పర్యాటకుల సందడి
ABN, Publish Date - Feb 02 , 2025 | 11:40 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. ప్రధానంగా అరకు ఉత్సవ్ జరుగుతుండడంతో పనిలో పనిగా ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రదేశాలను తిలకిస్తూ సాయంత్రానికి అరకులోయ చేరుకుని ఉత్సవ్‌లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు ఆసక్తి కనబరిచారు.
ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు కిటకిట
పాడేరు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. ప్రధానంగా అరకు ఉత్సవ్ జరుగుతుండడంతో పనిలో పనిగా ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రదేశాలను తిలకిస్తూ సాయంత్రానికి అరకులోయ చేరుకుని ఉత్సవ్‌లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు ఆసక్తి కనబరిచారు.
అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటిక, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జల విహారి, పెదబయలు మండలంలో తారాబు జలపాతం, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువులవేనం, లంబసింగి ప్రాంతాలు రద్దీగా కనిపించాయి.
అరకులోయలో..
అరకులోయ: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, తదితర సందర్శనీయ ప్రాంతాలు కిటకిటలాడాయి. అయితే మండలంలోని సుంకరమెట్ట కాఫీ తోటల వద్ద ఉన్న ఉడెన్ బ్రిడ్జికి పర్యాటకులు పోటెత్తడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అరకు- విశాఖ ప్రధాన రహదారిని ఆనుకుని ఉడెన్ బ్రిడ్జి ఉండడంతో వచ్చీపోయే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బొర్రా గుహలు వద్ద..
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు పర్యాటకులు పోటెత్తారు. మూడు రోజులుగా అరకు ఉత్సవ్ జరుగుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఆదివారం 3,500 మంది గుహలను సందర్శించగా, రూ. 2.5 లక్షల ఆదాయం వచ్చిందని యూనిట్ సిబ్బంది తెలిపారు.
లంబసింగిలో..
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. వీకెండ్, అరకు ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో ఆదివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. కొంత మంది పర్యాటకులు ముందు రోజే లంబసింగి చేరుకుని స్థానికంగా బస చేశారు. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది. మంచు అందాలను వీక్షిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేశారు.
చాపరాయి వద్ద..
డుంబ్రిగుడ: మండలంలోని చాపరాయి జల విహారికి పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. తిరుగు ప్రయాణంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న పొద్దుతిరుగుడు పూల తోటల మధ్యలో ఫొటోలు తీసుకున్నారు.
Updated Date - Feb 02 , 2025 | 11:40 PM