ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిరుపయోగంగా కేంద్ర నిధులు!

ABN, Publish Date - Feb 25 , 2025 | 11:14 PM

కేంద్రప్రభుత్వం గిరిజనుల ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో విడుదల చేసిన నిధులను ఐటీడీఏ గత ఐదేళ్లుగా మురగబెడుతున్నది. ఈ నిధుల విషయమై రెండేళ్ల క్రితమే కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ హెచ్చరించినా రాష్ట్ర గిరిజన సంక్షేమ అధికారులు పట్టించుకోలేదు. దీంతో అటవీ ఉత్పత్తుల ఆదాయం పెంపు కార్యక్రమం అమలుకు నోచుకోలేదు.

కొయ్యూరు మండలం అంతాడ వీడీవీకేలో నిరుపయోగంగా ఉన్న అడ్డాకులు, చింతపండు ప్రొసెసింగ్‌ యంత్రాలు

వీడీవీకేల ఏర్పాటుకు కేంద్రం ఇచ్చిన రూ.10 కోట్లు వ్యయం చేయని దుస్థితి

నిధుల వ్యయం కాకపోవడంపై రెండేళ్ల క్రితం హెచ్చరించిన కేంద్రం

పట్టించుకోని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు

అమలుకు నోచుకోని అటవీ ఉత్పత్తుల ఆదాయం పెంపు కార్యక్రమం

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

గిరిజన ప్రాంతంలో అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజనుల ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో అవసరమైన శిక్షణ, యంత్ర పరికరాలను అందించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా అటవీ ఉత్పత్తులైన చింతపండు, అడ్డాకులు, చీపుర్లు, చిరు ధాన్యాలు, తేనె, కరక్కాయ, ఉసిరి, నరమామిడి, నల్లజీడి, లక్క తదితర అటవీ ఉత్పత్తులను సేకరించే 300 మంది గిరిజనులను ఒక యూనిట్‌గా చేసి, వన్‌ధన్‌ వికాస కేంద్రం(వీడీవీకే) ఏర్పాటు చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నిర్ణయించింది. ఒక్కో వన్‌ధన్‌ వికాస కేంద్రానికి ఉత్పత్తుల ప్రొసెసింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు రూ.6 లక్షలు, యంత్ర పరికరాలను కొనుగోలు చేసుకునేందుకు రూ.9 లక్షలు చొప్పున రూ.15 లక్షలను కేంద్రం మంజూరు చేసింది. ఈవిధంగా పాడేరు ఐటీడీఏ పరిధిలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 54 వీడీవీకేలకు రూ.8 కోట్ల 10 లక్షలు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 16 వీడీవీకేలకు రూ.2 కోట్ల 40 లక్షలు కేంద్రం విడుదల చేసింది.

వీడీవీకేల ఏర్పాటుపై ఐదేళ్ల్లుగా నిర్లక్ష్యమే

ఏజెన్సీలో వన్‌ధన్‌ వికాస కేంద్రాల ఏర్పాటుపై జీసీసీ, ఐటీడీఏ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో నాలుగేళ్లుగా వీటిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. దీంతో అందుకు విడుదలైన నిధులు మురుగుతున్నాయి. 2019లో 54 వీడీవీకేలకు రూ.8 కోట్ల 10 లక్షలు మంజూరయ్యాయి. కేంద్రం ఆలోచన మేరకు ఆయా నిధులతో వీడీవీకేలను ఏర్పాటు చేసి, గిరిజనులకు అవసరమైన శిక్షణ ఇచ్చి, వారి ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలి. కాని వీడీవీకేలపై జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో నోడల్‌ ఏజెన్సీగా ఉన్న ఐటీడీఏ పీవో వంటి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. కాని 2020లో ఐటీడీఏ పీవోగా వచ్చిన వెంకటేశ్వర్లు వీడీవీకేలను పట్టాలెక్కించాలని భావించి, సుమారు రూ.50 లక్షలతో 39 వీడీవీకేలకు చింతపండు కేకులు తయారుచేసే యంత్రాలు, అడ్డాకులు తయారు చేసే యంత్రాలు, అడ్డాకులు కుట్టేందుకు మిషన్లు కొనుగోలు చేసి, గిరిజనులకు శిక్షణ ఇప్పించారు. వాటిని వినియోగంలోకి తీసుకువచ్చే క్రమంలో ఆయనకు 2021లో బదిలీ కావడంతో వన్‌ధన్‌ కేంద్రాలు అటకెక్కాయి. అలాగే ఐటీడీఏకు చైర్మన్‌ హోదాలో ఉన్న జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏకు ప్రాజెక్టు అధికారి సైతం పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయా యంత్ర పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈక్రమంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మరో 16 వీడీకేవీలు మంజూరయ్యాయి. వాటికి సంబంధించి రూ.2.4 కోట్లు విడుదలయ్యాయి. అయితే జీసీసీ, ఐటీడీఏ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోపాటు జాతీయ స్థాయిలో వీడీవీకేలకు నోడల్‌ ఏజెన్సీగా ఉన్న ట్రైఫెడ్‌ అధికారుల నిర్లక్ష్యంతో గత ఐదేళ్లుగా పాడేరు ఐటీడీఏ పరిధిలో ఒక్క వీడీవీకేను సంపూర్ణంగా ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో రెండు విడతలుగా మంజూరు చేసిన రూ.10 కోట్ల 50 లక్షల్లో రూ.50 లక్షలతో యంత్రాలు కొనుగోలు చేయగా, మిగిలిన రూ.10 కోట్లు అప్పటి నుంచి మురుగుతున్నాయి.

2021లో నిధులు విడుదల కాని దుస్థితి

పాడేరు ఐటీడీఏ పరిధిలో 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో విడుదల చేసిన నిధులను వ్యయం చేయకపోవడంతో 2021-22లో మంజూరు చేసిన 28 వీడీవీకేలకు సంబంధించి రూ.4కోట్ల, 20 లక్షలను కేంద్రం విడుదల చేయలేదు. గతంలో ఇచ్చిన నిధులను వినియోగించని కారణంగానే తాజాగా నిధులు విడుదల చేయలేదని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ పేర్కొంది.

కేంద్రం హెచ్చరించినా పట్టించుకోని రాష్ట్ర అధికారులు

వీడీవీకేల ఏర్పాటుపై జీసీసీ, ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం సీరియస్‌ అయ్యింది. అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులకు ఎంతో ఉపయోగపడే వీడీవీకేలను ఇన్నాళ్లుగా ఏర్పాటు చేయకుండా, నిధులను మురగబెట్టడడం ఏంటని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అప్పట్లో ప్రశ్నించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వీడీవీకేల వాస్తవ పరిస్థితి, నిధుల వ్యయంపై క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి నివేదికను సమర్పించాలని రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీగా ఉన్న గిరిజన సహకార సంస్థను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశించింది. అప్పట్లో జీసీసీ అధికారులు వీడీవీకేల స్థితిగతులపై ఆరా తీసి, వాస్తవ పరిస్థితిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారుల ద్వారా కేంద్రానికి సమర్పించారు. అయినప్పటికీ ఐటీడీఏ, జీసీసీ అధికారుల్లో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో ఇప్పటికీ ఏజెన్సీలో వన్‌ధన్‌ వికాస కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం, వాటికి విడుదల చేసిన నిధులు మురిగిపోవడం కొనసాగుతున్నది.

Updated Date - Feb 25 , 2025 | 11:14 PM