అల్లూరి పార్కులో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు
ABN, Publish Date - Feb 06 , 2025 | 12:33 AM
అల్లూరి పార్కులో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. బుధవారం పార్కును సందర్శించి అల్లూరి, గంటందొరల సమాధులకు, విగ్రహాలకు నివాళులర్పిం చారు.
జడ్పీ సీఈవో నారాయణమూర్తి
కృష్ణాదేవిపేట, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): అల్లూరి పార్కులో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. బుధవారం పార్కును సందర్శించి అల్లూరి, గంటందొరల సమాధులకు, విగ్రహాలకు నివాళులర్పిం చారు. అనంతరం పార్కులోని కళామందిరంలో అల్లూరి జీవిత చరిత్ర చిత్రపటాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పర్యాటకులకు తాగునీటి సౌకర్యం కల్పించడానికి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. వేసవిలో జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. లింగంపేట, ఏటిగైరంపేట తాగునీటి పథకాలకు గత ఏడాది రూ.28 లక్షలు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మేరీరోజ్, ఈవోపీఆర్‌డీ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సిబ్బంది కొరత లేకుండా చర్యలు
గొలుగొండ: ఉమ్మడి జిల్లాలో గల మండలపరిషత్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపడుతున్నట్టు జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. బుధవారం మండలంలోని ఏటిగైరంపేట, చోద్యం గ్రామాల్లో గల భారీ తాగునీటి పథకాల పనితీరును పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 45 భారీ తాగునీటి పథకాలు ఉన్నాయన్నారు. మండల పరిషత్ కార్యాలయాల్లో మార్చి నెలలో ఎన్నికల కోడ్ రద్దయిన వెంటనే సిబ్బందిని సర్దుబాటు చేస్తామని చెప్పారు. అలాగే వచ్చే వేసవికి తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. గొలుగొండ మండల పరిషత్ కార్యాలయ మరమ్మతులకు మండల పరిషత్ సాధారణ నిధుల నుంచి ప్రస్తుతం పనులు జరుగుతున్నాయన్నారు. ఆ నిధులు సరిపడకపోతే జిల్లా పరిషత్ సాధారణ నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే హైస్కూల్లో అసంపూర్తి పనులను గుర్తించి ఆ పనులు పూర్తి చేసేందుకుగాను ప్రతిపాదనలు సిద్ధం చేస్తే జడ్పీ సాధారణ నిధుల నుంచి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మేరీరోజీ, వ్యవసాయాధికారిని సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 06 , 2025 | 12:33 AM