ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మరో ఫెర్రో కంపెనీ మూత

ABN, Publish Date - Feb 18 , 2025 | 01:50 AM

స్థానిక ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లోని రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి ఫెర్రో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యాజమాన్యం తమను నమ్మించి నట్టేట ముంచిందని కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

  • నేటి నుంచి విధులకు రావద్దంటూ ‘రాజరాజేశ్వరి’ కంపెనీ యాజమాన్యం ప్రకటన

  • ఆందోళనకు దిగిన కార్మికులు

  • నమ్మించి నట్టేట ముంచారంటూ ఆగ్రహం

  • ముందస్తు నోటీసు, బకాయి జీతాలు ఎందుకు ఇవ్వలేదని నిలదీత

  • ఈనెల 25న జీతాలు చెల్లిస్తామని యాజమాన్యం హామీ

  • తాత్కాలికంగా ఆందోళన విరమించిన కార్మికులు

అచ్యుతాపురం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి):

స్థానిక ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లోని రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి ఫెర్రో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యాజమాన్యం తమను నమ్మించి నట్టేట ముంచిందని కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మంగళవారం నుంచి కార్మికులు ఎవరూ విధులకు రావాల్సిన అవసరం లేదని యాజమాన్య ప్రతినిధులు ప్రకటించడంతో కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు. కర్మాగారంలో ఉత్పత్తి అయిన సరకును బయటకు తరలించే వరకు తమను బుజ్జగించిందని, ఇప్పుడు కంపెనీలో పనులు లేవంటూ మాయమాటలు చెబుతున్నదని ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించి పూర్వాపరాలిలా వున్నాయి.

ప్రత్యేక ఆర్థిక మండలిలో రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి ఫెర్రో ఫ్రైవేట్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో సుమారు 550 ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. ఫెర్రో ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయంగా పడిపోవడంతో, గత ప్రభుత్వం విద్యుత్‌ ప్రోత్సహకాలు అందజేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో విద్యుత్‌ బకాయిలు పేరుకుపోవడంతో జనవరి 23న ఈపీడీసీఎల్‌ అధికారులు, ఈ కర్మాగారానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో కర్మాగారంలో ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులకు పనిలేకుండా పోయింది. విద్యుత్‌ బకాయిలు చెల్లించి ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని యాజమాన్యం చెప్పింది. అనంతరం కంపెనీ యాజమాన్యం.. ముడిసరకుతో పాటు ఫెర్రో ఉత్పత్తులను కంటైనర్ల ద్వారా బయటకు తరలించడం ప్రారంభించింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న కార్మికులు ఈ నెల నాలుగో తేదీన కంపెనీకి వచ్చి ఆందోళనకు దిగారు. కంటైనర్లు కర్మాగారంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. జీతాల బకాయిలు ఇవ్వకుండా, కర్మాగారం మూసేస్తున్నామని చెప్పకుండా.. గుట్టుచప్పుడు కాకుండా కర్మాగారంలో ఉన్న ముడిసరకుతోపాటు ఫెర్రో ఉత్పత్తులను ఎలా తరలిస్తారంటూ యాజమాన్య ప్రతినిధులపై మండిపడ్డారు. దీంతో కంగుతిన్న యాజమాన్యం.. ‘‘కర్మాగారం మూసేస్తామని ఎవరు చెప్పారు? చట్టప్రకారం కార్మికులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా మూసేస్తాం? ఉత్పత్తయిన ఫెర్రోను మాత్రమే బయటకు పంపుతున్నాం. కార్మికులు యథావిధిగా విధులకు హాజరు కావచ్చు’’ అని చెప్పారు. దీంతో శాంతించిన కార్మికులు అప్పటి నుంచి విధులకు హాజరవుతున్నారు. కానీ యాజమాన్యం కర్మాగారంలో క్యాంటీన్‌ను మూసివేసింది. తర్వాత ఉద్యోగులను తీసుకువచ్చి, తిరిగి తీసుకెళ్లే బస్సులను ఆపేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ఎవరూ విధులకు రావద్దంటూ యాజమాన్యం సోమవారం ప్రకటించింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన కార్మికులు ఆందోళనకు దిగారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా, రెండు నెలల బకాయి జీతాలు చెల్లించకుండా విధులకు రావద్దంటే ఎలా అని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగివచ్చిన యాజమాన్యం.. ఈనెల 25న జీతాలు చెల్లిస్తామని చెప్పడంతో కార్మికులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.

Updated Date - Feb 18 , 2025 | 01:50 AM