉండాలని సూచన
విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి):
గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) బారినపడి సోమవారం ఒక మహిళ మృతిచెందడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మరో ఐదుగురు బాధితులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురు జనరల్ మెడిసిన్ వార్డులో, మరొకరు న్యూరాలజీ విభాగంలో ఉన్నారు. ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా జీబీఎస్ కేసులు వరుసగా నమోదవుతుండడం కలవరపరుస్తోంది.
అప్రమత్తం కావాల్సిందే..
జ్వరం, జలుబు, దగ్గు, డయేరియా వంటివి వచ్చి తగ్గిన వారం, పది రోజుల్లో కాళ్లు, చేతులు నీరసంగా ఉండడం,తిమ్మిర్లు ఎక్కడం, గొంతులోకి ముద్ద దిగకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, కాళ్లలో మంటలు వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సేవలు పొందాలని, లేనిపక్షంలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి ప్రాణాలు పోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
డయేరియా వస్తే జాగ్రత్త..
జీబీఎస్ బారినపడేలా చేయడంలో ఒక బాక్టీ రియా కీలకంగా వ్యవహరిస్తుందని చెబుతున్నారు. అదే కాంపెలోబాక్టర్ జెజునీ. ఈ బాక్టీరియా వల్ల డయేరియా వస్తుంది. ప్రధానంగా కలుషిత నీటిని, ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ బాక్టీ రియా బారినపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ బాక్టీరియా బారినపడిన వాళ్లు తీవ్రమైన విరేచనాలతో బాధపడతారు. ఆ సమస్య తగ్గిన వారం రోజులకు కాళ్లు చచ్చుబడిపోవడం, ఇతర సమస్యలతో రోగులు ఆస్పత్రుల్లో చేరు తుంటారని, కొన్నిసార్లు డయేరియా లేకపోయినా కూడా జీబీఎస్ బారినపడవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారినపడకుండా ఉండవచ్చునని వైద్యులు చెబు తున్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి. బయట ఆహారా నికి దూరంగా ఉండాలి. ఇన్‌ఫెక్షన్లు బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, శారీ రక వ్యాయామాలు చేయడం, మంచి నిద్ర ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి.
ఇదీ చికిత్స..
వ్యాధి బారినపడిన వారికి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇంజెక్షన్లు అందిస్తారు. అలాగే, రక్త శుద్ధి పద్ధతి ద్వారా రోగి కోలుకునేలా చేయవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఈ విధానంలో భాగంగా మైలిన్ పొరను డ్యామేజ్ చేసే యాంటీబాడీస్‌ను తొల గిస్తారు. తద్వారా రోగి వేగంగా కోలుకునేలా చేస్తారు. అయితే, ఈ విధానంలో బీపీ తగ్గడం, ఇన్‌ఫెక్షన్లు రావడం వంటి ఇబ్బందులు ఉంటాయి. కొందరు రోగులకు ఇంజెక్షన్లు ఇవ్వడంతోపాటు ఈ విధానంలో కూడా చికిత్స అందించాల్సి ఉంటుంది.
వ్యాధి నిరోధక శక్తి పెంపుతో వ్యాధికి అడ్డుకట్ట
- డాక్టర్ ఎస్.గోపి,
న్యూరాలజీ విభాగాధిపతి, కేజీహెచ్
ఈ వ్యాధి ఎవరికైనా రావచ్చు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే మార్గాలపై దృష్టిసారించాలి. అతిగా ఆందోళన చెందాల్సిన అసవరం లేదు. వైరస్, బాక్టీరియా బారినపడి కోలుకున్న తరువాత ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే మాత్రం అప్రమత్తం కావాలి. ఆ తరహా లక్షణా లన్నీ జీబీఎస్ కాకపోవచ్చు. కొన్నిసార్లు ఇతర కారణాలతో ఇటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. నెర్వ్ కండక్షన్ స్టడీ నిర్వహించి నిర్ధారిస్తాం. బయట ఐదు వేలు విలువజేసే ఈ పరీక్షను ప్రతిరోజూ పది మందికి ఉచితంగా కేజీహెచ్‌లో నిర్వహిస్తున్నాం.
పెద్దాస్పత్రిలో
ఇమ్యునోగ్లోబులిన్స్ ఇంజెక్షన్ల కొరత
జీబీఎస్ బాధితులకు చికిత్సలో అవే కీలకం
సామాన్యులు బయటే కొనుగోలు చేయాలంటే కష్టమే
ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ.10 వేల నుంచి 15 వేలు...
విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి):
గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) బారినపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతిచెందడానికి వైద్యం సరిగా అందకపోవడమే కారణమనే వాదన వినిపిస్తోంది. చికిత్సలో కీలకమైన ఇమ్యునోగ్లోబులిన్స్ ఇంజెక్షన్లను ఆశించిన స్థాయిలో ఇవ్వలేదని చెబుతున్నారు. సాధారణంగా ఈ వ్యాధి బారినపడిన వారికి బరువును బట్టి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు 50 కిలోల బరువున్న రోగికి 20 గ్రాములు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో వయల్ ఖరీదు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఉంటే...అందులో ఐదు గ్రాముల వరకూ మాత్రమే ఉంటుంది. అంటే, రోగికి ప్రతిరోజూ కనీసం ఐదు నుంచి ఏడు వరకు ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది. తక్కువలో తక్కువ రోజుకు కనీసం లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే కేజీహెచ్‌కు గడిచిన కొన్ని రోజులు నుంచి ఈ ఇంజెక్షన్ల సరఫరా ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నారు. ఉన్న ఇంజెక్షన్లను కూడా రోగులకు ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. రోజుకు ఒక్కో రోగికి ఐదు నుంచి ఏడు వరకు ఇంజెక్షన్లు అవసరం ఉంటే...ఒక్కటి కూడా ఇవ్వడం లేదు. ఈ వ్యాధి బారినపడి సోమవారం చనిపోయిన మహిళకు 11 రోజుల వ్యవధిలో సుమారు పది వరకు ఇంజెక్షన్లు చేయగా, వాటిలో రెండు మాత్రమే కేజీహెచ్ నుంచి ఇచ్చినట్టు చెబుతున్నారు. మిగిలినవి కుటుంబసభ్యులు బయట కొనుగోలు చేసుకున్నట్టు తెలిసింది. దీనిపై ఆస్పత్రి అధికారులు మాత్రం మాట్లాడడం లేదు. ఆస్పత్రి అధికారులు ఈ మరణాన్ని కూడా జీబీఎస్‌గా నిర్ధారించడం లేదు. గుండెపోటుతో మరణించినట్టు ప్రకటించడం గమనార్హం. ఇదిలావుంటే ఈ మరణాన్ని నిర్ధారించే విషయంలో ఆస్పత్రిలో పెద్ద వివాదమే జరిగినట్టు తెలుస్తోంది. మహిళ మృతి చెందిన వెంటనే జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన వైద్యులు జీబీఎస్‌గా పేర్కొనగా..ఉన్నతాధికారులు నుంచి వచ్చిన ఒత్తిడితో దీన్ని మార్చే ప్రయత్నం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.
Updated Date - Feb 18 , 2025 | 01:37 AM