సీలేరు జలవిద్యుత్ కేంద్రం స్విచ్‌యార్డులో మంటలు
ABN, Publish Date - Feb 25 , 2025 | 11:19 PM
సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోని స్విచ్‌యార్డులో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
డొంకరాయి ఫీడర్ జంపర్ తెగిపోవడంతో సంఘటన
రాష్ట్రంలో పలు ప్రాంతాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
మధ్యాహ్నం 3.30 గంటలకు పునరుద్ధరణ
సీలేరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోని స్విచ్‌యార్డులో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక జలవిద్యుత్ కేంద్రం వెనుక గల స్విచ్‌యార్డులో మంగళవారం ఉదయం పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జలవిద్యుత్ కేంద్రంలో విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తమై స్విచ్‌యార్డుకు వెళ్లే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం ఇంజినీర్లు, సిబ్బంది స్విచ్‌యార్డుకు చేరుకుని మంటలు చెలరేగిన ప్రదేశాన్ని పరిశీలించారు. స్విచ్‌యార్డు నుంచి డొంకరాయికి వెళ్లే విద్యుత్ ఫీడర్‌కు చెందిన 220 కేవీ విద్యుత్ లైన్లలో వై ఫేజ్‌కు చెందిన ట్రాన్స్‌ఫార్మర్ జంపర్ తెగిపోయినట్టు గుర్తించారు. దీంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించి, మధ్యాహ్నం 3.30 గంటలకు డొంకరాయి ఫీడర్‌కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈసమస్యతో రాష్ట్రంలో పలు ప్రాంతాలకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనిపై స్థానిక జలవిద్యుత్ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా.. డొంకరాయి ఫీడర్‌లోని జంపర్ తెగిపోవడంతో మంటలు చెలరేగాయని, వెంటనే తమ సిబ్బంది గమనించి పునరుద్ధరణ చర్యలు చేపట్టారన్నారు.
Updated Date - Feb 25 , 2025 | 11:19 PM