ఆధార్ నమోదులో అక్రమాలపై క్రిమినల్ కేసులు
ABN, Publish Date - Feb 25 , 2025 | 11:13 PM
ఆధార్ నమోదు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడితే అందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో కలెక్టర్ దినేశ్‌కుమార్ హెచ్చరిక
మీ-సేవ, నెట్ కేంద్రాలను తనిఖీ చేయండి
ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ నమోదు చేయాలి
జిల్లాలో 1.33 లక్షల మందికి ఆధార్ కార్డులు లేవు
పాడేరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఆధార్ నమోదు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడితే అందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ-సేవ కేంద్రాలు, నెట్ సెంటర్లలో నకిలీ జననధ్రువీకరణ పత్రాలు జారీ చేసే వారిపై, నకిలీ ధ్రువపత్రాలతో ఆధార్ నమోదు చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నెట్ సెంటర్లలో నకిలీ ఆధార్ కార్డుల జారీ కేంద్రాలపై అధికారులు తనిఖీ చేసి కేసులు నమోదు చేయాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఆధార్ నమోదు చేయాలని ఆదేశించారు. ఆధార్ కార్డు ఉన్నవారికి ఆధార్ నవీకరణ చేయాలని, 5, 7 ఏళ్లకు ఒకసారి, 15 నుంచి 17 ఏళ్ల వయస్సు కలిగిన వారికి ఒకసారి అప్‌డేట్ చేయాలన్నారు. అలాగే జిల్లాలో 1 లక్ష 33 వేల మందికి ఆధార్ కార్డులు నమోదు చేయాల్సి ఉందన్నారు. ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లకు లక్ష్యాలు నిర్ధేశించాలన్నారు. అలాగే ఆయా లక్ష్యాలు సాధించలేని డిజిటల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే ఎంపీడీవోలు, తహసీల్దార్లు, నోడల్ అధికారులు, సబ్ కలెక్టర్లు నెలకు నాలుగు సచివాలయాలను విధిగా తనిఖీ చేయాలన్నారు. అలాగే పాఠశాల విద్యార్థులకు డీఈవోలు, టీడబ్ల్యూ డీడీ సమన్వయంతో ఆధార్ కార్డు నమోదు చేయించాలన్నారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆధార్ నమోదు చేయించే బాధ్యత ఐసీడీఎస్ అధికారులపై ఉందని గుర్తు చేశారు. జిల్లాలో 36 వేల మందికి జనన ధ్రువీకరణ పత్రాలు ఇంకా జారీ చేయాల్సిన ఉందని, ఆస్పత్రిలో ప్రసవం జరిగిన తర్వాత లేదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే నాటికి చిన్నారుల జనన ధ్రువీకరణ పత్రాలు అందించాలని, గ్రామ సచివాలయం, పీహెచ్‌సీల్లో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు.
ఆధార్ నమోదుకు నిర్ణీత రుసుం మాత్రమే చెల్లించాలి
ఆధార్ కార్డుల నమోదుకు ప్రభుత్వం నిర్థేశించిన నిర్ణీత రుసుం మాత్రమే చెల్లించాలని జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ సూచించారు. ఆధార్ కార్డులో తప్పులను సరిచేసేందుకు, కొత్తగా ఆధార్ నమోదుకు ఉచితమేనని, బయోమెట్రిక్ నవీకరణకు రూ.100, పేరు, చిరునామా, జెండర్, ఫోన్ నంబర్లు మార్పు చేయడానికి రూ.50, డాక్యుమెంట్ నవీకరణకు రూ.50 మాత్రమే చెల్లించాలన్నారు. జనన ధ్రువీకరణ పత్రం ఉన్నా ఇప్పటికీ ఆధార్ నమోదు చేయించుకోకపోతే ఆధార్ శిబిరానికి వెళ్లి ఆధార్ నమోదు చేసుకోవాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్, ఆధార్ ప్రాజెక్టు మేనేజర్ జావీద్, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, డీఈవో పి.బ్రహ్మాజీరావు, టీడబ్ల్యూ డీడీ ఎల్.రజని, డీఎల్‌డీవో తేజరతన్, పీఎంయూ ప్రోగ్రామ్ అధికారి ఆర్.రాంగోపాల్, గ్రామ సచివాలయాల జిల్లా సమన్వయకర్త సునీల్, మొబైల్ కో-ఆర్డినేటర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 25 , 2025 | 11:13 PM